‘మృగవని’కి మహర్దశ
Published Sat, Aug 17 2013 12:26 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
మొయినాబాద్, న్యూస్‌లైన్: ‘మృగవని’ జాతీయ పార్కు దశ మారబోతోంది. త్వరలో కొత్త అందాలను సంతరించుకోనుంది. ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. అటవీ శాఖ ఆధీనంలో ఉన్న చిలుకూరు ‘మృగవని’ జాతీయ పార్కు ఇకపై లక్ష్మీ జ్యోతి ఎకో టూరిజం, జంగల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మరిన్ని వసతులతో కొత్త హంగులు దిద్దనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని జీఓ సైతం జారీ చేసింది. మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 1లో 700 ఎకరాల్లో ‘మృగవని’ జాతీయ పార్కు ఏర్పాటైంది. నగరానికి చేరువలో ఉండటంతోపాటు గండిపేట, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలకు మధ్యలో ఉండటంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు లక్ష్మీజ్యోతి ఎకో టూరిజం, జంగల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
పర్యాటక కేంద్రంగా...
ఇప్పటికే వికారాబాద్‌లో అనంతగిరిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. నగరానికి అనంతగిరి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మృగవని పార్కు కేవలం 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండడంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచీ ప్రజలు సందర్శించే అవకాశం ఉంటుంది. మండలంలో చిలుకూరు బాలాజీ దేవాలయం ఇప్పటికే ఎంతో ప్రసిద్ధి చెందింది. మృగవని పార్కు సైతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే అటు భక్తులు, ఇటు పర్యాటకుల సందడి మరింత పెరగనుంది.
రిసార్ట్, హోటల్ నిర్మాణం...
‘మృగవని’ అభివృద్ధిలో భాగంగా పార్కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో కొత్తగా రిసార్ట్, హోటల్ నిర్మాణం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నాలుగెకరాల స్థలంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు మరో మూడు నెలల్లో పూర్తికానున్నాయి. ఇందులో పర్యాటకులకు అద్దెకు గదులు, స్విమ్మింగ్‌పూల్, వివిధ రకాల రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉంచనున్నారు. పార్కును సందర్శించిన పర్యాటకులకు కావాల్సిన అన్ని వసతులతో రిసార్ట్ ఏర్పాటు చేయనున్నారు.
పెరగనున్న చార్జీలు..
కొత్త హంగులను సంతరించుకోనున్న పార్కులో ఇక ముందు ప్రవేశరుసుము, సఫారీ చార్జీలు పెరుగనున్నాయి. ఇప్పటి వరకు ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి రూ.5 చొప్పున వసూలు చేసేవారు. ఇకపై అది రూ.10కి పెరగనుంది. 12 ఏళ్ల లోపు పిల్లలకు రూ.5 వసూలు చేస్తారు. పార్కులోని అందాలు, జంతువులు, పక్షులు చూసేందుకు సఫారీ(మినీబస్సు)లో వెళ్లాల్సి ఉంటుంది. అందులో వెళ్లేందుకు ఇప్పటి దాకా ఒక్కొక్కరికి రూ.5 వసూలు చేసేవారు. దాన్ని ఇకముందు రూ.10కి పెంచనున్నారు. నేచర్‌క్యాంప్‌నకు వచ్చే వారు రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. పార్కులోని కాటేజీల ధర సైతం పెరగనుంది. ఈ చార్జీలన్నీ వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నాయి.
Advertisement
Advertisement