
నమ్మించి.. నట్టేట ముంచి!
అధికారమే ధ్యేయంగా ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
కల్లూరు మండలం గోకులపాడు గ్రామానికి చెందిన కురువ లక్ష్మమ్మ(65) రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద. కొన్నేళ్లుగా ఫించను తీసుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పింఛన్ల సర్వేలో ఐదెకరాల పొలం ఉందంటూ అర్హుల జాబితా నుంచి ఈమె పేరు తొలగించారు. గ్రామంలో శనివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆమె ఈ విషయమై అధికారులను నిలదీశారు. ‘నీకు ఐదెకరాల పొలం ఉంది. అందుకే తొలగించాం’ అని వారు సమాధానమిచ్చారు. అందుకు లక్ష్మమ్మ తనకు ఐదెకరాల పొలం ఎక్కడుందో చూపాలని నిలదీయగా అధికారులు నీళ్లు నమిలారు. మరోసారి పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నారు.
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
అధికారమే ధ్యేయంగా ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచుతున్నారు. రుణమాఫీ విషయంలో రోజుకో మెలిక పెడుతుండగా.. సామాజిక భద్రతా పింఛన్లలో భారీగా కోత విధించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్ 2 నుంచి పింఛన్లకు పంపిణీ చేస్తున్న మొత్తం పెంచుతున్నట్లు ప్రకటించినా.. బోగస్ లబ్ధిదారుల పేరిట కోత కోయడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల అనర్హులను ఎరివేసేందుకు సర్వే చేపట్టారు. ఇందుకోసం వేసిన కమిటీలో టీడీపీ నేతలకు పెద్దపీట వేయడంతో కొన్నేళ్లుగా పింఛన్ పొందుతున్న ఇతర పార్టీల మద్దతుదారుల పేర్లను జాబితా నుంచి తప్పించారు. ఈవిధంగా జిల్లాలో దాదాపు 15వేల పింఛన్లను తొలగించడం గమనార్హం. శనివారం నిర్వహించిన గ్రామసభల్లో ఇద్దరు ముగ్గురికి పింఛన్ డబ్బు పంపిణీ చేసిన అధికారులు అంతటిలో కార్యక్రమం ముగిసిందనిపించారు. దీంతో తక్కిన వారు పింఛన్ డబ్బు ఎప్పుడిస్తారోనని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలాఉంటే తుది జాబితా సిద్ధమయ్యాక ఆయా గ్రామాల్లో టీడీపీ నేతలు గుర్తించి అర్హులని తేల్చిన వారి పేర్లు కూడా గల్లంతవడంతో ఆ పార్టీ శ్రేణులు బిక్కమొహం వేస్తున్నారు. గోకులపాడులో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గ్రామంలో 46 మందిని తొలగించగా.. తుది జాబితాలో 138 మంది పేర్లు లేకపోవడం టీడీపీ నేతలనే ఆశ్చర్యపరుస్తోంది. ఎస్‌ఆర్‌డీహెచ్ సాఫ్ట్‌వేర్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అనర్హులను ఏరివేసినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది.