ncc students
-
ఆకట్టుకున్న ఎన్సీసీ విద్యార్థుల.. ఫ్లాష్ మాబ్..!
వరంగల్: వరంగల్‌లోని ఎంజీఎం, హనుమకొండలోని అంబేడ్కర్ జంక్షన్లలో శుక్రవారం నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ ఆకట్టుకుంది. ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0 కార్యక్రమంలో భాగంగా ‘జాయిన్ ది ఫైట్ ఫర్ గార్బేజ్ ఫ్రీ సిటీస్’ అంశంపై ఫ్లాష్‌మాబ్ కొనసాగింది. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ, ఎంజీఎం ఒకేషనల్, ఎల్బీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి నృత్యాలు చేశారు. ఈసందర్భంగా కార్పొరేషన్ సీఎంహెచ్ఓ రాజేశ్ మాట్లాడుతూ.. ఈనెల 17న మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఫ్లాష్ మాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఈఈ సంజయ్, సూపరింటెండెంట్ దేవేందర్, ఎస్ఐలు శ్యాంరాజ్, వెంకన్న, గొల్కొండ శ్రీను, భీమయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్సీసీ విద్యార్థులకు వేరుగా పరీక్షలు
సాక్షి, అమరావతి: ఎన్సీసీ క్యాడెట్లకు సెమిస్టర్ పరీక్షలను ప్రత్యేక తేదీల్లో నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉన్నత విద్యాసంస్థలకు, విశ్వవిద్యాలయాలకు సూచనలు జారీ చేసింది. ఈ ప్రత్యేక పరీక్షలకు వచ్చే వారిని మళ్లీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులుగా పరిగణించరాదని తెలిపింది. ‘ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్లో రిపబ్లిక్ డే క్యాంప్ కోసం ప్రిపరేషన్/ట్రైనింగ్ క్యాంపుల్లో క్యాడెట్లు పాల్గొంటున్నారని.. ఫలితంగా వారు సెమిస్టర్ తరగతులకు హాజరు కావడంలో, పరీక్షలు రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్సీసీ విభాగం యూజీసీ దృష్టికి తీసుకువెళ్లడంతో సంస్థ ఈ సూచనలు జారీచేసింది. వారికి ప్రత్యేక తరగతులతో పాటు ప్రత్యేక తేదీల్లో పరీక్షలకు వీలుగా షెడ్యూల్‌ను రూపొందించుకోవాలని యూజీసీ బుధవారం జారీచేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. -
పోలీసులకు దీటుగా ఎన్సీసీ విద్యార్థులు
సాక్షి,వనపర్తి క్రైం: ఇటీవల జరిగిన అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణతో పోలీసులకు దీటుగా ఎన్సీసీ విద్యార్థులు విధులు నిర్వహించారని ఎస్పీ అపూర్వరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కో–ఎడ్యుకేషన్ కళాశాల సమావేశ మందిరంలో ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఎన్సీసీ విద్యార్థులకు నగదు రివార్డులు అందజేశారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా భవిత, హైమావతి, రాజేశ్వరి, రవి, ఖాజ ఎన్సీసీ విద్యార్థులు మాట్లాడుతూ ఎన్నికల్లో విధులు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విధులు నిర్వహిస్తూ ఉంటే ప్రజలకు సేవలందించే అనుభూతి కలిగిందని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన ఎస్పీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీ అపూర్వరావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన విద్యార్థులకు రూ.వెయ్యి చొప్పున రూ.4వేలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్సీసీ విద్యార్థులు చక్కగా విధులు నిర్వహించి, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించారన్నారు. ఎన్సీసీ క్రమశిక్షణతో భావిభారత పౌరులను తయారుచేయడంలో ప్రధానపాత్ర పోషిస్తుందన్నారు. ఇదే క్రమశిక్షణతో చదువుకుని జీవితంలోనూ ఉన్నతంగా రాణించాలన్నారు. అనంతరం ఎన్నికల విధులు నిర్వహించిన ఎన్సీసీ విద్యార్థులకు నగదు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారావు, పీఆర్ఓ రాజగౌడ్, సీసీ మధు తదితరులు ఉన్నారు. -
విద్యార్థి భటులు
జిల్లాలో పోలీసింగ్ సేవలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పోలీసులకు, ప్రజలకు అనుసంధాన కర్తలుగా విద్యార్థులు సేవలందించనున్నారు. పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ఎస్పీ వెంకటప్పలనాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టూరు. అదే స్టూడెంట్ పోలీస్ కేడెట్ (ఎస్పీసీ)ప్రోగ్రాం. రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు రూరల్ జిల్లాలో దీనిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సాక్షి, గుంటూరు: పోలీసు, ప్రజలకు అనుసంధానంగా పనిచేస్తూ ప్రజల సమస్యలను పోలీసుల దృష్టికి తేవడంతోపాటు పోలీస్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్పీసీ ప్రోగ్రాంని ప్రవేశపెట్టనున్నారు. ఎస్పీసీ ప్రొగ్రాం ద్వారా కేరళ ప్రభుత్వం ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసి పోలీసు, విద్యా శాఖలు సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకుంటుంది. 840 మంది శిక్షణ పొందిన ఉపాధ్యాయులతోపాటు, 1500 మంది పోలీసు అధికారులు ఈ ప్రోగాంలో ఎంపిక చేసిన విద్యార్థులకు ఇచ్చిన శిక్షణ సత్ఫలితాలను ఇస్తుండటంతో గుజరాత్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలు సైతం దీనిని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల డెహరాడూన్లో నిర్వహించిన నేషనల్ పోలీసు కాంగ్రెస్ – 2011 సమావేశం సైతం ఎస్పీసీ ప్రాజెక్టును దేశవ్యాప్తంగా అమలు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఎస్పీసీ ప్రభావంతమైన ప్రోగ్రాంగా ఆయా రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నట్లు ఓ సర్వే ద్వారా వెల్లడైంది. పోలీసులకు పెరిగిన పనిభారం.. ఏపీలో ఎస్పీసీ ప్రోగ్రాం అమలు పోలీసు శాఖకు ఎంతో అవసరమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని జిల్లాగా ఉన్న గుంటూరులో ఇది పోలీసు శాఖకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించిన రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు దీనిపై సీరియస్‌గా దృష్టి సారించారు. రాజధాని నేపథ్యంలో పోలీసులపై పనిభారం పెరగడంతోపాటు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీని వల్ల పోలీసులు ప్రజలకు చేరువ కావలేకపోతున్నారనే భావన అందరిలో ఉంది. అందుకే ఎస్పీసీ సరైన వేదికగా భావించి రూరల్ జిల్లాలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ట్రైనర్లను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందిస్తున్నట్లు సమాచారం. 2వేల మంది ఎస్పీసీలు.. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో 66 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో పోలీసు స్టేషన్ పరిధిలో సుమారుగా 30 మంది స్టూడెంట్ పోలీసు కేడెట్లను నియమించాలని ఎస్పీ నిర్ణయించినట్లు తెలిసింది. సుమారుగా 2వేల మంది ఎస్పీసీలు పోలీసు శాఖకు సేవలందించనున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల్లో విలువలు పెరిగి న్యాయం కోసం ఎదురుచూసే వారిని గుర్తించి పోలీసుల వద్ద తీసుకురావడం ద్వారా పోలీసు శాఖ పట్ల గౌరవం పెరుగుతుందని చెబుతున్నారు. మెరుగైన సేవల కోసం. పోలీసు సేవలు ప్రజలకు చేరువ చేసేందుకు ఎస్పీసీ ప్రాజెక్టు దోహదపడుతుంది. ఇందులో ఎంపికైన విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి ప్రజల్లో పోలీసులపై నమ్మకం కలిగిస్తాం. దీనిపై ఇంకా కసరత్తు చేయాల్సి ఉంది. ప్రత్యేకంగా ట్రైనర్లకు శిక్షణ ఇప్పిస్తున్నాం. త్వరలో అమలు చేస్తాం. – సీహెచ్.వెంకటప్పలనాయుడు, ఎస్పీ ఎస్సీపీ శిక్షణ అనంతరం పెరేడ్లో విద్యార్థులు -
ఎన్‌సీసీతో బంగారు భవిత
18వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండెంట్ కల్నర్ మోనీష్ గౌర్ తుని రూరల్: ఎన్‌సీసీతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని 18వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ కమాండెంట్ కల్నల్ మోనీష్ గౌర్ అన్నారు. మంగళవారం తుని మండలం రాజుపేట శ్రీప్రకాష్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మచిలిపట్నం, విజయవాడ, కాకినాడ 16, 17, 18 బెటాలియన్ ఎన్సీసీకి చెందిన 658 విద్యార్థినీవిద్యార్థులకు రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎన్సీసీకి ప్రత్యేక కోటా ఉందన్నారు. దీనివల్ల ఎంతో మంది విద్యార్థులు అన్ని సౌకర్యాలు ఉన్న కళాశాలల్లో సీట్లు సాధిస్తున్నారని, ఉద్యోగాల్లోనూ అవకాశాలను దక్కించుకుంటున్నారన్నారు. 18 ఆంధ్రా బెటాలియన్ తరఫున పెద్దాపురం మహారాణి కళాశాలకు చెందిన సీనియర్ అండర్ ఆఫీసర్ యు.మీనుసారిక దిల్లీలోని రిపబ్లిక్ డేలో పాల్గొని ప్రధాని మోదీ నుంచి పతకాలు అందుకున్నట్టు తెలిపారు. ఆర్మీ విభాగంలో లాగే డ్రిల్, యోగా, పరుగు, ఆయుధ వినియోగం, రైఫిల్ షూటింగ్, ఫైరింగ్‌కు ముందు తీసుకోవలసిన జగ్రత్తలు, స్పోర్ట్స్, రీడింగ్, సివిల్ డిఫెన్స్, సాంస్కృతిక, వ్యక్తిత్వ, నాయకత్వ, ప్రథమ చికిత్సలో శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణలో ఎనిమిది మంది అసోసియేట్ అధికారులు, కెప్టెన్ ఎం.వి.చౌదరి, జేసీఓ రెడ్డి, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ రమణబాబు, శిక్షణ అధికారి లెఫ్టినెంట్ ఎం.కృష్ణారావు, బీహెచ్ఆర్పీ నాగర్కోటి, చీఫ్ ఆఫీసర్ యు.మాచిరాజు, మేజర్ జోగీందర్ సింగ్, సూపరిండెంట్ గుమ్మడి అనిల్‌కుమార్, సుబేదార్ రాంకుమార్, థర్డ్ ఆఫీసర్లు ఎం.సతీష్, టి.రాంబాబు కేడెట్లు పాల్గొన్నారు. -
ఆర్మీక్యాంప్‌నకు ఎంపిక
సిద్దిపేట జోన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ యూనిట్‌కు చెందిన ఆరుగురు విద్యార్ధులు ఆర్మీ అటాచ్మెంట్ క్యాంపునకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎన్సీసీ అధికారి శ్రీనివాస్ వివరాలను సోమవారం వెల్లడించారు. 71వ ఇన్‌ప్రాట్రీ ఆర్మీ బ్రిగేడ్‌కు సంబందించిన క్యాంప్ ఆగష్టు 16 నుంచి 30వ తేది వరకు హైద్రాబాద్‌లో కొనసాగనుంది. ఈ క్యాంప్‌కు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ బెటాలియన్లకు చెందిన ఎన్సీసీ విద్యార్ధులు ఆర్మీ జవాన్లతో కలిసి పక్షం రోజులు శిక్షణ పొందనున్నారు. ఆర్మీ జవాన్ల జీవన విదానం అనుసరిస్తు వివిధ అంశాలపై శిక్షణ పొందనున్నారు. శిక్షణలో బాగంగా భారత సైన్యానికి సంబందించిన అంశాలను భోదించడమే కాకుండా డ్రీల్ , అయుద శిక్షణ , మిల్ర్టీపట్ల అధ్యాయనం , యుద్ద వ్యూహాలు, విపత్కర పరస్థితులను ఎదుర్కోనే విదానం దేశభక్తి, క్రమశిక్షణ, తదితర అంశాలను శిక్షణలో నేర్చుకోనున్నారు. ఈ క్యాంప్‌కు సిద్దిపేట డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్ధులు, విజేందర్, ఆరవింద్‌రెడ్డి, సుజయ్‌చంద్రా, రాజశేఖర్, సాయికిరణ్, స్వామిలు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డి, ఎన్సీసీ ఆఫీసర్ శ్రీనివాస్‌లు అభినందించారు. -
అనంతలో జేసీని నిర్బంధించిన ఎన్సీసీ విద్యార్థులు
ఎన్నికల కోసం అనేకమంది విద్యార్థుల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది. అయితే వారికి గౌరవ వేతనం ఇవ్వాల్సి వచ్చేసరికి మాత్రం ముఖం చాటేసింది. సరిగ్గా ఇలాంటి సంఘటనే అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. విశ్వ విద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేశారు. తాము ఎన్నికల విధులలో పాల్గొన్నా, తమకు సరైన వేతనం ఇవ్వలేదంటూ వాళ్లు ధర్నాకు దిగారు. జాయింట్ కలెక్టర్‌ను యూనివర్సిటీకి చెందిన ఎన్సీసీ విద్యార్థులు నిర్బంధించారు. ఇంజనీరింగ్, ఎంసీఏ చదివే విద్యార్థులను వెబ్‌కాస్టింగ్ కోసం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులను పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సహాయకులుగా, క్యూలైన్లను నిర్వహించడానికి నియమించుకున్న విషయం తెలిసిందే.