- రాష్ట్ర ప్రభుత్వంపై నీతి ఆయోగ్ మండిపాటు
- ఏడు జిల్లాలకు రూ.700 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- ఆ నిధుల్ని వేరే కార్యక్రమాలకు మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్ : కేంద్రానికే రాష్ట్ర ప్రభుత్వం టోకరా వేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాకే అబద్ధాలు చెబుతారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రం మండిపడింది. అంతటితో ఆగకుండా స్వయంగా క్షేత్రస్థాయి తనిఖీలకు వస్తామంటూ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయి తనిఖీలకు వస్తే ఏ పనులు చూపెట్టాలా... అని అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేకంగా అభివృద్ధికి నిధులు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఆయా జిల్లాల అభివృద్ధికి వెచ్చించకుండా ఇతర కార్యకలాపాలకు మళ్లించడమే కాకుండా ఆ నిధులన్నీ వ్యయం చేసినట్లు కేంద్రానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పంపడంపై నీతి ఆయోగ్ తీవ్రంగా స్పందించింది. క్షేత్రస్థాయిలో తనిఖీలకు ప్రత్యేకంగా కేంద్ర అధికారుల బృందాన్ని పంపిస్తామని స్పష్టం చేసింది. ఈ నిధులను వ్యయం చేస్తే గానీ తదుపరి నిధులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది.
ఖర్చు చేసింది రూ.7.92 కోట్లే
విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు జిల్లాలకు జిల్లాకు రూ.100 కోట్లు చొప్పున రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం రూ.700 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్ని ఖర్చు చేయడానికి ప్రణాళికలను రూపొందించాలని కేంద్రం సూచించింది. ఆ ఏడు జిల్లాలను మిగతా ఆరు జిల్లాలతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకురావడానికి కేంద్రం ఇచ్చిన నిధులను వ్యయం చేయాలి. విద్య, ఆరోగ్య సేవలు, మంచి నీటి వసతి వంటి ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల్లో వెనుకబడి ఉంటే ఆయా రంగాలపై కేంద్రం ఇచ్చిన నిధులను వ్యయం చేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను జిల్లాల కలెక్టర్లకు విడుదల చేసింది.
నిర్ధారించిన అంశాలకు కాకుండా ఇతర కార్యకలాపాలకు వ్యయం చేసుకునే వెసులబాటును కూడా కల్పించింది. దీంతో జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రి కార్యక్రమాల సభలు, సమావేశాలకు, స్కానింగ్ యంత్రాల కొనుగోళ్లకు వినియోగించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం రూ. 700 కోట్లు ఇస్తే కేంద్ర మార్గదర్శకాల మేరకు వ్యయం చేసింది కేవలం రూ. 7.92 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కేంద్రం ఇచ్చిన నిధుల వ్యయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం సమీక్షించకపోవడం..పూర్తిగా జిల్లా కల్టెర్లకే వదిలిపెట్టడం చూస్తే ఈ జిల్లాల అభివృద్ధిపై పాలకులున్న శ్రద్ధ ఏపాటిదో తెలుస్తోంది. ఏడు జిల్లాల్లో కలిపి రూ.419.14 కోట్ల విలువగల 7,616 పనులను మంజూరు చేశారు. అయితే రూ.103.96 కోట్ల విలువగల 1,977 పనులను మాత్రమే చేపట్టారు.
మాకే అబద్ధాలు చెబుతారా?
Published Wed, Jul 6 2016 2:39 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement