ప్రేమ పెళ్లి చేసుకున్నాడని చంపేశారు?
- మిస్టరీ వీడుతున్న గుర్తు తెలియని మృతదేహం కేసు
- హతుడు శ్రీరామ్ చిట్స్‌లో ఉద్యోగి
- భార్య బంధువులే హంతకులు
- పోలీసుల అదుపులో అనుమానితులు
డోన్: వెంకటనాయునిపల్లె కొండల్లో ఈనెల 12వ తేదీన బయటపడిన గుర్తు తెలియని మృతదేహం కేసు మిస్టరీ వీడుతోంది. డోన్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ మృతదేహంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షలు నిమిత్తం పంపించగా మృతదేహం 30 సంవత్సరాల యువకుడిదేనని డాక్టర్లు ధ్రువీకరించినట్లు తెలిసింది. దీంతో కర్నూలు నాల్గొవ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఈనెల8వ తేదీన అదృశ్యమైన చంద్రశేఖర్‌దేనన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. సీఐ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో రూరల్ ఎస్‌ఐ రామసుబ్బయ్య చేపట్టిన దర్యాప్తులో పలు ఆసక్తి కర విషయాలు వెల్లడైనట్లు తెలిసింది.
ప్రేమ వివాహమే కారణమా..
డోన్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన తలారి రామాంజనేయులు, రామలక్ష్మమ్మ కుమారుడు బోయచంద్రశేఖర్(30) శ్రీరామ్ చిట్స్‌లో ఉద్యోగి. గత ఏడాదిన్నర క్రితం వెల్దుర్తి మండలం గుంటుపల్లెకు చెందిన రైల్వే ఉద్యోగి వెంకటేశ్వరమ్మతో ప్రేమ వివాహమైంది. వెంకటేశ్వరమ్మకు తండ్రి మృతి చెందడంతో ఆయన ఉద్యోగం వచ్చింది. కుటుంబంలోని ఆడపిల్లలు, తల్లి కుటుంబ పోషణ వెంకటేశ్వరమ్మ పై ఆధారపడింది. ఈ క్రమంలో ఆమె చంద్రశేఖర్‌తో ప్రేమ వివాహం చేసుకొని కర్నూలులో కాపురం పెట్టారు. వీరిని విడదీసేందుకు వెంకటేశ్వరమ్మ తల్లి, మేనమామలు యత్నించి విఫలమయ్యారు. దీంతో జీర్ణించుకోలేని బంధువులే చంద్రశేఖర్‌ను కడతేర్చారనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
ఈనెల 7వ తేదీన చంపేశారు:
ఈనెల 7వ తేదీన విధి నిర్వహణ నిమిత్తం డోన్‌కు వచ్చిన చంద్రశేఖర్ పలు బ్యాంకుల్లో పనులు ముగించుకొని సాయంత్రం 7గంటల ప్రాంతంలో బైక్ పై కర్నూలుకు బయల్దేరారు. టోల్‌గేట్ దాటిన కొద్దిసేపటికే బైక్‌ను అటకాయించిన అగంతకులు చంద్రశేఖర్‌ను క్రూజర్ జీపులోకి ఎక్కించి దారుణంగా హత్య చేశారు. రహదారిపై చీకటి సమయం కావడం ఎవ్వరూ సంఘటనను గమనించలేకపోయారు. దీంతో శవాన్ని ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే వెంకటనాయునిపల్లె అడవుల్లో శవాన్ని దగ్గరుండి మరీ కాల్చి బూడిద చేసినట్లు తెలిసింది. ఈ కేసులో అనుమానితులైన తిమ్మాపురం గ్రామంలోని కిరాణం షాపు యజమానితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హత్యలో సుమారు 10 మందికి పైగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు నుంచి మృతుడి అత్త, ఆమె సోదరులు కూడా పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు.
హత్య కోణంలోనే దర్యాప్తు చేస్తున్నాం
ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా హత్యగానే అనుమానిస్తున్నాం. పూర్వపరాలను విచారిస్తున్నాం. త్వరలోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేస్తాం.
- ఇస్మాయిల్, సీఐ