ఏఎన్‌యూ: జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాని సాధనకోసం అహర్నిశలు కృషి చేయాలని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. యూనివర్సిటీలోని డైక్‌మెన్ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం జరిగిన యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల వార్షికోత్సవానికి రోహిత్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.రాంబాబు అధ్యక్షత వహించారు. నారా రోహిత్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, దానిని వెలికితీస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ప్రపంచాన్ని జయించే సత్తా చదువులో ఉందని చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.
నలుగురితో మంచి అనిపించుకోవడం గొప్ప విషయమని మంచిగా మెలగడం, మంచిగా చేయడం ద్వారా దీనిని సాధించవచ్చన్నారు. వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు మాట్లాడుతూ చార్లీ చాప్లిన్ లాంటి వంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. ఏఎన్‌యూ భవిష్యత్‌లో ప్రపంచంలోనే ప్రముఖంగా విలసిల్లిన నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల స్థాయికి చేరుకుంటుందన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు దానికోసం కృషి చేయాలన్నారు. ఆచార్య సి.రాంబాబు అధ్యక్షోపన్యాసం చేస్తూ వైకల్యాలను అధిగమించి ప్రపంచంలోనే అద్భుతాలు సృష్టించిన గొప్ప వ్యక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
రెక్టార్ కేఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, వీసీ సతీమణి డాక్టర్ జ్యోతి వియ్యన్నారావు, ఆర్ట్స్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఎస్. విజయరాజు, సైన్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ బి.విక్టర్‌బాబు ప్రసంగించారు. ఈ విద్యాసంవత్సరంలో క్రీడలు, విద్యా పరమైన అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.మధుబాబు, మిమిక్రీ కళాకారుడు బి.శివకుమార్ పలువురు అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోండి
Published Wed, Mar 25 2015 2:06 AM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM
Advertisement
Advertisement