జిల్లాలో పోలీసింగ్ సేవలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పోలీసులకు, ప్రజలకు అనుసంధాన కర్తలుగా విద్యార్థులు సేవలందించనున్నారు. పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ఎస్పీ వెంకటప్పలనాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టూరు. అదే స్టూడెంట్ పోలీస్ కేడెట్ (ఎస్‌పీసీ)ప్రోగ్రాం. రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు రూరల్ జిల్లాలో దీనిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సాక్షి, గుంటూరు: పోలీసు, ప్రజలకు అనుసంధానంగా పనిచేస్తూ ప్రజల సమస్యలను పోలీసుల దృష్టికి తేవడంతోపాటు పోలీస్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్‌పీసీ ప్రోగ్రాంని ప్రవేశపెట్టనున్నారు. ఎస్‌పీసీ ప్రొగ్రాం ద్వారా కేరళ ప్రభుత్వం ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసి పోలీసు, విద్యా శాఖలు సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకుంటుంది. 840 మంది శిక్షణ పొందిన ఉపాధ్యాయులతోపాటు, 1500 మంది పోలీసు అధికారులు ఈ ప్రోగాంలో ఎంపిక చేసిన విద్యార్థులకు ఇచ్చిన శిక్షణ సత్ఫలితాలను ఇస్తుండటంతో గుజరాత్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలు సైతం దీనిని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల డెహరాడూన్‌లో నిర్వహించిన నేషనల్ పోలీసు కాంగ్రెస్ – 2011 సమావేశం సైతం ఎస్‌పీసీ ప్రాజెక్టును దేశవ్యాప్తంగా అమలు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఎస్‌పీసీ ప్రభావంతమైన ప్రోగ్రాంగా ఆయా రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నట్లు ఓ సర్వే ద్వారా వెల్లడైంది.
పోలీసులకు పెరిగిన పనిభారం..
ఏపీలో ఎస్‌పీసీ ప్రోగ్రాం అమలు పోలీసు శాఖకు ఎంతో అవసరమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని జిల్లాగా ఉన్న గుంటూరులో ఇది పోలీసు శాఖకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించిన రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు దీనిపై సీరియస్‌గా దృష్టి సారించారు. రాజధాని నేపథ్యంలో పోలీసులపై పనిభారం పెరగడంతోపాటు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీని వల్ల పోలీసులు ప్రజలకు చేరువ కావలేకపోతున్నారనే భావన అందరిలో ఉంది. అందుకే ఎస్‌పీసీ సరైన వేదికగా భావించి రూరల్ జిల్లాలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ట్రైనర్‌లను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందిస్తున్నట్లు సమాచారం.
2వేల మంది ఎస్‌పీసీలు..
గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో 66 పోలీసు స్టేషన్‌లు ఉన్నాయి. ఒక్కో పోలీసు స్టేషన్ పరిధిలో సుమారుగా 30 మంది స్టూడెంట్ పోలీసు కేడెట్‌లను నియమించాలని ఎస్పీ నిర్ణయించినట్లు తెలిసింది. సుమారుగా 2వేల మంది ఎస్‌పీసీలు పోలీసు శాఖకు సేవలందించనున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల్లో విలువలు పెరిగి న్యాయం కోసం ఎదురుచూసే వారిని గుర్తించి పోలీసుల వద్ద తీసుకురావడం ద్వారా పోలీసు శాఖ పట్ల గౌరవం పెరుగుతుందని చెబుతున్నారు.
మెరుగైన సేవల కోసం.
పోలీసు సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు ఎస్‌పీసీ ప్రాజెక్టు దోహదపడుతుంది. ఇందులో ఎంపికైన విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి ప్రజల్లో పోలీసులపై నమ్మకం కలిగిస్తాం. దీనిపై ఇంకా కసరత్తు చేయాల్సి ఉంది. ప్రత్యేకంగా ట్రైనర్లకు శిక్షణ ఇప్పిస్తున్నాం. త్వరలో అమలు చేస్తాం. – సీహెచ్.వెంకటప్పలనాయుడు, ఎస్పీ
ఎస్‌సీపీ శిక్షణ అనంతరం పెరేడ్‌లో విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment