Dead body case
-
Fact Check: బైక్‌పై బాలుడి మృతదేహం వార్తల్లో అసలు వాస్తవం ఇదీ..
సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నం బీచ్‌లో మృతి చెందిన బాలుడిని ద్విచక్రవాహనంపై తరలించారని, పోలీసులు సరిగా స్పందించలేదన్న వార్తల్లో వాస్తవం లేదని కృష్ణాజిల్లా పోలీసులు వెల్లడించారు. పోలీసులు వాహనం ఏర్పాటు చేయలేదని చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసినా, పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు బాలుడి మృతిపై కృష్ణాజిల్లా పోలీసు కార్యాలయం ఓ ప్రకటన చేసింది. పోలీసుల ప్రకటన ప్రకారం.. గొడుగు పేటకు చెందిన గోళ్ల నవీన్ కుమార్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర స్నానానికి మంగినపూడికి ఆదివారం వెళ్ళాడు. ఈ క్రమంలో అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయ్యాడు. తనతో కలిసి స్నానానికి వెళ్లిన మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకుని.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే విధుల్లో ఉన్న స్థానిక రాబర్ట్ సన్ పేట ఇన్స్పెక్టర్, బందరు తాలూకా, ఆర్ పేట ఎస్ఐలు, మెరైన్ ఎస్ఐ, సిబ్బంది బీచ్‌లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడు గల్లంతైన సమాచారం తల్లిదండ్రులకు తెలియపరిచారు. చీకటి పడే వరకు గాలించినా ఫలితం లేకపోయింది. సోమవారం తెల్లవారుజాము నుంచి గాలింపును తిరిగి కొనసాగించారు. పెదపట్నం, ఇంతేరు చిన్న గొల్లపాలెం వరకు ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. మరోవైపు.. పెదపట్నం బీచ్ ఒడ్డుకు బాలుడి మృతదేహం కొట్టుకు వచ్చిందని స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పోలీసు వారికి సమాచారం ఇవ్వకుండా సంఘటన స్థలానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై బాలుడి మృదేహాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. బాలుడు మృతదేహం పెదపట్నం బీచ్ వద్ద లభ్యమైందని పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ద్విచక్ర వాహనంపై వస్తున్న బాధిత కుటుంబాన్ని ఆపి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి బాలుడి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ క్రమంలో పోలీసు వారు సరైన గాలింపు చర్యలు చేపట్టలేదని, మృతదేహాన్ని తరలించడానికి సైతం వాహనం ఏర్పాటు చేయలేదని, సామాజిక మాధ్యమాల వేదికగా కొంతమంది అసత్యాలను ప్రచారం చేశారు. గాలింపు చర్యలు వేరు వేరు ప్రాంతంలో జరగటం వలన పెదపట్నం బీచ్ వద్దకు చేరుకునే సరికి సమయం పట్టింది గాని, ఇందులో పోలీసు వారు సరిగా స్పందించలేదన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇలాంటి అసత్య ఆరోపణలు ప్రచారం చేసిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడం తప్పదని పోలీసులు హెచ్చరించారు. పోలీసు వారిని సంప్రదించి ఎలాంటి వివరణ తీసుకోకుండా తమప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించాలని చూస్తే చర్యలు తప్పవని బందరు డీఎస్పీ మాసుం భాష హెచ్చరించారు. ఇదీ చదవండి: Fact Check: 'ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం' -
జాడలేని జోజి మృతదేహం
సంగెం(పరకాల): చూస్తుండగానే ఎస్సారెస్పీ కెనాల్లో గల్లంతైన జోజి మృతదేహం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన కట్టవరపు జోజి(30) ఈనెల 23న కూలి పనికి వెళ్లి ఎస్సారెస్పీ ప్రధాన కాల్వ ఒడ్డున మోటార్ ఏర్పాటు చేసి అవతల ఉన్న ట్రాన్స్ఫార్మర్కు కరెంట్ వైరు కలిపేందుకు ఈదుకుంటూ వెళ్లి తిరిగి వస్తుండగా నీటి ఉధృతికి కొట్టుకుపోయిన విషయం విధితమే. అక్కడే ఉన్న పలువురు అతడిని రక్షించేందుకు యత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఆతర్వాత గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కెనాల్లో ఎంత వెతికినా వారం రోజులుగా మృతదేహం లభించలేదు. జోజి గల్లంతైన గాంధీనగర్ నుంచి తీగరాజుపల్లి, ఇటు వర్ధన్నపేట, రాయపర్తి, మైలారం రిజర్వాయర్, అటు మహబూబాబాద్ జిల్లా కురవి వరకు కెనాల్ వెంట రాత్రీ పగలు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు తేజస్విని, కీర్తనతోపాటు బంధువులు రోదిస్తున్నారు. మృతదేహం జాడ లేక కర్మకాండ నిర్వహించలేక, మరణ ధ్రువీకరణ పత్రం లభించని పరిస్థితి ఉందని బంధువులు వాపోతున్నారు. -
ప్రేమ పెళ్లి చేసుకున్నాడని చంపేశారు?
- మిస్టరీ వీడుతున్న గుర్తు తెలియని మృతదేహం కేసు - హతుడు శ్రీరామ్ చిట్స్‌లో ఉద్యోగి - భార్య బంధువులే హంతకులు - పోలీసుల అదుపులో అనుమానితులు డోన్: వెంకటనాయునిపల్లె కొండల్లో ఈనెల 12వ తేదీన బయటపడిన గుర్తు తెలియని మృతదేహం కేసు మిస్టరీ వీడుతోంది. డోన్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ మృతదేహంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షలు నిమిత్తం పంపించగా మృతదేహం 30 సంవత్సరాల యువకుడిదేనని డాక్టర్లు ధ్రువీకరించినట్లు తెలిసింది. దీంతో కర్నూలు నాల్గొవ పట్టణ పోలీసుస్టేషన్లో ఈనెల8వ తేదీన అదృశ్యమైన చంద్రశేఖర్దేనన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. సీఐ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో రూరల్ ఎస్ఐ రామసుబ్బయ్య చేపట్టిన దర్యాప్తులో పలు ఆసక్తి కర విషయాలు వెల్లడైనట్లు తెలిసింది. ప్రేమ వివాహమే కారణమా.. డోన్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన తలారి రామాంజనేయులు, రామలక్ష్మమ్మ కుమారుడు బోయచంద్రశేఖర్(30) శ్రీరామ్ చిట్స్‌లో ఉద్యోగి. గత ఏడాదిన్నర క్రితం వెల్దుర్తి మండలం గుంటుపల్లెకు చెందిన రైల్వే ఉద్యోగి వెంకటేశ్వరమ్మతో ప్రేమ వివాహమైంది. వెంకటేశ్వరమ్మకు తండ్రి మృతి చెందడంతో ఆయన ఉద్యోగం వచ్చింది. కుటుంబంలోని ఆడపిల్లలు, తల్లి కుటుంబ పోషణ వెంకటేశ్వరమ్మ పై ఆధారపడింది. ఈ క్రమంలో ఆమె చంద్రశేఖర్‌తో ప్రేమ వివాహం చేసుకొని కర్నూలులో కాపురం పెట్టారు. వీరిని విడదీసేందుకు వెంకటేశ్వరమ్మ తల్లి, మేనమామలు యత్నించి విఫలమయ్యారు. దీంతో జీర్ణించుకోలేని బంధువులే చంద్రశేఖర్‌ను కడతేర్చారనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఈనెల 7వ తేదీన చంపేశారు: ఈనెల 7వ తేదీన విధి నిర్వహణ నిమిత్తం డోన్‌కు వచ్చిన చంద్రశేఖర్ పలు బ్యాంకుల్లో పనులు ముగించుకొని సాయంత్రం 7గంటల ప్రాంతంలో బైక్ పై కర్నూలుకు బయల్దేరారు. టోల్గేట్ దాటిన కొద్దిసేపటికే బైక్‌ను అటకాయించిన అగంతకులు చంద్రశేఖర్‌ను క్రూజర్ జీపులోకి ఎక్కించి దారుణంగా హత్య చేశారు. రహదారిపై చీకటి సమయం కావడం ఎవ్వరూ సంఘటనను గమనించలేకపోయారు. దీంతో శవాన్ని ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే వెంకటనాయునిపల్లె అడవుల్లో శవాన్ని దగ్గరుండి మరీ కాల్చి బూడిద చేసినట్లు తెలిసింది. ఈ కేసులో అనుమానితులైన తిమ్మాపురం గ్రామంలోని కిరాణం షాపు యజమానితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హత్యలో సుమారు 10 మందికి పైగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు నుంచి మృతుడి అత్త, ఆమె సోదరులు కూడా పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. హత్య కోణంలోనే దర్యాప్తు చేస్తున్నాం ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా హత్యగానే అనుమానిస్తున్నాం. పూర్వపరాలను విచారిస్తున్నాం. త్వరలోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేస్తాం. - ఇస్మాయిల్, సీఐ