ఏపీలో 5 గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు | NHAI Five Greenfield Corridor Projects Andhra Pradesh Nitin Gadkari | Sakshi
Sakshi News home page

ఏపీలో 5 గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు

Published Wed, Apr 6 2022 5:25 PM | Last Updated on Wed, Apr 6 2022 5:25 PM

NHAI Five Greenfield Corridor Projects Andhra Pradesh Nitin Gadkari - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌మాల పరియోజన తొలి దశ కింద ఆంధ్రప్రదేశ్‌లో అయిదు గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు చేపట్టినట్లు రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ అయిదు ప్రాజెక్ట్‌లు 2026-27 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అయిదు గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ల వివరాలను ఆయన తన జవాబులో పొందుపరిచారు. అందులో విశాఖపట్నం-రాయపూర్‌ మధ్య 99.63 కిలోమీటర్లు దూరం నిర్మించే ఆరు వరసల జాతీయ రహదారికి రూ. 3,183 కోట్లు మంజూరు చేయగా ఇప్పటికే రూ.202 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

ఖమ్మం-దేవరాపల్లి మధ్య 56 కి.మీ దూరం నిర్మించే నాలుగు వరుసల రహదారి (ఎన్‌హెచ్‌ 365బీజీ) కోసం రూ.1281 కోట్లు కేటాయించగా ఇప్పటికే 200 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. చిత్తూరు-థాట్చూర్‌ మధ్య 96 కి.మీ దూరం నిర్మించే ఆరు వరసల రహదారి (ఎన్‌హెచ్‌-716బీ) కోసం 3179 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు 123 కోట్ల రూపాయలు ఖర్చయింది. బెంగుళూరు-చెన్నై మధ్య 85 కి.మీ దూరం నిర్మించే ఎక్స్‌ప్రెస్‌వేకు రూ.4,137 కోట్లు కేటాయింపు జరగ్గా ఇప్పటికి రూ. 123 కోట్లు ఖర్చయింది. బెంగుళూరు-విజయవాడ మధ్య 343 కి.మీ దూరం నిర్మించే కారిడార్‌కు సంబంధించి ప్రాజెక్ట్‌ తీరుతెన్నులు, వ్యయంకు సంబంధించి డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ రూపొందించే పని ప్రారంభమైనట్లు మంత్రి గడ్కరీ వివరించారు.

చదవండి: (ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారు!) 

ఏపీలో రూ.5,347 కోట్లతో 28 ఆర్వోబీల నిర్మాణం
'సేతు భారతం' కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో 28 రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిలు (ఆర్‌వోబీలు), రోడ్డు అండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ల నిర్మాణం చేపట్టినట్లు రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ 28 ఆర్‌వోబీ, ఆర్‌యూబీల నిర్మాణానికి 5,347 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఎన్‌హెచ్‌ 205పై చిత్తూరు జిల్లా తుమ్మనం గుంట వద్ద చేపట్టిన నాలుగు వరసల ఆర్‌వోబీ పనులు, ఎన్‌హెచ్‌ 40పై వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఊటుకూరు వద్ద నాలుగు వరసల ఆర్వోబీ పనులు, ఎన్‌హెచ్‌ 18పై చిత్తూరు జిల్లా ముత్తిరేవుల వద్ద చేపట్టిన నాలుగు వరసల ఆర్వోబీ పనులు, చిత్తూరు జిల్లాలో ఎన్‌హెచ్‌18పై మురకంబట్టు వద్ద చేపట్టిన నాలుగు వరసల ఆర్‌వోబీ పనులు పూర్తయినట్లు మంత్రి తెలిపారు.

అనంతపురం జిల్లాలోని ఎన్‌హెచ్‌ 205పై రాప్తాడు వద్ద చేపట్టిన నాలుగు వరసల ఆర్‌వోబీ పనులు ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తవుతాయి. చిత్తూరు జిల్లాలోని ఎన్‌హెచ్‌ 205పై తిరుపతి వద్ద చేపట్టిన నాలుగు వరసల ఆర్వోబీ పనులు ఈ ఏడాది ఏప్రిల్‌ నెలాఖరుల నాటికి పూర్తవుతాయని తెలిపారు. మిగిలిన ప్రాజెక్ట్‌లలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణంలో ఎన్‌హెచ్‌ 214పై నిర్మించ తలపెట్టిన ఆర్వోబీ, అదే జిల్లాలోని వీరవాసరం వద్ద తలపెట్టిన ఆర్వోబీ కోర్టు కేసుల కారణంగా నిలిపివేసినట్లు మంత్రి చెప్పారు.

ఏపీలో మరిన్ని కేవీలు ఏర్పాటుచేసే ప్రతిపాదన ఉందా? 
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యావకాశాలను అన్ని ప్రాంతాలకు సమంగా విస్తరించేలా చూసేందుకు మరిన్ని కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం వద్ద ఉందా అని బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి విద్యా శాఖ మంత్రిని ప్రశ్నించారు. దీనికి విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ జవాబిస్తూ కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి ఒక విధానం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికమంది ఉండే ప్రాంతాల్లో మాత్రమే వారి పిల్లలకు విద్యావకాశం కల్పించేందుకు ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తుంది తప్ప జిల్లాల ప్రాతిపదికన కేవీల ఏర్పాటు జరగదని, అది ప్రభుత్వ విధానం కాదని ఆయన స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement