
బెంగళూరు: జీవితాంతం తోడునీడగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేసిన భార్య దారి తప్పి కట్టుకున్నోడిని కడతేర్చింది. పిన్ని కుమారుడితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేయడానికి రౌడషీటర్లకు భార్య రూ. 5 లక్షల సుపారీ ఇచ్చి పరలోకానికి పంపించిన వైనమిది. కర్ణాటక రాష్ట్రం తుమకురు జిల్లాలోణి కుణిగల్ తాలూకాలోని సీనప్పనహళ్ళి గ్రామానికి చెందిన మంజునాథ్ హత్యకు అతని భార్య హర్షిత (20) కిరాయి ఇచ్చింది.
ఈ కేసులో ఆమెను, ఆమె పిన్ని కుమారుడు రఘు, ఇతని మిత్రుడు రవికిరణ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం మంజునాథ్ ఫిబ్రవరి 3వ తేదీన కుణిగల్ పట్టణంలో స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మళ్లీ సీనప్పనహళ్ళి గ్రామంలోని సొంత ఇంటికి వచ్చి నిద్రపోయాడు.
అర్ధరాత్రి బయటకు పిలిచి హత్య..
అతనికి అర్ధరాత్రి ఫోన్ రావడంతో మాట్లాడుతూ బయటికి వెళ్లిపోయాడు. ఆపై మళ్లీ ఇంటికి రాలేదు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిత్న మంగళ చెరువులో మంజునాథ్ శవమై తేలాడు. దీంతో మంజునాథ్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి భార్య హర్షితను అరెస్టు చేశారు. ఆమె చెప్పిన వివరాలతో మిగతా ఇద్దరిని పట్టుకున్నారు.
భార్యే ఈ హత్య చేయించిందని గ్రామస్తులు కూడా ఆరోపించారు. రఘు, రవికిరణ్‌లు మంజునాథ్‌కు ఫోన్ చేయించి చెరువు వద్దకు పిలిపించారు. అక్కడ అతన్ని హత్య చేసి చెరువులో పడేసి వెళ్లినట్లు ఒప్పుకున్నారు. కేసు విచారణలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment