‘ఇల్లా’.. మొదలైంది!
Published Sun, Jan 19 2014 2:59 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇప్పటికే ముగ్గురు ఆశావహులు.. ఆరు వర్గాలతో కలహాల కుంపటిగా మారిన ఇచ్ఛాపురం టీడీపీలో సరికొత్త చిచ్చు రేగింది. మరో కొత్త ‘ముఖం’ రేసుగుర్రంలా రంగంలోకి దూసుకురావడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం విశాఖలో కాంట్రాక్టరుగా ఉన్న మందస మండలానికి చెందిన ఇల్లా షణ్ముఖరావు ఆశావహుల జాబితాలో చేరడంతో ఇదే స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బెందాళం వర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎలాగైనా ‘ఇల్లా’ను అడ్డుకోవడానికి ఈ వర్గం హుటాహుటిన రంగంలోకి దిగింది.పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు వర్దంతి కార్యక్రమమే బెందాళం, ఇల్లా వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారి నియోజకవర్గ టీడీపీలో భవిష్యత్ వర్గపోరుకు సంకేతంగా నిలిచాయి.
వ్యూహాత్మకంగానే...
ఇచ్ఛాపురం రేసులోకి షణ్ముఖరావు హఠాత్తుగా వచ్చినట్టు పైకి కనిపిస్తున్నా, వాస్తవానికి చాలా వ్యూహాత్మంగా పావులు కదిపి తెరపైకి వచ్చారు. ఆయనకు ఓ వైపు గౌతు శివాజీ, మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావులు వెన్నుదన్నుగా నిలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ మంత్రి గౌతు శివాజీ కుటుంబంతో ఇల్లా కుటుంబానికి సుదీర్ఘకాలంగా అనుబం ధం ఉంది. షణ్ముఖరావు తండ్రి గౌతు లచ్చన్నకు అనుయాయుడిగా ఉండేవారు. అనంతర కాలంలో షన్ముఖరావు విశాఖపట్నం పోర్టు కాంట్రాక్టరుగా స్థిరపడి ఆర్థికంగా బలోపేతమయ్యారు. ఇప్పటికీ శివాజీ కుటుం బంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. ఎర్రన్నాయుడు హఠాన్మరణానంతర పరిణామాలతో శివాజీ ఇచ్ఛాపురంపై కూడా పట్టు సాధించాలని భావించారు.
అందుకే తన సన్నిహితుడైన ఇల్లాను బరిలోకి తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికల్లోనే కార్యాచరణకు ఉపక్రమించారు. షణ్ముఖరావు భార్య సుబ్బలక్ష్మిని తన నియోజకవర్గం పలాస పరిధిలోని మందస మండలం సొండిపూడి సర్పంచుగా గెలిపించారు. తాజాగా ఇచ్ఛాపురం నియోజకవర్గ టీడీపీ నేతల్లో కొందరిని ఇల్లా అనుకూల వర్గంగా కూడగట్టారు. ప్రధానంగా బెందాళం ప్రకాష్‌ను వ్యతిరేకిస్తున్న ఓ సామాజికవర్గ నేతలు ఇల్లా వెన్నంటి నిలిచారు. ఆయన సమకూర్చే వనరులతో నియోజకవర్గంలో తమ వర్గ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు వారు ఉపక్రమించారు.
విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఇల్లాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పోర్టు కాంట్రాక్టు వ్యాపారంలో తనకు సన్నిహితుడైన ఇల్లాను ప్రోత్సహించాలని ఆయన భావిస్తున్నారు. త్వరలో టీడీపీలో చేరునున్న గంటా శ్రీకాకుళం జిల్లాలో కూడా తనకంటూ ఓ వర్గాన్ని కూడగట్టుకుని ఉత్తరాంధ్రలో పట్టుసాధించాలన్న వ్యూహంతో ఉన్నారు. జిల్లా టీడీపీలో పట్టు కోసం శివాజీ, ఉత్తరాంధ్ర టీడీపీలో పట్టు కోసం గంటా ఇచ్ఛాపురంలో ఇల్లాను వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది.
బెందాళం వర్గంలో గుబులు
తాజా పరిణామాలు టికెట్ రేసులో ఉన్న బెందాళం అశోక్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అసలే అధినేత చంద్రబాబు టికెట్టుపై ఇంతవరకు హామీ ఇవ్వలేదు. ఆర్థిక వనరుల అంశాన్ని సాకుగా చూపించి తనను తప్పిస్తారనే భయం ఆయన్ని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా స్థితిమంతుడైన ఇల్లా షణ్ముఖరావు రంగంలోకి రావడంతో బెందాళం వర్గం డీలాపడిపోయింది. పైగా శివాజీ, గంటాల మద్దతు ఆయనకు ఉందని తెలియడంతో బెంబేలెత్తిపోతోంది. తాము నమ్ముకున్న కింజరాపు వర్గం ఇచ్ఛాఫురం వ్యవహారాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటం వారిని మరింత కుంగదీసింది. ఎన్టీరామారావు వర్ధంతి వేడుకల సందర్భంగా ఇల్లా ఇచ్ఛాఫురంలో కొంత హడావుడి చేయనున్నారని తెలిసి బెందాళం అశోక్ హడలిపోయారు.
ఇల్లాను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇచ్ఛాఫురం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కాళ్ల ధర్మారావు తదితరులు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి బెందాళం అశోక్‌కు ఆహ్వానం లేదు. అయినప్పటికీ ఇల్లాకు చెక్ పెట్టేందుకు అశోక్ ఆ కార్యక్రమానికి వెళ్లాలని చివరి నిముషంలో నిర్ణయించుకున్నారు. ముందుగా తన వర్గీయులను అక్కడికి పంపించారు. తాను వచ్చేవరకు కార్యక్రమం ప్రారంభించకుండా చూడమని చెప్పారు. అనంతరం అశోక్ అక్కడికి చే రుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇల్లా, బెందాళం ఒకరితో ఒకరు పోటీపడి మరీ దుప్పట్లు పంపీణీ చేశా రు. కాగా తమ నేత తెచ్చిన దుప్పట్లను అశోక్ పంపిణీ చేయ డంపై ఇల్లా వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశా రు. అశోక్ ఎంతగా యత్నించినా ఇల్లాను అడ్డుకోలేరని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Advertisement