* ఆరు రోజులవుతున్నా తేరుకోని తుపాను బాధిత ప్రాంతాలు
* ఆర్భాటమే తప్ప ఆర్చేవాళ్లు లేరు... తీర్చేవారూ లేరు
* సాయం కోసం నిరుపేదల ఎదురుచూపులు
* విశాఖలోనే ఉన్నా తొంగిచూడని సీఎం, అధికారులు
* పప్పు, నూనె సరే.. ఇప్పటికీ 15 శాతం మందికి కూడా అందని బియ్యం
* నిస్సహాయ పరిస్థితుల్లో సరుకుల కోసం రోడ్డెక్కుతున్న మహిళలు
* 6.05 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
(విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): హుదూద్ తుపాను బీభత్సం సృష్టించిన నేపథ్యంలో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ పేరిట సీఎం చంద్రబాబు రాక. ఆయన వెంటే పొలోమని విశాఖకు తరలివచ్చిన రాష్ట్ర కేబినెట్. ఏకంగా 30 మంది ఐఏఎస్ అధికారుల మకాం. పెను తుపానుపై రాష్ర్ట ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు. సీఎం నిరంతర సమీక్షలు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల హడావుడి. తుపాను దెబ్బకు సర్వస్వం కోల్పోయి సాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులు ఇక తమకు తక్షణ సహాయం అందుతుందని, ప్రభుత్వం తమను వెంటనే సాధారణ జీవనంలోకి తీసుకుని వస్తుందని ఆశ పడ్డారు. కానీ తుపాను విధ్వంసం ముగిసి ఆరు రోజులు గడుస్తున్నా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాలు, ముఖ్యంగా విశాఖ నగరంలో ఎవరికీ పూర్తిస్థాయిలో సహాయం అందలేదు.
ఇక నిరుపేదలు, మురికి వాడల్లో నివసించే ప్రజానీకం అవస్థలు వర్ణనాతీతం. సహాయం పేరిట ఆర్భాటం తప్ప ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరూ.. నిజంగా సాయం కోసం అలమటిస్తున్న బాధితుల వైపు చూసిన పాపాన పోవడం లేదు. ఆరు రోజులుగా కరెంటు, నీళ్లు, తినడానికి తిండి, కంటి నిండా నిద్ర లేక బాధితులు అష్ట కష్టాలు పడుతున్నారు.
మరి తుపాను బాధితుల కోసం ప్రభుత్వం పంపిణీ చేసినట్లు చెబుతున్న ఆహారం, మంచినీళ్లు, బ్రెడ్డు, బిస్కట్లు ఇవన్నీ ఎక్కడికి పోయాయి? ఈ సాయం అందుకునే అర్హుల జాబితాలో మేము లేమా? చిమ్మ చీకట్లలో మేము పడుతున్న బాధలు విశాఖలోనే మకాం వేసిన సీఎం చంద్రబాబు దృష్టికి పోవడం లేదా? ఐఏఎస్ అధికారుల అడుగులు మా ప్రాంతాల వైపు పడవా? అని వేలాదిమంది బాధితులు తమను తామే ప్రశ్నించుకుంటున్నారు. కళ్లల్లో నీళ్లు, కడుపులో ఆకలితో కోపం కట్టలు తెగుతుంటే నిస్సహాయ స్థితిలో తమలో తామే కుమిలిపోతున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన 25 కిలోల బియ్యం, ఉప్పు, పప్పు, కిరోసిన్, నూనె, పంచదార, కారం.. అన్నిటికీ కోత విధిస్తూ అరకొరగా బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేస్తుంటే.. ఆకలితో అల్లాడుతున్న నిరుపేద జనం రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు.
హుదూద్ తుపాను సృష్టించిన విధ్వంసానికి విశాఖ నగరం సగానికి పైగా దెబ్బతింది. విజయనగరం జిల్లాలో 11, శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. 6.05 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నారుు. విద్యుత్ సరఫరా లేక విశాఖ నగరం, గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. సముద్ర తీరంలోని మత్స్యకార గ్రామాలు, తీరానికి దగ్గర్లో ఉన్న ఇతర గ్రామాలు, పట్టణాల్లోని మురికి వాడల్లో నివసించే పేద తరగతి జనం తాగడానికి నీళ్లు, తినడానికి తిండి, పిల్లలకు బిస్కట్లు, పాలు, ఇంట్లో దీపానికి కిరోసిన్ కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. బాధితులందరికీ లక్షల సంఖ్యలో ఆహారం పొట్లాలు, లక్షల లీటర్ల పాలు, నీళ్ల బాటిళ్లు అందించామని ప్రభుత్వం చెబుతున్నా ఇలాంటివేవీ వారి దరి చేరలేదు.
విజయనగరం జిల్లా బోగాపురం మండలం దిబ్బపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించి బాధితులకు అనేక ఓదార్పు హామీలు ఇచ్చి రెండు రోజులు గడిచినా అటు కేసి తొంగి చూసిన అధికార పార్టీ నాయకులు గానీ, అధికారులు గానీ లేరు. ఆ మండలంలోని గాలిపేట, జమ్మయ్యపేట, నెల్లిమర్ల మండలం ధనాన్నపేట, సారిపల్లితో పాటు అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
తీవ్ర నష్టం చవిచూసిన విశాఖ నగరంలోని వాంబేకాలనీ, ఆరిలోవ, శివాజీపాలెం, తాటిచెట్లపాలెం, కొమ్మాది, మధురవాడ, రేసపువానిపాలెం, ఎండాడ, సాగర్ నగర్, రాజీవ్ నగర్, శాంతిపురం, శివగణేష్ నగర్, సింహాద్రిపురం, దుర్గానగర్, ఏఎస్‌ఆర్ నగర్‌తో పాటు అనేక ప్రాంతాల్లో ఇదే దుస్థితి. చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఐదు రోజులుగా విశాఖలోనే మకాం వేసినా నగరం చుట్టూ ఉన్న పేదలు నివసించే తుపాను బాధిత ప్రాంతాలవైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం.
ఎవ్వరూ రాలేదు...
నేనుండే రేకుల ఇల్లు పూర్తిగా దెబ్బతింది. మా ఎమ్మెల్యేనో, ఆఫీసర్లో వచ్చి సాయం చేస్తారేమోనని ఆశగా ఎదురు చూసినా ఇంత దాకా ఎవ్వరూ కనీసం పలకరించలేదు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం, పప్పులు, పాలు సంగతెలాగున్నా తాగడానికి నీళ్లు కూడా అందడం లేదు. నాలుగు రోజులుగా కరెంటు లేక నానా అవస్థలు పడుతున్నాం. అప్పు తెచ్చి ఇల్లు బాగు చేయించుకుంటున్నా.
- కె. లక్ష్మి, శంకరమఠం రోడ్డు, విశాఖ.
రెండు గంటల్లో బాగవుతాయన్నారు..
నిన్న మేమంతా మంత్రి గంటా ఇంటికి వెళ్లాం. అక్కడ మా కష్టాలన్నీ చెప్పాం. రెండు గంటల్లో అన్నీ బాగవుతాయని పంపారు. ఇప్పటికి 24 గంటలు గడిచింది. ఎవ్వరూ వచ్చిన పాపాన పోలేదు. పేదోల్లంటే ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? మాకు తిండి గింజలు కూడా లేవు.
- పి.తులసీ శివశంకర్, దుర్గానగర్, విశాఖ
ఆర్‌ఐ సంతకాలు పెట్టాలంట..
రెండు నెలలుగా రేషన్ డీలర్లు బియ్యం ఇవ్వడం లేదు. తుపాను పరిహారం కిందైనా ఇస్తారని వస్తే రెవిన్యూ ఇనస్పెక్టర్ సంతకం కావాలంటున్నారు. ఆయన కోసం వెళితే ఆఫీసుకు తాళాలు వేసి ఉంటున్నాయి. ఏం చేయూలి చెప్పండి?
- కె. నాగేశ్వరరావు, వాంబే కాలనీ, విశాఖ
అద్దెకున్న వారి సంగతేంటో సీఎం చెప్పాలి?
మూడంతస్తులపైన ఉన్న రేకుల షెడ్డులో అద్దెకు దిగాం. తుపాను వల్ల ఇంటి రేకులతో పాటు ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం ఎగిరిపోయింది. టీవీ తడిచి పాడయింది. ఓ ఆర్‌ఐ వచ్చి చూశారు. మేము అద్దెకుంటున్నామని చెప్పగానే తిరిగి వెళ్లిపోయారు. అద్దెకున్న వారికి మేము ఏమీ చేయలేమని చెప్పారు. మా సంగతేంటో ముఖ్యమంత్రి చెప్పాలి.
- భవానీ, మహారాణిపేట, 20వ వార్డు
రోడ్డుపై చీకట్లో పడుకుంటున్నాం..
తుపానుకు ఇళ్లు కోల్పోయాం. ఇప్పటివరకూ మా ఎమ్మెల్యే కూడా రాలేదు. ఇల్లు లేక రోడ్డుపై చీకటిలో పడుకోవాల్సి వస్తోంది.. వారం కావస్తున్నా మా బాధలు పట్టించుకున్నవారు లేరు.
- వి.నాగమణి, ఎండాడ. రాజీవ్‌నగర్ కాలనీ.
తినడానికి తిండీ లేదు
Published Sat, Oct 18 2014 2:15 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement