కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించం
- నంద్యాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్
- ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- తొలి రోజు రెండు నామినేషన్లు
నూనెపల్లె (నంద్యాల): కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. ఆయన శనివారం నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ఈ రోజు నుంచే మొదలుపెట్టామన్నారు. ఆగస్టు ఐదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. అభ్యర్థులు నూతనంగా రూపొందించిన నామినేషన్ పత్రాలనే దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. వీటితో పాటు రూ.10 వేలు డిపాజిట్ చేయాలని చెప్పారు. నామినేషన్ పత్రాలను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో స్వీకరించబోమని తెలిపారు.
అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే అనుమతిస్తామని, మిగిలిన వారు నామినేషన్ దాఖలు చేసే కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో ఉండాలని సూచించారు. అభ్యర్థులపై నిఘా వేశామని, కోడ్ ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థుల పూర్తి వివరాలను అందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు. అభ్యర్థులు అందించే నామినేషన్ పత్రాల ప్రతులను కార్యాలయం నోటీస్ బోర్డులో ఉంచుతామని, ఆన్‌లైన్‌లో కూడా అప్‌లోడ్ చేస్తామని తెలిపారు. నామినేషన్ పత్రాలను తనకు కానీ, సహాయ రిటర్నింగ్ అధికారి (ఏఆర్‌ఓ)కి కానీ అందజేయవచ్చన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తుంటే 8978840011కు నేరుగా ఫోన్ చేయవచ్చని సూచించారు. నామినేషన్ల విత్‌డ్రాకు ఆగస్టు 7 నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉందన్నారు. ఆగస్టు 23న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.
తొలిరోజు రెండు నామినేషన్లు : నంద్యాల ఉపఎన్నికకు సంబంధించి శనివారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ నామినేషన్లను స్వీకరించారు. నవతరం పార్టీ తరఫున రావూస్ సుబ్రమణ్యం, అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున షేక్ మహబూబ్‌బాషా నామినేషన్లు దాఖలు చేశారు.