వాగ్వాదానికి దిగుతున్న టీడీపీ ఎంపీటీసీ సభ్యులు
నరసన్నపేట : మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజప్రతినిధుల సమక్షంలో ఆర్‌డబ్ల్యూఎస్ మహిళా ఇంజనీరు కన్నీరుమున్నీరయ్యారు. టీడీపీ ఎంపీటీసీ సభ్యుల దురుసు ప్రవర్తనతో దుఃఖాన్ని ఆపుకోలేక సమావేశం మధ్యలోనే ఆమె కార్యాలయానికి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. నరసన్నపేట మండల సమావేశంలో రక్షిత నీటి సరఫరా పద్దుపై సమీక్ష జరుగుతున్నప్పుడు ఆర్‌ఆడబ్ల్యూఎస్ ఏఈ హేమలత మండలంలో తాగునీటి సరఫరాపై వివరణ ఇస్తున్నారు. ఆ సమయంలో ఉర్లాం ఎంపీటీసీ, మండల ఉపాధ్యక్షుడు చమళ్ల వామనమూర్తి మాట్లాడుతూ తన పరిధిలోని పలు గ్రామాలకు తాగునీరు అందడం లేదని, బాలసీమ పంచాయతీలో నీటి కోసం గ్రామస్తులు ఇబ్బందిపడుతున్నా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
దీనిపై ఏఈ స్పందిస్తూ గ్రామాల్లోకి వస్తున్నప్పుడు ఎవరూ చెప్పడం లేదని, తన దృష్టికి సమస్య తీసుకొస్తే పరిష్కరిస్తానని బదులిచ్చారు. ‘నీవు ఎప్పుడు వస్తున్నావు. నన్ను ఒక రోజూ కలవలేదు. నన్ను కలవాల్సిన బాధ్యత లేదా?’ అని వామనమూర్తి ప్రశ్నించారు. ‘వచ్చిన ప్రతిసారీ మీకు కలవాల్సిన అవసరం లేదు. మండలంలో 34 పంచాయతీలు ఉన్నాయి. 83 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామం వెళ్లినప్పుడు ఎంపీటీసీలకు కలవాలంటే ఎలా కుదురుతుంది.
అలా చేయలేం’ అని ఆమె సమాధానమిచ్చారు. ఈ విషయంలో ఏఈ పద్ధతి బాగా లేదంటూ వామనమూర్తి కూర్చుండిపోయారు. అనంతరం టీడీపీ ఎంపీటీసీ సభ్యులు పీస కృష్ణ, టి.గోవిందరావు, యారబాడు ఎంపీటీసీ ప్రతినిధి పి.రమణలు లేచి ఏఈతో వాగ్వాదానికి దిగారు. ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. దీనికి ఈఏ సమాధానం చెబుతుండగా పీస కృష్ణ లేచి ‘నోర్ముయ్.. ఏంటనుకుంటున్నావు.. అంటూ పత్రికలో రాయలేని భాషలో పరుషపదజాలం వాడారు. దీంతో ఏఈ మనస్తాపం చెంది ‘ఒక మహిళా అధికారిపై దురుసుగా ప్రవర్తిసారా.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. సమావేశం మధ్యలోనే కార్యాలయానికి వెళ్లిపోయారు.
సమస్య చెప్పడం తప్పా..?
తాగునీటి ఎద్దడి ఉందని చెబుతూ సమస్యను ఆమె దృష్టికి తీసుకువెళ్లామని.. ఇది తప్పా అని చమళ్ల వామనమూర్తి అన్నారు.
కష్టపడి పనిచేస్తున్నా: ఏఈ
ఏఈ హేమలేత మాట్లాడుతూ తాను కష్టపడి పనిచేస్తున్నానని, రోజూ గ్రామాల్లో తిరుగుతున్నా.. వెళ్లడం లేదని చెప్పడం తగదన్నారు. ప్రతిసారీ ప్రజాప్రతినిధులకు కలవాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం తగదని వాపోయారు.
సంయమనం పాటించాలి..
ఎంపీపీ పార్వతమ్మ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సంయమనం పాటించాలని కోరారు. ఒకరిపై ఒకరు నిందారోపణలకు దిగడం మంచిదికాదన్నారు. అధికారులు సమాధానాలు ఓర్పుగా చెప్పాలని, అదే సమయంలో ప్రజాప్రతినిధులు కూడా అధికారులకు గౌరవం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment