చౌడమ్మ
మడకశిర రూరల్: విద్యుత్ శాఖ లీలలు నిరుపేదలను గుల్ల చేస్తున్నాయి. వేలకు వేలు బిల్లుల భారం మోపుతూ.. ముక్కుపిండి మరీ వసూలు చేస్తుండడంతో విద్యుత్ వినియోగదారులు అప్పుల పాలవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మడకశిరలోని నాల్గో వార్డులో నివాసముంటున్న వృద్ధురాలు చౌడమ్మకు గత నెలకు సంబంధించి రూ.40,649 మేర విద్యుత్ వినియోగం చేశారని, బిల్లు చెల్లించాలంటూ రసీదును ఆ శాఖ సిబ్బంది అందజేశారు. రెండు గదుల రేకుల షెడ్‌లో నివాసముంటున్న తనకు గతంలో రూ. వంద నుంచి రూ. 200 లోపు బిల్లు వచ్చేదని వృద్ధురాలు తెలిపారు.
ప్రతి నెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నా.. మార్చి నెల వరకు పూర్తిగా బిల్ల చెల్లించారని, ఆ తర్వాత నెలలకు సంబంధించి బకాయిలు ఉన్నట్లు తాజాగా ఇచ్చిన బిల్లులు పేర్కొనడం విడ్డూరంగా ఉందని బాధితురాలు వాపోతున్నారు. సెప్టెంబర్ నెలలో విద్యుత్ వినియోగానికి సంబంధించిన రూ. 700 బిల్లును అక్టోబర్‌లో చెల్లించినట్లు వివరించారు. తన ఇద్దరు కుమారులు కూలీ పనుల ద్వారా సంపాదించుకుని వస్తున్న కొద్దొగొప్ప పైకంతో కుటుంబ గడుస్తోందని, ప్రస్తుతం విద్యుత్ బిల్లు చెల్లించాలంటే ఉన్న ఇంటిని అమ్ముకోవాల్సి వస్తుందంటూ కన్నీటి పర్యాంతమయ్యారు.
న్యాయం చేస్తాం: నిరుపేద చౌడమ్మకు రూ.40,649 మేర విద్యుత్ బిల్లు చెల్లించాలంటూ మంజూరు చేసిన బిల్లుపై స్థానిక ఎస్పీడీసీఎల్ ఏఈ చెన్నకృష్ణను సాక్షి వివరణ కోరింది. దీనిపై ఆయన స్పందిస్తూ పొరబాటు ఎక్కడ జరిగిందనే విషయంపై విచారణ చేపడతామని అన్నారు. ఈ విషయంగా బాధితురాలికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment