వెనక్కు తగ్గేదే లేదు
Published Wed, Aug 28 2013 4:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : ఢిల్లీ పాలకులు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చుకునేంత వరకూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆపేదే లేదని జిల్లా ప్రజలు స్పష్టం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా రోడ్లపైకి వచ్చి సమైక్యాంధ్ర నినాదాలను మార్మోగిస్తున్నారు. ఉద్యమం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నప్పటికీ ఏమాత్రం జోరు తగ్గలేదు. పైగా రోజుకో రకంగా హోరెత్తిపోతోంది. అన్నిరంగాల ప్రజలు వినూత్న కార్యక్రమాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో మంగళవారం భారీ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినదించారు.
కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న ఉద్యోగుల దీక్షలు...
సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద చేపట్టిన సామూహిక రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. వైద్యారోగ్యశాఖకు చెందిన సుమారు 500 మంది ఉద్యోగులు మంగళవారం దీక్షలో పాల్గొన్నారు. జిల్లా అధికారులు, ఎన్‌జీఓలు వారికి సంఘీభావం తెలిపారు. సమైక్య రాష్ట్ర ప్రకటన వచ్చేంత వరకు ఆందోళనలు కొనసాగించాలని, ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలని తీర్మానించారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రకు చెందిన ఉద్యోగులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు శరత్‌బాబు, సీవీ ప్రసాద్, ఎన్.శ్రీనివాసరావు, డి.నాగేశ్వరరావు, ఎస్.ఓంకార్, సంతోషమ్మ, కేఎస్ ప్రకాశరావు, సరోజినీదేవి, ఆనందబాబు, బాలకోటయ్య పాల్గొన్నారు.
టైలర్ల భారీ ర్యాలీ...
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని దర్జీలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టైలర్స్ చెట్టు వద్ద నుంచి గాంధీరోడ్డు, పొట్టిశ్రీరాములు విగ్రహం మీదుగా చర్చిసెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం చర్చి సెంటర్‌లో కుట్టుమిషన్లతో మానవహారం నిర్వహించారు. రోడ్డుపైనే దుస్తులు కుట్టి నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వీఎం రావు, కె.నాగేశ్వరరావు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో రాస్తారోకో...
సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులతో స్థానిక రాంనగర్ ఒకటో లైన్ వద్ద రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రోడ్డుపై ఆటలాడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫ్రంట్ నాయకులు నాగరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు...
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా యూటీఎఫ్ ఒంగోలు ప్రాంతీయ మండలాల ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం ఎదుట ఏర్పాటు చేసిన రిలే దీక్షలను జేఏసీ నాయకుడు అబ్దుల్‌బషీర్ మంగళవారం ప్రారంభించారు. సమైక్యాంధ్ర కోసం యూటీఎఫ్ నిర్వహిస్తున్న దశలవారీ పోరాటాల్లో రెండోదైన రిలే దీక్షలను స్వాగతిస్తున్నామన్నారు. సమైక్యాంధ్ర కోసం తెలంగాణలో యూటీఎఫ్ నిర్వహించిన ఉద్యమాన్ని కొనియాడారు. అదేవిధంగా సీమాంధ్రలో కూడా సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.
ఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్య ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఢిల్లీ పాలకులు ఉపసంహరించుకునేలా చేయాలని పిలుపునిచ్చారు. జై సమైక్యాంధ్ర నినాదాన్ని మారుమూల పల్లెల్లో సైతం మార్మోగించాలని సూచించారు. సాయంత్రం 5 గంటలకు సీనియర్ నాయకుడు ఎస్‌కే షంషుద్దీన్ శిబిరంలో కూర్చున్నవారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. రిలే దీక్ష శిబిరానికి యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు డి.వీరాంజనేయులు అధ్యక్షత వహించగా ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంపీ రత్నకుమార్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ఎస్.రవి, కార్యవర్గ సభ్యుడు కె.ప్రసాద్, మహిళా విభాగం కన్వీనర్ ఝాన్సీలక్ష్మీభాయి, ఎన్.రమేష్, చెంచుపున్నయ్య, సంజీవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎం.హనుమంతరావు, ఎస్.శ్రీనివాసరావు, ఇ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇతర మండలాల్లో....
సమైక్యాంధ్రకు మద్దతుగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాలోని చినగంజాం, చీరాల, మార్టూరు, అద్దంకి, దర్శి, పొదిలి, ఒంగోలు, సింగరాయకొండ, కందుకూరు, బి.పేట, గిద్దలూరు, మార్కాపురంలో మంగళవారం మొదటిరోజు రిలే దీక్షలు నిర్వహించారు. ఆయా మండలాల్లోని సుమారు 400 మంది యూటీఎఫ్ కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. 300 మంది ఉపాధ్యాయులు హాజరై వారికి మద్దతు ప్రకటించారు. మొత్తం మూడు రోజుల పాటు (29వ తేదీ వరకు) దీక్షలు నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు.
Advertisement
Advertisement