ఎన్‌సీసీతో బంగారు భవిత
-
18వ ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ కమాండెంట్ కల్నర్ మోనీష్ గౌర్
తుని రూరల్: ఎన్‌సీసీతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని 18వ ఆంధ్రా బెటాలియన్ ఎన్‌సీసీ కమాండెంట్ కల్నల్ మోనీష్ గౌర్ అన్నారు. మంగళవారం తుని మండలం రాజుపేట శ్రీప్రకాష్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మచిలిపట్నం, విజయవాడ, కాకినాడ 16, 17, 18 బెటాలియన్ ఎన్‌సీసీకి చెందిన 658 విద్యార్థినీవిద్యార్థులకు రైఫిల్ షూటింగ్‌లో శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎన్‌సీసీకి ప్రత్యేక కోటా ఉందన్నారు. దీనివల్ల ఎంతో మంది విద్యార్థులు అన్ని సౌకర్యాలు ఉన్న కళాశాలల్లో సీట్లు సాధిస్తున్నారని, ఉద్యోగాల్లోనూ అవకాశాలను దక్కించుకుంటున్నారన్నారు. 18 ఆంధ్రా బెటాలియన్ తరఫున పెద్దాపురం మహారాణి కళాశాలకు చెందిన సీనియర్ అండర్ ఆఫీసర్ యు.మీనుసారిక దిల్లీలోని రిపబ్లిక్ డేలో పాల్గొని ప్రధాని మోదీ నుంచి పతకాలు అందుకున్నట్టు తెలిపారు.
ఆర్మీ విభాగంలో లాగే డ్రిల్, యోగా, పరుగు, ఆయుధ వినియోగం, రైఫిల్ షూటింగ్, ఫైరింగ్‌కు ముందు తీసుకోవలసిన జగ్రత్తలు, స్పోర్ట్స్, రీడింగ్, సివిల్ డిఫెన్స్, సాంస్కృతిక, వ్యక్తిత్వ, నాయకత్వ, ప్రథమ చికిత్సలో శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణలో ఎనిమిది మంది అసోసియేట్ అధికారులు, కెప్టెన్ ఎం.వి.చౌదరి, జేసీఓ రెడ్డి, ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ రమణబాబు, శిక్షణ అధికారి లెఫ్టినెంట్ ఎం.కృష్ణారావు, బీహెచ్‌ఆర్‌పీ నాగర్కోటి, చీఫ్ ఆఫీసర్ యు.మాచిరాజు, మేజర్ జోగీందర్ సింగ్, సూపరిండెంట్ గుమ్మడి అనిల్‌కుమార్, సుబేదార్ రాంకుమార్, థర్డ్ ఆఫీసర్లు ఎం.సతీష్, టి.రాంబాబు కేడెట్లు పాల్గొన్నారు.