childline officials
-
బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
మంచాల : తండాలో జరుగుతున్న బాల్యవివాహాన్ని చైల్డ్‌లైన్ అధికారులు మంచాల పోలీసుల సహకారంతో అడ్డుకున్నారు. మంచాల మండల పరిధిలోని ఎల్లమ్మతండాకు చెందిన కరంటోత్ రమణ ఆటోడ్రైవర్. ఇతనికి 16 సంవత్సరాల కుమార్తె ఉంది. ఆ బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామంలో ఉండే అక్క కుమారుడు సపావట్ సురేష్‌కు తన కూతురును ఇచ్చి వివాహం చేయాలని రమణ నిర్ణయించాడు. పెద్ద సమక్షంలో ముహూర్తం కూడా ఖరారు చేసుకొని సోమవారం పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ ఎస్. వెంకటేష్, మంచాల ఎస్ఐ సుధాకర్‌తో కలిసి తండాకు వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులు రమణ, సుశీలకు బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాలను వివరించారు. 18 సంవత్సరాలు నిండిన తరువాతే ఆడపిల్లలకు వివాహం చేయాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని, అందుకు 2 సంవత్సరాలు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. బాల్య వివాహాం చేయమని బాలిక తల్లిదండ్రులు రాత పూర్వకంగా అంగీకార పత్రం అందించారు. -
చిన్నారి దత్తతపై వివాదం
సాక్షి, బోనకల్ ఖమ్మంజిల్లా : మండలంలోని రావినూతల గ్రామంలో రెండు నెలల చిన్నారి దత్తతపై గ్రామస్తుల ఫిర్యాదుతో వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన దారెల్లి సునీల్, ఉషారాణి దంపతులకు ఐదుగురు కుమార్తెలున్నారు. రెండు నెలల క్రితం పుట్టిన ఐదవ కుమార్తెను కృష్ణా జిల్లా నందిగామ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన జిల్లేపల్లి భీమయ్య, సంధ్య దంపతులకు దత్తత ఇచ్చేదుకు రాసుకున్న ఒప్పందంలో చిన్నారి సంరక్షణకు అర ఎకరం పొలం ఇచ్చేటట్లు అంగీకరించారు. ఈ నెల 9న చిన్నారిని భీమయ్య దంపతులు తీసుకెళ్లారు. చిన్నారికి ఇస్తనన్న పొలం విషయంలో సమస్య రావడంతో పాటు గ్రామంలో చిన్నారి వ్యవహారంపై చర్చ జరిగి కొందరు 1098కు ఫిర్యాదు చేశారు. దీంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ మాలతి, 1098 అధికారి నాగమణి, పోలీసు సిబ్బంది రావినూతలలో సోమవారం విచారణ నిర్వహించారు. పాప తల్లిదండ్రులను వివరాలు అడిగి మంగళవారం పాపను ఐసీడీఎస్ కార్యాలయానికి తీసుకు రావాలని ఆదేశించారు. -
ఆది నుంచీ అంతే...
ఒంగోలు క్రైం : నాలుగేళ్ల కుమారుడిని చిత్రహింసలకు గురిచేసి కసాయిగా మారిన ఓ తల్లి ఉదంతం ఒంగోలులో శనివారం చైల్డ్‌లైన్ ప్రతినిధుల చొరవతో వెలుగు చూసింది. తల్లి షేక్ రిజ్వానా తీరు మొదటి నుంచీ వివాదాస్పదమే. ఈమె చేష్టలను తట్టుకోలేక భర్త అల్లాభక్షు తన స్వగ్రామం చినగంజాంకు వెళ్లిపోయాడు. ఆమె ఆనందాలకు, సుఖాలకు ఆ పసివాడు అడ్డంగా ఉంటున్నాడని చివరకు వాతలు వేయటం, కొట్టడం, తిండి సరిగా పెట్టక పోవటంతో స్థానికులు ఈ విషయాన్ని చైల్డ్‌లైన్ ప్రతినిధులకు చేరవేయడంతో ఒంగోలు వన్‌టౌన్ సి.ఐ. కె.వి.సుభాషిణిని తీసుకొని శనివారం మధ్యాహ్నం కోటవీధిలోని ఆ ఇంటికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... స్థానిక ఇస్లాంపేటకు చెందిన రిజ్వానాను చినగంజాంకు చెందిన అల్లాభక్షుకు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. పెళ్లయినప్పటి నుంచి కాపురాన్ని చినగంజాం నుంచి ఒంగోలుకు మకాం మారుద్దామని భర్తతో ఘర్షణ పడడంతో ఒంగోలుకు పెళ్లయిన ఏడాదికే కాపురాన్ని మార్చారు. అల్లాభక్షు నగరంలోని పలు షాపుల్లో ముఠా మేస్త్రిగా పని చేశేవాడు. ఒంగోలు వచ్చిన తరువాత కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో ఏడాది క్రితం భార్యను, కుమారుడిని వదిలేసి తిరిగి స్వగ్రామం చినగంజాం వెళ్లిపోయాడు. ఆరు నెలల క్రితం ఇస్లాంపేటలోని ఆమె తల్లి,దండ్రులకు చెందిన ఆస్తి విక్రయించగా కొంత డబ్బు వచ్చింది. ఇందులో రూ.లక్ష రిజ్వానాకు ఇచ్చి తల్లి కూడా కుమార్తె వద్దకే వచ్చేసింది. ఆరు నెలల క్రితం ఇస్లాంపేట నుంచి స్థానిక బాపూజీ కాంప్లెక్స్‌కు ఎదురుగా ఉన్న కోట వీధిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటోంది. ఇటీవల తల్లి కూడా ఈమె చేష్టలు నచ్చక వేరే కుమార్తె వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి తన కుమారుడిని చిత్రహింసలకు గురిచేయటం మొదలు పెట్టింది. చైల్డ్ లైన్ ప్రతినిధులు సులోచన, మురళీకృష్ణ, ఎం.కిశోర్ కుమార్, బి.వి.సాగర్ల జోక్యంతో ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలుడిని శిశు సదన్‌కు పంపించారు. చినగంజాం నుంచి భర్త అల్లాభక్షును కూడా రప్పిస్తున్నట్టు సిఐ వివరించారు. -
సవతి తల్లి అకృత్యం..
ప్రకాశం: పేగు తెంచుకుని పుట్టలేదనేమో ఓ చిన్నారిపై సవితి తల్లి వివక్షను చూపింది. తాను ఒక తల్లిననే విషయం మరిచి బాలిక ఒంటిపై వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. సవతి తల్లి అకృత్యానికి తాళ లేక ఆ చిన్నారి అమ్మ.. అమ్మ.. అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నా ఆమె మనసు కరగలేదు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు శ్రీరాంకాలనీలో సోమవారం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ ప్రతినిధులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకవెళ్లారు. బాలికను చిత్రహింసలకు గురిచేస్తున్న సవతి తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.