టేకులపల్లి, న్యూస్‌లైన్ : గతంలో ఉన్నంతగా నక్సల్స్ ప్రభావం ప్రస్తుతం ఏమీ లేదని, ఏజెన్సీ, మైదాన ప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం. కాంతారావు అన్నారు. మూడేళ్లకు ఒకసారి చేసే తనిఖీల్లో భాగంగా ఆదివారం ఆయన టేకులపల్లి సీఐ కార్యాలయన్ని తనిఖీ చేశారు. కానీ ఆరేళ్ల తర్వాత డీఐజీ ఇక్కడికి రావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇల్లెందు సబ్‌డివిజన్‌లో గతంలో ఉన్న పీపీజీ తదితర గ్రూపులన్నీ ఇప్పుడు లేవన్నారు. మోహన్‌తో సహా పలువురు మనుగడలో లేరని, న్యూడెమోక్రసీ రెండు గ్రూపులుగా విడిపోయాయని, వీటి వల్ల కూడా ఎలాంటి నష్టం లేదని అన్నారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా నక్సల్స్ జాడ కోసం నిఘా కొనసాగుతోందని అన్నారు.
ప్రజలు వేరు, పోలీసులు వేరు కాదన్నారు. ప్రజల మాన, ప్రాణ రక్షణ కోసమే పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ప్రజలతో మమేకమై వారితో సత్సంబంధాలను మెరుగుపర్చుకుంటూ సమాజ రక్షణలో పోలీసులు ముందుకు సాగుతున్నారని తెలిపారు. సమాజంలో పోలీసులు, ప్రజల సంబంధాలు, చట్టాలు, దురాచారాలు, మూఢ నమ్మకాలు, గుడుంబా తదితర వాటిపై ప్రజల్లో అవగాహన పెంచి వారిని చైతన్య పరిచేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జాగృతి కళాబృందాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. గుడుంబా తయారీ, విక్రయం, నల్లబెల్లం విక్రయం జరిపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలికలపై లైంగికదాడుల నిర్మూలనకు ప్రత్యేక కృషి చేస్తున్నామని అన్నారు. బడి ఈడు పిల్లల్ని బడికి పంపకుండా పనికి పంపినా, వారిని పనిలో పెట్టుకున్నా శిక్షార్హులని అన్నారు. మద్యం దుకాణాల వద్ద నిర్వాహకులు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. విధిగా సీసీ కెమెరాలు అమర్చాలని, కౌంటర్ల వద్ద మద్యం సేవిస్తే చర్యలు తప్పవని అన్నారు. బెల్టు షాపుల విషయంలో ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు చేపడతామని హెచ్చరించారు.
అక్రమ సారా, నల్లబెల్లం, బెల్టుషాపుల నివారణకు ప్రత్యేకంగా ఎక్సైజ్ శాఖ ఉందని వారు కోరినప్పుడు వారికి సహకరిస్తామని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని, దాడులు ముమ్మరం చేస్తామని తెలిపారు. యువత చెడు మార్గాలు పట్టకుండా ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసుకోవాలని, ఉచితంగా ఎఫ్‌ఐఆర్ అందజేయాలని తెలిపారు. సిబ్బంది క్వార్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. సమాజంలోని ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు 100, బాల బాలికల సమస్యలకు 1098 నెంబర్లకు డయల్ చేసి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ కె కృష్ణ, టేకులపల్లి, బయ్యారం సీఐలు రాజిరెడ్డి, జయపాల్, ట్రైనీ ఎస్సై సంజీవ్, ఏఎస్సై శంషుద్దీన్ సిబ్బంది పాల్గొన్నారు. తొలుత ఆయనకు డీఎస్పీ, సీఐలు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా డీఐజీ ఏపీఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఉన్న సిబ్బంది క్వార్టర్లను, పరిసరాలను పరిశీలించారు. క్వార్టర్లలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, ఆవరణలో మొక్కలు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీరు, క్వార్టర్ల పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్, క్వార్టర్లు, ఆవరణమంతా శుభ్రంగా ఉండాలని, మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. అనంతరం సీఐ కార్యాలయంలోని ఫైళ్ళను పరిశీలించారు. సీఐ విధుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
నక్సల్స్ ప్రభావం ఏమీ లేదు
Published Sun, Dec 15 2013 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement
Advertisement