నిర్భయంగా ఓటు వేయాలి  | People Use Vote Without Fear | Sakshi
Sakshi News home page

నిర్భయంగా ఓటు వేయాలి :సాక్షితో ఇంటర్వ్యూలో ఎస్పీ

Published Thu, Dec 6 2018 1:47 PM | Last Updated on Thu, Dec 6 2018 1:47 PM

People Use Vote Without Fear - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: రేపు నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ సూచిస్తున్నారు. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తగిన బందోబస్తు, ఏర్పాట్లు చేశామని వెల్లడిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేలా సహకరించాలని కోరుతున్నారు. పోలింగ్‌ నేపథ్యంలో తీసుకుంటున్న పోలీస్‌ బందోబస్తు చర్యలపై ‘సాక్షి’ బుధవారం ఆయనను పలకరించింది. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. 
సాక్షి: పోలింగ్‌ నేపథ్యంలో తీసుకుంటున్న బందోబస్తు చర్యలు.?
ఎస్పీ: ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు చేపడుతున్నాం. ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 25 మంది ఎస్సైలు, 550 సివిల్‌ ఫోర్స్, 200 మంది ఏఆర్‌ ఫోర్స్‌తో పాటు నాలుగు కంపనీలకు చెందిన 400 మంది, ఏపీఎస్పీకి సంబంధించి 200 మంది, ఆదిలాబాద్‌కు చెందిన 165 మంది హోంగార్డులు, యావత్‌మాల్‌కు చెందిన 400 మంది హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉంటున్నారు. 
సాక్షి: సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారు..?
ఎస్పీ: జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 130 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాం. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీడియో చిత్రీకరణ చేపడుతున్నాం. బీఎస్‌ఎఫ్‌ బలగాలతో బందోబస్తు చేపట్టనున్నాం.
సాక్షి: పోలింగ్‌ సజావుగా జరిగేలా తీసుకుంటున్న చర్యలు.?
ఎస్పీ: ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి జిల్లాలో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఎస్‌ఎస్‌టీంలు, పోలీసుల ద్వారా జిల్లాకు వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయిస్తున్నాం. దీంతో పాటు మొబైల్‌ పార్టీ, స్ట్రైకింగ్‌ ఫోర్స్, క్లస్టర్‌ పెట్రోలింగ్‌ పోలీసులతో ప్రత్యేక భద్రత చర్యలు చేపడుతున్నాం. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఇప్పటి వరకు 400 బైండోవర్‌ కేసులు నమోదు చేసి 1500 మందికి పైగా బైండోవర్‌ చేశాం. అలాగే 17 లైసెన్స్‌ గల పిస్టోళ్లను స్వాధీనం చేసుకున్నాం. ఎన్నికలు జరిగే రోజున జిల్లాతో పాటు సరిహద్దు ప్రాంతాలైన మహారాష్ట్రలోని యావత్‌మాల్, నాందేడ్‌లలో మద్యం దుకాణాలు బంద్‌ పాటించేలా ఆ ప్రాంత అధికారులను కోరాం. 
సాక్షి: అక్రమంగా మద్యం, డబ్బు తరలింపుపై ఎలాంటి నిఘా పెట్టారు.?
ఎస్పీ: ఎన్నికల దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల నుంచి జిల్లాకు అక్రమంగా ఎలాంటి మద్యం, డబ్బు తరలించకుండా 9 ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టాం. ఈ చెక్‌పోస్టుల ద్వారా ఇప్పటివరకు రూ.11.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాం. దీంతో పాటు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకొని 114 కేసులు సైతం నమోదు చేశాం. మద్యం విలువ రూ.7లక్షల వరకు ఉంటుంది.
సాక్షి: ఓటర్లను మభ్యపెడితే ఎలాంటి చర్యలు ఉంటాయి.?
ఎస్పీ: ఎన్నికల నియామవళిని ఎవరూ ఉల్లంఘించరాదు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను మభ్యపెడితే క్రిమినల్‌ కేసులు నమో దు చేస్తాం. ఓటర్లను నాయకులు పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేయరాదు. మోడల్‌ కోడ్‌ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం.
సాక్షి: ఓటర్లకు మీరిచ్చే సందేశం.?
ఎస్పీ: ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక పోలీసు బలగాలతో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాం. ఓటర్లు నిర్భయంగా కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా భయబ్రాంతులకు గురిచేస్తే, ప్రలోభాలు పెడితే పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు 08732–226246లో సమాచారం అందించాలి. అలాగే డయల్‌ 100కు కూడా ఫోన్‌చేసి సమాచారం ఇవ్వొచ్చు. సీవిజిల్‌కు ఫొటోలు లేదా వీడియో తీసి పంపితే అరగంటలో అధికారులు చేరుకుని చర్యలు తీసుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement