=నివేదిక సిద్ధం చేసిన ఎన్‌హెచ్‌ఏఐ
=పస్తుతం మరమ్మతులకే పరిమితం
=ఢిల్లీకి ప్రతిపాదనలు పంపిన అధికారులు
సాక్షి, విశాఖపట్నం : పై-లీన్ తుపాను రోడ్లనూ ధ్వంసం చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని జాతీయ రహదారులతో పాటు ఒడిశా సరిహద్దులోని రోడ్లకూ నష్టం వాటిల్లింది. వంతెనలు పాడయ్యాయి. రోడ్లకు గండ్లు పడ్డాయి. రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఆయా జిల్లాల అధికారుల ప్రాథమిక నివేదికలతో పాటు, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (నేషనల్ హైవేస్ అధారిటీస్ ఆఫ్ ఇండియా) అధికారుల బృందం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవల పర్యటించింది.
భారీగా రోడ్లు మరమ్మతులకు గురికావడాన్ని గుర్తించింది. ఢిల్లీ, హైదరాబాద్ అధికారులతో పాటు విశాఖలోని ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది రోడ్లను సందర్శించి వాటిల్లిన నష్టంతో పాటు తక్షణం చేయాల్సిన మరమ్మతుల విషయమై సమీక్షించారు. ఆంధ్రా-ఒడిశా ప్రాంతాల్ని కలిపే సరిహద్దులోని జాతీయ రహదారులు ధ్వంసం కావడంతో కనీసం రూ.15కోట్లయినా నష్టం వాటిల్లిందని గుర్తించారు.
ఈ నష్టాన్ని ఇప్పట్లో పూడ్చే అవకాశం లేకపోవడంతో భవిష్యత్తులో ఇతర ప్రాజెక్టుల మంజూరీ సమయంలో భర్తీ చేసుకునేలా నిర్ణయించారు. ఇదే విషయమై ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపించామని ఓ అధికారి తెలిపారు. ఒక్క ఇచ్చాపురం పరిధిలోనే సుమారు 60 కిలోమీటర్ల మేర మరమ్మతులు జరపాలని తేల్చారు. రోడ్ కనెక్టివిటీతో పాటు గుంతలు పూడ్చడం, రైలింగ్ పనులు తక్షణమే చేపట్టాలని ప్రభుత్వం సూచించిన మీదట జిల్లా యంత్రాంగం సహకారంతో పనులు చేపట్టాలని తేల్చారు.
వాస్తవానికి తుపాను తీరం దాటిన వెంటనే నష్టాన్ని అంచనా వేసినా, రోడ్లపై చెట్లు పడిపోవడం, కొన్నిచోట్ల నీరుండిపోవడం కారణంగా అంచనా ఆలస్యమైనట్టు అధికారులు చెబుతున్నారు. భారీ పనులకు నిధుల లేమి వెంటాడుతుండడంతో కనీసం నెల రోజుల వ్యవధిలో మరమ్మతులకు ముందుకు వచ్చారు. ఈ విషయంలో ఇప్పటికే తమ వద్ద ఉన్న నిధులు, యంత్ర పరికరాలతో పనులకు సిద్ధం కావాలని అధికారులు ఆదేశించారు.