సాక్షి, హైదరాబాద్: స్వైన్ ఫ్లూ, కరోనా వైరస్‌లతో సతమతమవుతున్న భారత్‌ను ఇప్పుడు ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా-హెచ్7ఎన్9 వైరస్ భయపెడుతోంది. ప్రమాదకరమైన ఈ వైరస్ లక్షణాలు దేశంలో కనిపిస్తున్న సంకేతాలు అందడంతో సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలతో కూడిన హోర్డింగ్‌లను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేశారు. పక్షుల ద్వారా సంక్రమించే ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ తీవ్రత చైనా, తైవాన్ దేశాల్లో ఎక్కువగా ఉంది. ఈ వైరస్ సోకితే గొంతు వాపు, శ్వాస సరిగా అందకపోవడం, జ్వరం, నిస్సత్తువ తదితర ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతూ ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఈ లక్షణాలున్న రోగిని గుర్తిస్తే, ఆ వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు.
హజ్ యాత్రికులకు అవగాహన: మధ్యప్రాచ్య దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఈ ఏడాది తీవ్రంగా కనిపించింది. సౌదీ అరేబియాతో పాటు పలు గల్ఫ్ దేశాల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. ఈ దేశాలకు మన దేశం, రాష్ట్రం నుంచి చాలా మంది ప్రయాణికులు రాకపోకలు జరుపుతూ ఉండడం ఆందోళనకు కారణమవుతోంది.
ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 7వేల మంది హజ్ యాత్రకు అనుమతించింది. మరో ఆరు వేల మంది కూడా అక్కడికి ప్రైవేటుగా వెళ్లి వస్తుంటారు. దీంతో హజ్ యాత్రికుల విషయంలో ప్రత్యేక శ్రద్ధవహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. యాత్రికులకు అవగాహన కలిగించేందుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సౌదీలో రాష్ట్ర వైద్యుల బృందాన్ని అందుబాటులో ఉంచనున్నారు. హజ్ యాత్రికులకు తిరుగు ప్రయాణంలో ఎయిర్‌పోర్ట్‌లోనే వైద్య పరీక్షలు చేసేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సేకరించిన నమూనాలను వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఢిల్లీలోని వ్యాధి నిర్ధారణ కేంద్రం లేదా పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి గానీ పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
వణికిస్తున్న ఏవియన్ ఇన్‌ప్లుయెంజా!
Published Tue, Aug 27 2013 6:46 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement