సీటుకోసం ఫైటు
Published Mon, Oct 21 2013 3:57 AM | Last Updated on Tue, Oct 2 2018 6:48 PM
సాక్షి, నరసరావుపేట : నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ సీట్‌కోసం ఫైట్ మొదలైంది. ఇక్కడ సీనియర్లు ఉన్నా జూనియర్‌ను అందలం ఎక్కించడంపై వివాదం పెరిగింది. గత వారం రోజులుగా జరుగుతున్న ఈ వివాదం పట్టణంలో చర్చనీయాంశమైంది. గతంలో నరసరావుపేట ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ జోసఫ్‌రాజు 2010 జులై 3వ తేదీన తెనాలి ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌గా బదిలీపై వెళ్ళారు. దీంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో వైద్యునిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీనివాసరావును నరసరావుపేట ఏరియా వైద్యశాల ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా నియమించారు.
పది రోజుల క్రితం తెనాలి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జోసఫ్‌రాజును వైద్యవిధానపరిషత్ ఉన్నతాధికారులు తిరిగి నరసరావుపేట ఏరియా వైద్యశాలకు బదిలీ చేయడంతో ఈ నెల 11వ తేదీన ఆయన విధుల్లో చేరారు. దీంతో అసలు సమస్య మొదలైంది. ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీనివాసరావు బదిలీపై వచ్చిన డాక్టర్ జోసఫ్‌రాజు కంటే ఐదేళ్ళు జూనియర్ కావడంతో నిబంధనల ప్రకారం సూపరింటెండెంట్ ఛార్జ్‌ని జోసఫ్‌రాజుకు అప్పగించాల్సి ఉంది. కానీ పది రోజులుగా ఏదో ఒక సాకు చెబుతూ తనకు బాధ్యతలు అప్పగించకుండా శ్రీనివాసరావు కాలయాపన చేస్తుండటంతో జోసఫరాజు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. వారు కూడా తామేమీ చేయలేమనీ, ఈ వ్యవహారాన్ని మంత్రి కాసు వద్దే తేల్చుకోమని చెప్పినట్లు తెలిసింది.
దీంతో మంత్రిగారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇరువురు వైద్యాధికారులు కాంగ్రెస్‌పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను పట్టుకుని సిఫార్సులు చేయించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే వైద్యశాలలో సరైన వైద్యసేవలందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వైద్యాధికారుల కుర్చీల కుమ్ములాట రోగులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.
దీనిపై వైద్య విధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి వద్ద ‘సాక్షి ప్రస్తావించగా తనకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే కమిషనర్‌కు పంపుతానని తెలిపారు. నిబంధనల ప్రకారం ఎవరు సీనియర్ అయితే వారే సూపరింటెండెంట్‌గా వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు. దీనిపై తనకు ఎటువంటి అధికారం లేదని కమిషనర్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని వివరించారు.
Advertisement
Advertisement