వణికిస్తున్న పై-లీన్ | On - Lean hurricane threat to the farmer, shaking propagated back | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న పై-లీన్

Published Sat, Oct 12 2013 3:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM

On - Lean hurricane threat to the farmer, shaking propagated back

సాక్షి, మచిలీపట్నం/ న్యూస్‌లైన్, మచిలీపట్నం : పై-లీన్ తుపాను ముప్పు రైతు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తుపాను తీవ్రత ఉధృతమైందని వస్తున్న వార్తలతో జిల్లాలో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాకు భారీ వర్ష సూచన ఉందని తెలియడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని బెంగటిల్లుతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన 40 బోట్లలో 16 వెనక్కిరాగా మరో 24 ఇంకా రావాల్సి ఉంది. మచిలీపట్నం, నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో ప్రత్యేకాధికారులు పర్యటించారు. రెవెన్యూ, పంచాయతీ సిబ్బందితో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి భారీ వర్షాలు తుపాను ప్రభావంతో పల్లపుప్రాంతాలకు నీరు చేరితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాల ఏర్పాటు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తాగునీటి వసతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
 
పావని మృతదేహం లభ్యం...


వెలగలేరు వద్ద కుంపిణీ వాగులో గురువారం గల్లంతైన ఎన్.పావని (14) మృతదేహం శనివారం లభ్యమైంది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వాగుల్లో కొట్టుకుపోయి మృతిచెందిన వారి సంఖ్య దీంతో మూడుకు చేరింది.

మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ...

 పై-లీన్ ప్రభావంతో తీరప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారి హోరెత్తుతోంది. దాదాపు ఆరడుగుల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. గిలకలదిండి హార్బర్ వద్ద మూడో నంబరు ప్రమాద హెచ్చరిక  ఎగురవేశారు. దీంతో మంగినపూడి బీచ్‌లోకి పర్యాటకులను శుక్రవారం కూడా అనుమతించలేదు. సముద్రంలో చేపలవేట కొనసాగిస్తున్న వారితో సంప్రదింపులు జరిపామని, వారు వెంటనే వెనుదిరిగి వచ్చేయాలని సూచనలు చేశామని డీడీ చెప్పారు. సముద్రంలో ఉండిపోయిన 24 బోట్లు శనివారం ఉదయం సముద్రపు పోటు అధికంగా ఉన్న సమయంలో హార్బర్‌కు చేరే అవకాశం ఉంది.
 
పొంగి ప్రవహిస్తున్న వాగులు..

తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో పశ్చిమకృష్ణాలోని కొండవాగు, బుడమేరు, పోతులవాగు, కుంపిణీ వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. శుక్రవారం జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతం 8.6 మిల్లీమీటర్లుగా నమోదు కాగా, అత్యధికంగా రెడ్డిగూడెంలో 48.3, అత్యల్పంగా నాగాయలంకలో 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం సాయంత్రం కృత్తివెన్ను తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
 
ఈనిక, పొట్ట దశలో వరిపైరు...

జిల్లాలో ప్రస్తుత సార్వా సీజన్‌లో 6 లక్షల 42 వేల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ఇప్పటికే విత్తన రకాలు ఈనిక పూర్తి చేసుకుని గింజలు పాలు పోసుకుంటున్నాయి. మరికొద్దిరోజుల్లో అవి కోతకు రానున్నాయి. వాటితోపాటు జిల్లాలో దాదాపు 60 శాతం ముందు నాట్లు వేసిన వరి పైరు ప్రస్తుతం పొట్ట, ఈనిక దశల్లో ఉంది. 40 శాతం నాట్లు ఆలస్యమైన దివిసీమలోని అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి, మోపిదేవి, కోడూరు, ఘంటసాల మండలాలతో పాటు గూడూరు, బందరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, కలిదిండి మండలాల్లో పైరు నిలదొక్కుకునే దశలో ఉంది. ఇటువంటి సమయంలో ఒకటి రెండు రోజులు వర్షం పడితే వరిపైరుకు ఫర్వాలేదని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ బాలునాయక్ తెలిపారు.

ఈదురు గాలులతో భారీ వర్షాలు పడితే వరిపైరు నేలవాలిపోయి నీటిలో మునిగిపోతే మొవ్వులోకి నీరు వెళ్లి పైరు కుళ్లిపోయే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. పత్తి పంటకు తుపాన్‌తో భారీ వర్షాలు వస్తే ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. జిల్లాలో లక్షా 35 వేల ఎకరాల్లో సాగు జరుగుతున్న పత్తి ప్రస్తుతం పూత, కాయ దశలో ఉంది. భారీ వర్షాలు కొనసాగితే పత్తికాయలకు బూజు తెగులు వచ్చి దూదిపింజలు పగలకుండా కుళ్లిపోతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పూత, పిందె దశలో ఉన్న వేరుశెనగతో పాటు మొక్కజొన్న, మిర్చికి పెద్ద నష్టం ఉండదని పేర్కొంటున్నారు.
 
ఆక్వాకు ఇబ్బందులే...

జిల్లాలో సుమారు లక్షా 10 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. తుపాను ప్రభావంతో వచ్చే ఈదురుగాలులు, వర్షాలతో రొయ్యలు, చేపల చెరువుల్లో ఆక్సిజన్ లోపం తలెత్తే ప్రమాదముందని ఆక్వా రైతులు చెబుతున్నారు. ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమంతో రవాణా నిలిచిపోవడంతో పట్టుబడికి వచ్చిన రొయ్యలు, చేపలను సైతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయలేక చెరువుల్లోనే ఉంచడంతో మేత పెట్టుబడులు తడిసిమోపెడవుతున్నాయంటూ ఆక్వా రైతులు వాపోతున్నారు.

తుపాన్ తీవ్రత పెరిగితే జరిగే నష్టంతో కోలుకోలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2011లో థానే, 2012లో నీలం తుపానులతో నష్టపోయిన జిల్లా రైతులకు నేటికీ పరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత తుపానుతో నష్టం జరిగితే ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం లేదని రైతులు పేర్కొంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement