డూడూ బసవన్నలు అనుకుంటున్నారా..!
గ‘లీజు’ నిర్ణయాలు మంచిది కాదు
అంతా మీరే చేస్తే మేం ఎందుకు?
కార్పొరేషన్ అధికారులకు మేయర్ క్లాస్
వాడీవేడిగా స్టాండింగ్ కమిటీ సమావేశం
విజయవాడ సెంట్రల్ : ‘ప్రజాప్రతినిధులను డూడూ బసవన్నలు చేయొద్దు. నిర్ణయాలన్నీ మీరే తీసుకుంటే మేం ఎందుకు? లీజుల విషయంలో కమిషనర్‌ను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరేం చేద్దామనుకుంటున్నారో మాతో చెప్పండి. చర్చిద్దాం..’ అంటూ మేయర్ కోనేరు శ్రీధర్ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సమావేశం శనివారం స్టాండింగ్ కమిటీ హాల్‌లో మేయర్ అధ్యక్షతన జరిగింది. నగరంలోని కల్యాణ మండపాలు, పార్కింగ్ లీజులపై వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాజధాని నేపథ్యంలో ప్రయివేటు షాపుల అద్దెలు అనూహ్యంగా పెరుగుతున్నాయని, కార్పొరేషన్ ఆస్తులకు సంబంధించి మాత్రం 33.5 శాతం మొక్కుబడిగా పెంచి చేతులు దులుపుకోవడం సరైన విధానం కాదన్నారు. ఓపెన్ టెండర్ పిలిస్తే ఎంత మొత్తం వస్తుందో తేలుతోందని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ పార్కు వద్ద పార్కింగ్ స్థలం లీజును ఏడాదికి రూ.4.10 లక్షలకు ఇవ్వడంపై మేయర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. లీజుల్ని ఇష్టారాజ్యంగా ఖరారు చేయడం సరికాదని ఎస్టేట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదుగురితో కమిటీ
షాపుల లీజులకు సంబంధించి మార్కెట్ వాల్యూ ఎంత ఉందో తెలుసుకునేందుకు చీఫ్ ఇంజినీర్, సిటీప్లానర్‌తో పాటు మరో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటుచేయాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీ ధరను సూచించిన తరువాతే టెండర్లు పిలిచి రింగ్ కాకుండా పారదర్శకంగా నిర్వహించాలని సభ్యులు సూచించారు. లీజు పూర్తయ్యే నెలరోజుల ముందు ఆ విషయాన్ని స్టాండింగ్ కమిటీ దృష్టికి తేవాల్సిందిగా మేయర్ ఆదేశించారు. గడువు పూర్తయ్యాక హడావుడిగా టెండర్లు పిలిచి లీజులు కేటాయిస్తున్నారని, అంతా అయ్యాక స్టాండింగ్ కమిటీకి పెట్టి ఏం ప్రయోజనమని నిలదీశారు. దీంతో అధికారులు అవాక్కయ్యారు.
కాంట్రాక్ట్ మూడు నెలలే..
నగరపాలక సంస్థలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్లు, వెహికిల్ డిపోలో పనిచేస్తున్న మెకానిక్‌లు, హెల్పర్ల కాంట్రాక్ట్ కాలపరిమితిని మూడు నెలలు పాటు మాత్రమే పెంచేందుకు స్థాయీ సంఘం ఆమోదించింది. ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థుల్ని అప్రంటీస్ విధానంలో నియమించాలని నిర్ణయించింది. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు సీనియర్లు కావడంతో జీతాలు చాలడం లేదని ఆందోళనలు చేస్తున్నారని, కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జీతాలు పెంచే అవకాశం లేదు కాబట్టి విద్యార్థుల్ని అప్రంటీస్ పద్ధతిపై నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్‌తో మాట్లాడే బాధ్యతను కమిషనర్, సీఈలకు అప్పగించారు. డ్రెయినేజీ, వాటర్ వర్క్స్‌లో కాంట్రాక్ట్ కార్మికుల్ని యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు.