లేనిది ఉన్నట్టు.. బాబు కనికట్టు! | no industries started in prakasam dist | Sakshi
Sakshi News home page

లేనిది ఉన్నట్టు.. బాబు కనికట్టు!

Published Thu, Mar 9 2017 3:08 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

లేనిది ఉన్నట్టు.. బాబు కనికట్టు!

లేనిది ఉన్నట్టు.. బాబు కనికట్టు!

ఒకే అబద్ధాన్ని పలు మార్లు చెప్పి జనాన్ని నమ్మించటంలో చంద్రబాబు సిద్ధహస్తులు. ఆలు... చూలు లేకుండానే రాష్ట్రంలో 10 లక్షల కోట్లతో పరిశ్రమలు నెలకొల్పామని ఆర్భాటంగా  ప్రచారం చేస్తున్న బాబు సర్కారు వాస్తవానికి ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పిన పాపాన పోలేదు. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు.. పాత పరిశ్రమలు సైతం ప్రభుత్వ ప్రోత్సాహం లేక  మూతపడుతున్నాయి. పర్యవసానంగా కొత్త ఉద్యోగాల సంగతి అటుంచి, ఉన్న ఉద్యోగాలు సైతం పొగొట్టుకొని కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది.

► పరిశ్రమలపై సర్కారు కాకి లెక్కలు
► వంచించి జనాన్ని నమ్మించే ప్రయత్నం
► మూడేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాని వైనం
► స్థాపనకు ముందుకు రాని పారిశ్రామికవేత్తలు
► ఎంఓయూలు చేసుకున్నాఏర్పాటుకు ససేమిరా
► ప్రభుత్వ రాయితీల్లేవ్‌.. ప్రోత్సాహకాల్లేవ్‌..
► మూతపడుతున్న పాత పరిశ్రమలు
► రోడ్డున పడుతున్న వేలాది మంది కార్మికులు


 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారం చేపట్టగానే ప్రకాశం జిల్లాలోని దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పుతామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఇతర దేశాల నుంచి పరిశ్రమలు వస్తున్నాయని హడావుడి చేశారు. ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతాలను సందర్శించడం మినహా ఇప్పటికీ ఒక్క పరిశ్రమను కూడా నెలకొల్పలేదు. ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న మూడు, నాలుగు పరిశ్రమలు సైతం ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పటానికి ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా నీరు, పోర్టు, రోడ్లు, విమానాశ్రయం లాంటి సౌకర్యాలు లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ ఒక్క పరిశ్రమను నెలకొల్పకపోయినా బాబు ప్రభుత్వం మాత్రం ఎంఓయూలు లెక్క కట్టి లక్షల కోట్ల పరిశ్రమలు వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం గమనార్హం.

పారిశ్రామికవేత్తల వెనుకడుగు..: కందుకూరు మండలం కోవూరు వద్ద పరిశ్రమ ఏర్పాటుకు రంగా ఫర్టికల్‌ బోర్డు (ఆగ్రో బేస్డ్‌ సంస్థ) ముందుకు వచ్చింది. దీంతో పాటు బీబీఎల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (మినరల్‌ బేస్డ్‌) మద్దిపాడు మండలం గుళ్లాపల్లి వద్ద, వీఎస్‌ఎల్‌ సోలార్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పొన్నలూరు మండలం వేలటూరు వద్ద, ఆర్‌కెఎస్‌ టెక్నో విజన్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పవర్‌ జనరేషన్‌) వెలిగండ్ల మండలం మొగ్గళ్లూరు వద్ద, స్ప్రింగ్‌బీ డెయిరీ ప్రోడక్ట్‌ (ఫుడ్‌ అండ్‌ ఆగ్రో) పొదిలి మండలం, ఓగులక్కపల్లి గ్రామం వద్ద పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. ఇదే తరహాలో జాసన్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఫెర్టిలైజర్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌), మోహన్‌ వెల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఇండస్ట్రీయల్‌ పార్కు), రంగా ఫర్టికల్‌ బోర్డు, చైనాకు చెందిన కన్సార్టియం ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలు, తమిళనాడుకు చెందిన మోహన్‌ సింటెక్స్‌ టెక్స్‌టైల్స్‌ తదితర కంపెనీలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం దొనకొండతో పాటు పలు ప్రాంతాలను పరిశీలించారు. వీరిలో ఏ ఒక్కరు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు.

రాయితీ ఎగనామం...: రాష్ట్ర విభజన చట్టప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన పారిశ్రామిక పన్ను రాయితీలపై కేంద్రం సెప్టెంబర్‌ 30న కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాలకు పారిశ్రామిక పన్ను రాయితీలను కల్పిస్తూ సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాయలసీమ జిల్లాలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు మాత్రం ఈ జాబితాలో చోటు కల్పించలేదు. విభజన చట్టప్రకారం 2015 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి వరకు ఐదేళ్ల పాటు జిల్లాలో నెలకొల్పబోయే పరిశ్రమలకు 15 శాతం తరుగుదల పన్ను, పరిశ్రమ ప్లాంట్, కొత్త యంత్రాల వ్యయంపై 15 శాతం పెట్టుబడి అలవెన్సులిస్తారు. ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్‌ 32(1), (2ఎ), సెక్షన్‌ 32ఎడి ప్రకారం పై ఏడు జిల్లాలను కేంద్రం నోటిఫై చేసింది.

జిల్లాలో పాత పరిశ్రమలు–వాటి తీరు: పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం 2016 డిసెంబర్‌ 20 నాటికి జిల్లాలో 85 పెద్ద, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. రూ.2,928.80 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పిన ఈ పరిశ్రమల ద్వారా 22,093 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చెబుతున్నారు. ఇవికాక జిల్లావ్యాప్తంగా 7,593 చిన్న పరిశ్రమలున్నాయి. 2,040.93 కోట్లతో ఏర్పాటైన ఈ పరిశ్రమల ద్వారా 81,277 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ప్రోత్సాహకాలివ్వని సర్కారు..: ప్రభుత్వం ఎటువంటి రాయితీలు, ప్రోత్సాహకాలివ్వకపోవడంతో ఇటీవల కాలంలో పరిశ్రమలు ముందుకు నడిచే పరిస్థితి లేకుండాపోయింది. పన్నుల పెంపు, అదనపు పన్నులు వేయడం, విద్యుత్‌ చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెంచటం తదితర కారణాలతో చిన్న పరిశ్రమలు మూతబడుతున్నాయి. జిల్లాలో మొత్తంగా 7678 పరిశ్రమలుండగా చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత దాదాపు 30 శాతం పరిశ్రమలు (2000లకుపైగా) మూతబడినట్లు సమాచారం. విద్యుత్‌ బిల్లులతో పాటు బ్యాంకు రుణాలకు సంబంధించిన కంతులు చెల్లించలేక ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయి. దీంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు. కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోననైనా ప్రభుత్వాలు చిన్న పరిశ్రమలకు రాయితీలు కల్పించాల్సి ఉన్నా...  సర్కారు ఏ మాత్రం స్పందించటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement