![Guntur: Wife Plans To Assassinate Husband But Fails At Narasaraopet - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/30/WOMAN%20.jpg.webp?itok=dHBBjGSW)
సాక్షి, నరసరావుపేట(గుంటూరు: కూల్‌డ్రింక్‌లో విషం కలిపి భర్తను హత్యచేసేందుకు ప్రయత్నించిన భార్య, కుటుంబ సభ్యులపై మంగళవారం కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ సీఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాలు.. ఇస్సపాలెం పరిధిలోని సాయి హోమ్స్‌లో అంబటిపూడి సాయిచరణ్, కోమలి దంపతులు ఉంటున్నారు. వీరి మధ్య గత కొన్ని నెలలుగా విభేదాలు నెలకున్నాయి. ఈ క్రమంలో భర్త సాయిచరణ్ తన స్వగ్రామం అయిన కర్నూలులో ఉంటున్నాడు.
అయితే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకునేందుకు రావాలని ప్రకాష్ నగర్‌కు చెందిన ఉమామహేశ్వరి కబురు పెట్టింది. దీంతో సాయిచరణ్, కుటుంబ సభ్యులతో కలసి ఫిబ్రవరి 28వ తేదీ ఆమె ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భార్య కోమలి విషం కలిపిన మజా కూల్‌డ్రింక్ ఇవ్వటంతో తాగాడు. కొద్ది సేపటి తరువాత సాయిచరణ్ అనారోగ్యానికి గురి అయి వాంతులు చేసుకున్నాడు. బాధితుడిని కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు.
ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం కర్నూలులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ బాధితుడు చికిత్స పొందుతూ జరిగిన ఘటనపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి వద్ద స్టేట్‌మెంట్ నమోదు చేసిన కర్నూలు పోలీసులు ఘటన జరిగిన ప్రాంతం నరసరావుపేట పరిధిలో ఉండడంతో తదుపరి చర్యల నిమిత్తం ఫిర్యాదును వన్‌టౌన్ పోలీసులకు పంపారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో భార్య కోమలి, ఆమె కుటుంబ సభ్యులు, మధ్యవర్తి ఉమామహేశ్వరిలపై హత్యాయత్నాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment