ఏదీ పని?
చేయడానికి పనుల్లేక పిల్లలను ముసలోళ్లకు అప్పగించి, ఉన్న ఊరిని వదిలేసి గుంపులు గుంపులుగా బీద జనం నగరాలకు వలసపోతున్న దృశ్యాలు జిల్లాలో నిత్యకృత్యమయ్యూరుు.. అడిగిన వారందరికీ పని చూపిస్తామని గొప్పలు చెబుతున్న అధికారులు చేతల వరకు వచ్చే సరికి చేతులెత్తేశారు.. ఇదేంటని ప్రశ్నించి న్యాయం చేయూల్సిన పాలకులు చోద్యం చూస్తున్నారు.
అనంతపురం సెంట్రల్ : మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కరువు జిల్లా అనంత వాసులకు అక్కరకు రాకుండా పోతోంది. కరువు పరిస్థితుల దెబ్బకు తట్టుకోలేక వలసబాట పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 43 వేల కుటుంబాలు పెద్ద నగరాలకు వలసపోయాయని సమాచారం. లక్షలాది మంది సొంత ఊళ్లలోనే ఉంటూ పొట్ట చేతపట్టుకొని వివిధ పనుల కోసం రోజూ పట్టణాలకు వస్తున్నారు.
వలస నివారణే లక్ష్యంగా జిల్లా నుంచి పురుడుపోసుకున్న ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడంలో అధికారులు విఫలం కావడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలో 7.61 లక్షల కుటుంబాలు (జాబ్ కార్డు పొందిన వారు) ఈ పథకంపై ఆధారపడ్డాయి. ఇందులో 18,20,780 మంది కూలీలు ఉన్నారు. జాబ్ కార్డు పొందిన వారిలో 4.50 లక్షల మంది కూలీలు నిత్యం పనులకు వస్తున్న వారిలో ఉన్నారు.
అయితే వీరందరికీ పనులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1006 పంచాయతీలుండగా కేవలం 582 పంచాయతీల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయి. అదికూడా అరకొరగానే జరుగుతుండడంతో గ్రామంలోని కూలీలందరూ ఉపాధి పనులకు పోవడానికి ఆస్కారం లేకుండాపోతోంది. 4.50 లక్షలకు పైగా కూలీలు ఉన్న జిల్లాలో కేవలం 28,714 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తుండడం అధికారుల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణం
ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పథకంపై అపోహలను సృష్టించింది. వేతనాల పంపిణీ బాధ్యతల నుంచి ఫినో ఏజెన్సీ తప్పుకోవడంతో దాదాపు రూ.12 కోట్ల మేర బిల్లులు పేరుకుపోయాయి. అనంతరం పోస్టాఫీసుకు బాధ్యతలు అప్పజెప్పడానికి సెప్టెంబర్ నుంచి జనవరి వర కు సమయం తీసుకోవడంతో ఉపాధి కల్పనపై దెబ్బపడింది.
జిల్లా వ్యాప్తంగా 1006 పంచాయతీలకు గాను 582 పంచాయతీల్లో కేవలం 28,714 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే స్థానికంగా పనులు కల్పించడంలో డ్వామా సిబ్బంది ఏమేరకు శ్రద్ద వహిస్తున్నారో అర్థమవుతోంది. ప్రస్తుతం బకాయి వేతనాల పంపిణీ ప్రక్రియ సాగుతోంది. ఫినో ఏజెన్సీ వైపు నిలిచిపోయిన రూ. 2.06 కోట్లు ఎప్పుడొస్తాయో తెలియడం లేదు. దీనికి తోడు 100 రోజులు మాత్రమే పని అనే నిబంధన కూలీల పట్ల శాపంగా మారింది.
ఖరీఫ్ పంట కోతల అనంతరం మళ్లీ ఖరీఫ్ పంటలు సాగయ్యేంత వరకూ వ్యవసాయ ఆధారిత కూలీలకు పనులుండవు. ఈ సమయంలో ఉపాధి పనులే శరణ్యం. దాదాపు అరునెలల పాటు కూలీలకు ఉపాధి తప్పనిసరి కాగా మూడు నెలలు మాత్రమే పనులు కల్పిస్తామనే నిబంధన పెద్ద గుదిబండగా మారింది. ఈ విషయంపై ఇటీవల జెడ్పీ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేసి పంపినా ప్రభుత్వంలో చలనం రాలేదు. వీటన్నింటికి తోడు దినసరి కూలీ ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు.
మొన్నటి వర కు రూ.149 వేతనం ఉండేది. ఈ నెల నుంచి రూ.20 పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే కూలీలకు కొండగుట్టల్లో పనులు చూపిస్తుండడంతో రూ.100 నుంచి రూ.120 మద్య కూలీ పడుతోంది. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ కూలీ కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదని కూలీలు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పనులు కల్పించండి మహాప్రభో అని వేడుకుంటున్నా ఉపాధి చూపించే నాథుడు కరవయ్యాడు. దీంతో గత్యంతరం లేక పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
జిల్లాలో ‘ఉపాధి’ పరిస్థితి ఇదీ..
నియోజకవర్గం మొత్తం కూలీలు హాజరవుతున్న కూలీలు
ధర్మవరం 33889 2312
గుంతకల్లు 24712 1927
హిందూపురం 10014 785
కదిరి 31058 3079
కళ్యాణదుర్గం 43680 4113
మడకశిర 22115 1505
పెనుకొండ 26905 1192
పుట్టపర్తి 37197 2443
రాప్తాడు 40569 1768
రాయదుర్గం 34592 2531
శింగనమల 48790 3340
తాడిపత్రి 26358 2185
ఉరవకొండ 42238 1383
అనంతపురం 4524 151
పని కల్పించలేదని ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు : ఎ. నాగభూషణం, ప్రాజెక్టు డైరక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ కూలీలందరికీ పనులు కల్పించాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అవగాహన కోసం చైతన్య రథాలను ఏర్పాటు చేశాం. ఎంతమందికైనా పనులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం.
కనిష్ట స్థాయికి పడిపోయిన కూలీల సంఖ్యను పెంచుతూ వస్తున్నాం. నల్లరేగడి భూముల్లో ఇంకా వ్యవసాయ పనులు ఉండడం ద్వారా ఎక్కువ మంది రావడం లేదు. ఈ నెలాఖరు నుంచి కూలీల సంఖ్యను రెట్టింపు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గ్రామంలో పని అడుగుతున్నా కల్పించడం లేదని కూలీలు ఫిర్యాదు చేస్తే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓలపై కఠిన చర్యలు తీసుకుంటాం.