ఆట మొదలైంది! | Telangana Election Nomination Date Released | Sakshi
Sakshi News home page

ఆట మొదలైంది!

Published Mon, Nov 12 2018 9:04 AM | Last Updated on Mon, Nov 12 2018 9:04 AM

Telangana Election Nomination Date Released - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: శాసనసభా ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి మొదలు కాబోతోంది. డిసెంబర్‌ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం విడుదల కానుంది. నోటిఫికేషన్‌తోపాటే నామినేషన్ల ప్రక్రియా మొదలవుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించే ఆయా జిల్లాల కలెక్టర్ల ఆదేశాలకు అనుగుణంగా రిటర్నింగ్‌ అధికారులు వ్యవహరిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకు సాగుతుంది.

20న నామినేషన్ల పరిశీలన, 21, 22 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం. 23వ తేదీ నుంచి డిసెంబర్‌ 5వ తేదీ సాయంత్రం వరకు అభ్యర్థుల ప్రచారానికి గడువు ఉంటుంది. డిసెంబర్‌ 7న పోలింగ్‌ నిర్వహిస్తారు. ఇదీ రాబోయే 25 రోజుల షెడ్యూల్‌. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌(ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నియోజకవర్గాల వారీగా ఎన్నికల వ్యయ పరిశీలకులను  ఈసీ నియమించింది. వీరంతా సోమవారం నుంచే తమ విధులు ప్రారంభించనున్నారు. పరిశీలకులతోపాటు క్షేత్రస్థాయితో మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించారు. పోలింగ్‌ కేంద్రాల పరిశీలకులు ఈ నెల 19న రానున్నారు.

సమస్యాత్మక స్థానాలు 4
ఉమ్మడి జిల్లాలో సమస్యాత్మక నియోజకవర్గాలుగా నాలుగింటిని గుర్తిస్తూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న గోదావరి, ప్రాణహిత నదీ పరీవాహక నియోజకవర్గాలు మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూరులను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఈ నియోజకవర్గాల్లో బందోబస్తుకు అదనంగా కేంద్ర బలగాలు రానున్నాయి. ఈ నియోజకవర్గాల్లో డిసెంబర్‌ 7న సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుంది. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల చేతికి బీఫారాలు
ముందస్తు ఎన్నికల కోసం ప్రభుత్వాన్ని రద్దు చేసిన సెప్టెంబర్‌ 6వ తేదీనే టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే 105 అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడానికి ఒకరోజు ముందే వారందరికీ బీఫారాలను అందజేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన పది మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. సోమవారం నుంచి 19వ తేదీ వర కు మంచిరోజులే ఉండడంతో ముహూర్త బలం చూసుకొని నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు.

జాబితా కోసం కాంగ్రెస్‌ నేతల   ఎదురుచూపు
ఓ వైపు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు బీఫారాలతో సిద్ధంగా ఉండగా, కాంగ్రెస్‌ నేతలు అభ్యర్థుల జాబితా కోసం ఢిల్లీ వైపు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లో బెల్లంపల్లిలో సీపీఐ పోటీ చేయడం ఖాయమైంది. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఎవరో ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా కూడా సోమ లేదా మంగళ వారాల్లో వెల్లడి కానుంది. కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరో కూడా ఇప్పటికే లీక్‌ కావడంతో బీఫారాల కోసం వేచి చూస్తున్నారు.

నేడు బీజేపీ అభ్యర్థుల ప్రకటన?
భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 8 నియోజకవర్గాలకు అభ్యర్థులను రెండు విడతలుగా ప్రకటించింది. మంచిర్యాల, చెన్నూరు స్థానాలకు పోటీ తీవ్రంగా ఉండడంతో పెండింగ్‌లో పెట్టారు. ఆదివారం హైదరాబాద్‌లో జరగాల్సిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం సోమవారానికి వాయిదా పడింది. దీంతో ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను రాష్ట్ర పార్టీ అధికారికంగా ఖరారు చేయలేదు. సోమవారం అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటే మంగళవారం ఢిల్లీ నుంచి మూడో జాబితా వెల్లడయ్యే అవకాశం ఉంది. మంచిర్యాల నుంచి ఎరవెల్లి రఘునాథ్, ముల్కల్ల మల్లారెడ్డి పోటీ పడుతుండగా, చెన్నూరు నుంచి రామ్‌వేణు, అందుగుల శ్రీనివాస్‌ టికెట్టు వేటలో ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఏ సమీకరణాల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేస్తారో చూడాల్సిందే.
 

నేటి నుంచి  నామినేషన్ల స్వీకరణ
ఆదిలాబాద్‌అర్బన్‌: శాసనసభ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్‌ నియోజకవర్గాల్లో నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ విలేకరులతో తెలిపారు. ఈనెల 12 నుంచి 19 వరకు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని వెల్లడించారు.

నామినేషన్‌కు జతచేయాల్సిన  ధ్రువపత్రాలు, సూచనలు.. 

  • నామినేషన్‌ ఫారం– 2బీని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఉచితంగా పొందవచ్చు  
  • రెండు ఫొటోలలో ఒక స్టాంప్‌ సైజ్‌ ఫొటో నామినేషన్‌ పత్రంపై, రెండోది అఫిడవిట్‌పై అతికించాలి  
  • జనరల్‌ అభ్యర్థుల డిపాజిట్‌ రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల డిపాజిట్‌ రూ.5 వేలతో పాటు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి 
  • అభ్యర్థి నామినేషన్‌ను అదే నియోజకవర్గ ఓటరు ప్రతిపాదించాలి  
  • గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థిని ఒకరు, ఇండిపెండెంట్లను పది మంది ప్రతిపాదించాలి 
  • బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థి పేరు ఎలా రాయాలో తెలుపుతూ తెలుగులో రాసి ఇవ్వాలి  
  • ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చు  
  • అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే నామినేషన్‌ కేంద్రంలోకి అనుమతిస్తారు 
  • రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వంద మీ టర్ల దూరంలో వాహనాలను నిలిపివేయాలి  
  • అభ్యర్థి తనపై క్రిమినల్‌ కేసుల వివరాలను పార్ట్‌– 3ఏలో తప్పని సరిగా పేర్కొనాలి  
  • రిటర్నింగ్‌ అధికారి నుంచి పొందాల్సిన పత్రాలు.. 
  • చెల్లించిన డిపాజిట్‌ మొత్తానికి రశీదు 
  • పరిశీలనకు హాజరయ్యేందుకు నోటీసు 
  • ఎన్నికల వ్యయాలను నమోదు చేసే రిజిస్ట్రార్‌ 
  • కరపత్రం, పోస్టర్లు, ప్లెక్సీలు, ఇతర సామగ్రి ముద్రించేందుకు ప్రజాప్రతినిథ్య చట్టంలోని సెక్షన్‌ 127– ఏ సూచనలు  
  • ప్రతిజ్ఞ లేదా శపథం చేసినట్లు ధ్రువీకరణ పత్రం 
  • నామినేషన్‌ పత్రంలోని లోపాలు, ఇంకా జతపర్చాల్సిన పత్రాల సూచిక (చెక్‌ మెమో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement