ఇక్కడే పేచీ!
♦ ముందు జరగాల్సింది మండలాల విభజన
♦ జంట జిల్లాల విభజనకు ఉమ్మడి మండలాల పంచాయతీ
♦ మండలాలను విభజిస్తే తప్ప జిల్లాల డీలిమిటేషన్ అసాధ్యం
♦ ప్రభుత్వానికి నివేదిక పంపిన జిల్లా యంత్రాంగం
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉమ్మడి మండలాలతో పేచీ వచ్చింది. దసరా నుంచి నూతన జిల్లాలు కార్యరూపంలోకి వచ్చే విధంగా ప్రభుత్వం
కసరత్తు చేస్తుండగా.. రంగారెడ్డి, హైదరాబాద్ లో మాత్రం వేర్వేరు నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే మండలాలను విభజించడం కత్తిమీద సాములా మారింది.
♦ రంగారెడ్డిలోని 18, హైదరాబాద్‌లోని 16 మండలాలను పునర్‌వ్యవస్థీకరించడం ద్వారా మాత్రమే ఈ రెండు జిల్లాల్లో కొత్త జిల్లాల విభజనకు అవకాశం ఏర్పడనుంది.
♦ ఉదాహరణకు బాలనగర్ మండలాన్నే తీసుకుంటే.. దీనిలోని ప్రాంతాలు సనత్ నగర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలోకి వస్తున్నాయి.
ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సగభాగం ఉన్న మండలాలు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాను యూనిట్‌గా చేసుకొని నియోజకవర్గాలతో కొత్త జిల్లాలను ప్రతిపాదించాలని జిల్లా యంత్రాంగం తొలుత భావించింది. అయితే, నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేసే ముందు.. ఒకే మండలం రెండేసీ, మూడేసీ సెగ్మెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ప్రతిపాదనలపై పునరాలోచనలో పడింది. వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే కొత్త జిల్లాలో దాదాపుగా గ్రామీణ నియోజకవర్గాల కే చోటు కల్పిస్తుండడంతో ఇక్కడ ఎలాంటి సమస్య లేదు.
అదే రాష్ట్ర రాజధానితో అనుసంధానమైన ప్రాంతాల్లో మాత్రం ఉమ్మడి మండలాల రూపేణా కొత్త చిక్కొచ్చి పడింది. ఈ క్రమంలో రంగారెడ్డి తూర్పు, ఉత్తర భాగాలను రెండు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై ఉన్నతస్థాయిలో చర్చించిన జిల్లా యంత్రాంగం.. ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా వీటి విభజనపై ముందడుగు వేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ముందుగా మండలాలను విభజిస్తే తప్ప జిల్లాల డీలిమిటేషన్ ప్రక్రియ ముందుకు సాగదనే అభిప్రాయానికొచ్చింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇచ్చే గైడ్‌లైన్స్ ప్రాతిపదికన కసరత్తు మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
నాలుగైదు సెగ్మెంట్లతో పంచాయతీ
వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లను కొత్తగా ఏర్పాటుచేసే జిల్లాల్లో విలీనం చేసేందుకు ఎలాంటి అడ్డంకుల్లేవు. అంటే ఈ నియోజకవర్గాల పరిధిలోని మండలాలకు మరో సెగ్మెంట్‌తో లింకు లేదన్నమాట. దీంతో ఈ నియోజకవర్గాలను కలుపుతూ నయా జిల్లాలను ప్రతిపాదించడానికి ఎలాంటి సరిహద్దు వివాదం లేదు. ఇక వేర్వేరు నియోజకవర్గాల్లో కొనసాగుతున్న మండలాలతో కలిపి జిల్లాలను ఏర్పాటు చేయడమే సమస్యగా మారింది. అందులో ప్రధానంగా బాలానగర్ రెవెన్యూ మండలం. ఈ మండల పరిధిలో సనత్ నగర్, జూబ్లీహిల్స్(హైదరాబాద్ జిల్లా), శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాలు వస్తాయి. ఈ మేరకు వేర్వేరు నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే మండలాల జాబితాను జిల్లా యంత్రాంగం రూపొందించింది. తద్వారా రంగారెడ్డిలోని 18, హైదరాబాద్‌లోని 16 మండలాలను పునర్వ్యస్థీకరించడం ద్వారా మాత్రమే ఈ రెండు జిల్లాల్లో కొత్త జిల్లాల విభజనకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వానికి నివేదించింది.