
అంగీకారపత్రం అందజేస్తున్న బాలిక కుటుంబీకులు
మంచాల : తండాలో జరుగుతున్న బాల్యవివాహాన్ని చైల్డ్‌లైన్ అధికారులు మంచాల పోలీసుల సహకారంతో అడ్డుకున్నారు. మంచాల మండల పరిధిలోని ఎల్లమ్మతండాకు చెందిన కరంటోత్ రమణ ఆటోడ్రైవర్. ఇతనికి 16 సంవత్సరాల కుమార్తె ఉంది. ఆ బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామంలో ఉండే అక్క కుమారుడు సపావట్ సురేష్‌కు తన కూతురును ఇచ్చి వివాహం చేయాలని రమణ నిర్ణయించాడు.
పెద్ద సమక్షంలో ముహూర్తం కూడా ఖరారు చేసుకొని సోమవారం పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ ఎస్. వెంకటేష్, మంచాల ఎస్‌ఐ సుధాకర్‌తో కలిసి తండాకు వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులు రమణ, సుశీలకు బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాలను వివరించారు. 18 సంవత్సరాలు నిండిన తరువాతే ఆడపిల్లలకు వివాహం చేయాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని, అందుకు 2 సంవత్సరాలు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. బాల్య వివాహాం చేయమని బాలిక తల్లిదండ్రులు రాత పూర్వకంగా అంగీకార పత్రం అందించారు.