సాక్షి, న్యూఢిల్లీ : విజయవాడ-అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణంలో పనులు ఆలస్యం కావడానికి అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే కారణమని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం భూసేకరణలో ఆలస్యం చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని రాజ్యసభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మంత్రి తెలిపారు.
తొలుత నూరు శాతం ఖర్చుతో భూసేకరణ చేస్తామని చంద్రబాబు చెప్పారని, తర్వాత భూ సేకరణకు అయ్యే ఖర్చును రాష్ట్రం, కేంద్రం చెరిసగం భరించాలని అభ్యర్ధించారని తెలిపారు. భూసేకరణ ఖర్చు భారీగా పెరిగిందని, ప్రాజెక్టుకు రూ 1800 కోట్లు ఖర్చయితే భూసేకరణకు రూ 800 కోట్లు అవుతోందని అన్నారు. దీంతో హైవే ప్రాజెక్టుల నిర్మాణం కష్టసాధ్యంగా మారిందని చెప్పారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనందున రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని గడ్కరీ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నందున అమరావతి-అనంతపురం గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూసేకరణ అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా.. అని విజయసాయి రెడ్డి అడిగిన అనుబంధ ప్రశ్నకు గడ్కరీ బదులిచ్చారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం భూసేకరణ అయ్యే ఖర్చులో 50% భరిస్తోందని మిగిలిన రాష్ట్రాలు కూడా ముందుకు వస్తున్నాయని అన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ముందుకు రావాలని కోరారు. ప్రాజెక్ట్ వ్యయంలో 15 నుంచి 18 శాతం రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న టాక్స్‌ను ఉపసంహరించుకుంటే దానికి ప్రతిగా ఆయా ప్రాజెక్ట్‌లలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆమేరకు వాటా ఇస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment