సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నం బీచ్‌లో మృతి చెందిన బాలుడిని ద్విచక్రవాహనంపై తరలించారని, పోలీసులు సరిగా స్పందించలేదన్న వార్తల్లో వాస్తవం లేదని కృష్ణాజిల్లా పోలీసులు వెల్లడించారు. పోలీసులు వాహనం ఏర్పాటు చేయలేదని చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసినా, పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు బాలుడి మృతిపై కృష్ణాజిల్లా పోలీసు కార్యాలయం ఓ ప్రకటన చేసింది.
పోలీసుల ప్రకటన ప్రకారం..
గొడుగు పేటకు చెందిన గోళ్ల నవీన్ కుమార్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర స్నానానికి మంగినపూడికి ఆదివారం వెళ్ళాడు. ఈ క్రమంలో అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయ్యాడు. తనతో కలిసి స్నానానికి వెళ్లిన మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకుని.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే విధుల్లో ఉన్న స్థానిక రాబర్ట్ సన్ పేట ఇన్‌స్పెక్టర్, బందరు తాలూకా, ఆర్ పేట ఎస్ఐలు, మెరైన్ ఎస్ఐ, సిబ్బంది బీచ్‌లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడు గల్లంతైన సమాచారం తల్లిదండ్రులకు తెలియపరిచారు. చీకటి పడే వరకు గాలించినా ఫలితం లేకపోయింది. సోమవారం తెల్లవారుజాము నుంచి గాలింపును తిరిగి కొనసాగించారు. పెదపట్నం, ఇంతేరు చిన్న గొల్లపాలెం వరకు ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు.
మరోవైపు.. పెదపట్నం బీచ్ ఒడ్డుకు బాలుడి మృతదేహం కొట్టుకు వచ్చిందని స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పోలీసు వారికి సమాచారం ఇవ్వకుండా సంఘటన స్థలానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై బాలుడి మృదేహాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. బాలుడు మృతదేహం పెదపట్నం బీచ్ వద్ద లభ్యమైందని పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ద్విచక్ర వాహనంపై వస్తున్న బాధిత కుటుంబాన్ని ఆపి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి బాలుడి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ క్రమంలో పోలీసు వారు సరైన గాలింపు చర్యలు చేపట్టలేదని, మృతదేహాన్ని తరలించడానికి సైతం వాహనం ఏర్పాటు చేయలేదని, సామాజిక మాధ్యమాల వేదికగా కొంతమంది అసత్యాలను ప్రచారం చేశారు. గాలింపు చర్యలు వేరు వేరు ప్రాంతంలో జరగటం వలన పెదపట్నం బీచ్ వద్దకు చేరుకునే సరికి సమయం పట్టింది గాని, ఇందులో పోలీసు వారు సరిగా స్పందించలేదన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇలాంటి అసత్య ఆరోపణలు ప్రచారం చేసిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడం తప్పదని పోలీసులు హెచ్చరించారు. పోలీసు వారిని సంప్రదించి ఎలాంటి వివరణ తీసుకోకుండా తమప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించాలని చూస్తే చర్యలు తప్పవని బందరు డీఎస్పీ మాసుం భాష హెచ్చరించారు.
ఇదీ చదవండి: Fact Check: 'ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం'
Comments
Please login to add a commentAdd a comment