
ఆది నుంచీ అంతే...
ఒంగోలు క్రైం : నాలుగేళ్ల కుమారుడిని చిత్రహింసలకు గురిచేసి కసాయిగా మారిన ఓ తల్లి ఉదంతం ఒంగోలులో శనివారం చైల్డ్‌లైన్ ప్రతినిధుల చొరవతో వెలుగు చూసింది. తల్లి షేక్ రిజ్వానా తీరు మొదటి నుంచీ వివాదాస్పదమే. ఈమె చేష్టలను తట్టుకోలేక భర్త అల్లాభక్షు తన స్వగ్రామం చినగంజాంకు వెళ్లిపోయాడు. ఆమె ఆనందాలకు, సుఖాలకు ఆ పసివాడు అడ్డంగా ఉంటున్నాడని చివరకు వాతలు వేయటం, కొట్టడం, తిండి సరిగా పెట్టక పోవటంతో స్థానికులు ఈ విషయాన్ని చైల్డ్‌లైన్ ప్రతినిధులకు చేరవేయడంతో ఒంగోలు వన్‌టౌన్ సి.ఐ. కె.వి.సుభాషిణిని తీసుకొని శనివారం మధ్యాహ్నం కోటవీధిలోని ఆ ఇంటికి చేరుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే... స్థానిక ఇస్లాంపేటకు చెందిన రిజ్వానాను చినగంజాంకు చెందిన అల్లాభక్షుకు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లయినప్పటి నుంచి కాపురాన్ని చినగంజాం నుంచి ఒంగోలుకు మకాం మారుద్దామని భర్తతో ఘర్షణ పడడంతో ఒంగోలుకు పెళ్లయిన ఏడాదికే కాపురాన్ని మార్చారు. అల్లాభక్షు నగరంలోని పలు షాపుల్లో ముఠా మేస్త్రిగా పని చేశేవాడు. ఒంగోలు వచ్చిన తరువాత కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో ఏడాది క్రితం భార్యను, కుమారుడిని వదిలేసి తిరిగి స్వగ్రామం చినగంజాం వెళ్లిపోయాడు. ఆరు నెలల క్రితం ఇస్లాంపేటలోని ఆమె తల్లి,దండ్రులకు చెందిన ఆస్తి విక్రయించగా కొంత డబ్బు వచ్చింది.
ఇందులో రూ.లక్ష రిజ్వానాకు ఇచ్చి తల్లి కూడా కుమార్తె వద్దకే వచ్చేసింది. ఆరు నెలల క్రితం ఇస్లాంపేట నుంచి స్థానిక బాపూజీ కాంప్లెక్స్‌కు ఎదురుగా ఉన్న కోట వీధిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటోంది. ఇటీవల తల్లి కూడా ఈమె చేష్టలు నచ్చక వేరే కుమార్తె వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి తన కుమారుడిని చిత్రహింసలకు గురిచేయటం మొదలు పెట్టింది. చైల్డ్ లైన్ ప్రతినిధులు సులోచన, మురళీకృష్ణ, ఎం.కిశోర్ కుమార్, బి.వి.సాగర్‌ల జోక్యంతో ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలుడిని శిశు సదన్‌కు పంపించారు. చినగంజాం నుంచి భర్త అల్లాభక్షును కూడా రప్పిస్తున్నట్టు సిఐ వివరించారు.