District farmers
-
అంతా కరువే
జిల్లా రైతాంగాన్ని ఖరీఫ్ ముంచేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాత కుదేలయ్యాడు. ఎక్కడ చూసినా కరువుఛాయలే కన్పిస్తున్నాయి. భూగర్భజలాలు సైతం అడుగంటడంతో తాగునీటికీ కష్టకాలమొచ్చింది. అడపాదడపా కురిసిన వర్షాలు పంటలను గట్టెక్కించలేకపోయాయి. సీజన్ మొత్తంలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 781 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సిఉండగా.. సీజన్ చివరినాటికి కేవలం 554.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో సాధారణం కంటే 29శాతం లోటు నమోదైంది. ఈ నేపథ్యంలో యంత్రాంగం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలంటూ నివేదికలు రూపొందించింది. ఈ నివేదికల్ని గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. జిల్లాలోని 37 మండలాలనూ కరువు పీడిత ప్రాంతాలుగా అందులో ప్రస్తావించింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా * 29 శాతం లోటు వర్షపాతం, పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం * కరువు నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన జిల్లా యంత్రాంగం * ఖరీఫ్‌లో మిగిలింది అప్పులే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 37 మండలాలున్నాయి. ఇందులో నాలుగు మండలాలు పూర్తిగా పట్టణ ప్రాంతాలు కాగా.. మిగతా 33 గ్రామీణ మండలాలు. తాజాగా జిల్లా యంత్రాంగం రూపొందించిన కరువు నివేదికల్లో అన్ని మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా పేర్కొంది. పట్టణ మండలాల్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. దీంతో కరువు మండలాలుగా గుర్తించారు. 33 గ్రామీణ మండలాల్లో 27 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. సీజన్ చివరలో అధిక వర్షాలు కురిసి వర్షపాతం నమోదైనప్పటికీ.. వాటి మధ్య అంతరం హెచ్చుగా ఉందని అధికారులు తేల్చారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 1.84లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను సీజన్ ముగిసే నాటికి 1.62లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చాయి. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా వేలాది హెక్టార్లలో విత్తనాలు మొలకెత్తలేదు. కొన్నిచోట్ల వర్షాభావ పరిస్థితులను పంట తట్టుకున్నప్పటికీ దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ క్రమంలో సీజన్ ముగిసిన అనంతరం చేసిన సర్వేలో పంటల దిగుబడి భారీగా తగ్గినట్లు అధికారులు తేల్చారు. మొత్తంగా అన్నివిధాలా నష్టం జరగడంతో జిల్లాలోని 37 మండలాలను కరువు మండలాలుగా పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. నాలుగు అంశాలే ప్రామాణికం.. కరువు నివేదికలపై యంత్రాంగం నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుని నిర్ధారించింది. వర్షపాతం, వర్షాల మధ్య అంతరం, సాగు విస్తీర్ణం, దిగుబడి అంశాల ఆధారంగా కరువును ఖరారు చేసింది. జిల్లాలో కొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ.. వర్షాల మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో అన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా సాగు విస్తీర్ణం, దిగుమతుల అంశాల్లోనూ ఆశాజనక పరిస్థితులు లేక పోవడంతో ఆమేరకు అన్ని మండలాలు కరువు నివేదికల్లోకి ఎక్కాయి. లబ్ధి ఇలా.. జిల్లా యంత్రాంగం సమర్పించిన నివేదికల్ని ప్రభుత్వం ఆమోదిస్తే రైతులకు పెట్టుబడి రాయితీ అందుతుంది. అదేవిధంగా పంటరుణాలు రీషెడ్యూల్ చేసే వెసులుబాటు వస్తుంది. అదేవి దంగా తాగునీటి సరఫరా మొరుగుపర్చేందుకు ప్రత్యేక నిధులు అందుతా యి. ఇవేకాకుండా కరువు ప్రభావంతో కలిగిన నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. -
కరుణించిన వరుణుడు
శ్రీకాకుళం అగ్రికల్చర్: జిల్లా రైతులపై వరుణుడు కరుణించాడు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కర్షకులు కుసీగా ఉన్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో 730.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో రైతుల్లో ఖరీఫ్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. సీజన్ ప్రారంభమై..వరినారు పోసుకున్న తరువాత వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. నీటి వసతి కలిగిన చోట్ల ఆయిల్ ఇంజన్లతో నారు మడులకు నీరు పెట్టి కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. నీటి వసతి లేని చోట్ల రైతులు ఆకాశం వైపు ఆర్రులు చాసి చూశారు. గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షాలతో ఖరీఫ్ రైతులకు ఊపిరి.. వరి నారుకు జీవం వచ్చింది. అలాగే మెట్టు పంటలైన సజ్జ, మొక్కజొన్న, వేరుశనగ, గోగు, గంటి తదితర పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేయనుంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో వరి విత్తనాలు, వెదలు చల్లిన రైతుల్లో మాత్రం ఆందోళన చెందుతున్నారు. కురుస్తున్న వర్షాలతో పొలాల్లో నీరు నిల్వ ఉండిపోతే విత్తనాలు పాడయ్యే అవకాశం ఉందంటున్నారు. శుక్రవారం జిల్లా మొత్తంగా 730.0 మిల్లీ మీటర్లు, జిల్లా సరాసరిగా 30.2 మి.మీ. నమోదైంది. అత్యధికంగా కవిటి మండలంలో 72.4 మి.మీ, పలాసలో 56.6, ఇచ్ఛాపురంలో 55.4, కంచిలిలో 35.0 మిల్లీమీటర్లు నమోదయింది. అత్యల్పంగా జలుమూరులో 2.2 మి.మీ., శ్రీకాకుళంలో 5.4, ఎల్.ఎన్.పేట మండలంలో 5.6, రణస్థలంలో 6.0 మీల్లీమీటర్లు నమోదయింది. చెరువులు, కుంటల్లో కూడా నీరు చేరింది. వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో... వీరఘట్టం 19.6, వంగర 11.2, రేగిడి ఆమదాలవలస 15.2, రాజాం 12.8, జి. సిగడాం 8.8, లావేరు 11.2, రణస్థలం 6.0, ఎచ్చెర్ల 8.8, పొందూరు 10.2, సంతకవిటి 10.2, బూర్జ 8.4, పాలకొండ 16.0, సీతంపేట 9.2, భామిని 23.2, కొత్తూరు 24.4, హిరమండలం 27.6, సరుబుజ్జిలి 12.8, ఆమదాలవలస 13.8, శ్రీకాకుళం 5.4, గార 9.4, పోలాకి 12.8, నరసన్నపేట 18.2, జలుమూరు2.2, సారవకోట 23.4, పాతపట్నం 29.6, మెళియాపుట్టి 17.2, టెక్కలి 16.2, కోటబొమ్మాళి 18.8, సంతబొమ్మాళి 25.4, నంది గాం 17.8, వజ్రపుకొత్తూరు 12.4, పలాస 56.6, మందస 18.2, సోంపేట 32.2, కంచి లి 35.0, కవిటి 72.4, ఇచ్ఛాపురం 55.4, ఎల్.ఎన్.పేట 5.6 మి.మీ. నమోదైంది. -
వణికిస్తున్న పై-లీన్
సాక్షి, మచిలీపట్నం/ న్యూస్‌లైన్, మచిలీపట్నం : పై-లీన్ తుపాను ముప్పు రైతు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తుపాను తీవ్రత ఉధృతమైందని వస్తున్న వార్తలతో జిల్లాలో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాకు భారీ వర్ష సూచన ఉందని తెలియడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని బెంగటిల్లుతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన 40 బోట్లలో 16 వెనక్కిరాగా మరో 24 ఇంకా రావాల్సి ఉంది. మచిలీపట్నం, నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో ప్రత్యేకాధికారులు పర్యటించారు. రెవెన్యూ, పంచాయతీ సిబ్బందితో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి భారీ వర్షాలు తుపాను ప్రభావంతో పల్లపుప్రాంతాలకు నీరు చేరితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాల ఏర్పాటు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తాగునీటి వసతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పావని మృతదేహం లభ్యం... వెలగలేరు వద్ద కుంపిణీ వాగులో గురువారం గల్లంతైన ఎన్.పావని (14) మృతదేహం శనివారం లభ్యమైంది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వాగుల్లో కొట్టుకుపోయి మృతిచెందిన వారి సంఖ్య దీంతో మూడుకు చేరింది. మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ... పై-లీన్ ప్రభావంతో తీరప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారి హోరెత్తుతోంది. దాదాపు ఆరడుగుల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. గిలకలదిండి హార్బర్ వద్ద మూడో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. దీంతో మంగినపూడి బీచ్‌లోకి పర్యాటకులను శుక్రవారం కూడా అనుమతించలేదు. సముద్రంలో చేపలవేట కొనసాగిస్తున్న వారితో సంప్రదింపులు జరిపామని, వారు వెంటనే వెనుదిరిగి వచ్చేయాలని సూచనలు చేశామని డీడీ చెప్పారు. సముద్రంలో ఉండిపోయిన 24 బోట్లు శనివారం ఉదయం సముద్రపు పోటు అధికంగా ఉన్న సమయంలో హార్బర్‌కు చేరే అవకాశం ఉంది. పొంగి ప్రవహిస్తున్న వాగులు.. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో పశ్చిమకృష్ణాలోని కొండవాగు, బుడమేరు, పోతులవాగు, కుంపిణీ వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. శుక్రవారం జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతం 8.6 మిల్లీమీటర్లుగా నమోదు కాగా, అత్యధికంగా రెడ్డిగూడెంలో 48.3, అత్యల్పంగా నాగాయలంకలో 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం సాయంత్రం కృత్తివెన్ను తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈనిక, పొట్ట దశలో వరిపైరు... జిల్లాలో ప్రస్తుత సార్వా సీజన్లో 6 లక్షల 42 వేల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ఇప్పటికే విత్తన రకాలు ఈనిక పూర్తి చేసుకుని గింజలు పాలు పోసుకుంటున్నాయి. మరికొద్దిరోజుల్లో అవి కోతకు రానున్నాయి. వాటితోపాటు జిల్లాలో దాదాపు 60 శాతం ముందు నాట్లు వేసిన వరి పైరు ప్రస్తుతం పొట్ట, ఈనిక దశల్లో ఉంది. 40 శాతం నాట్లు ఆలస్యమైన దివిసీమలోని అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి, మోపిదేవి, కోడూరు, ఘంటసాల మండలాలతో పాటు గూడూరు, బందరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, కలిదిండి మండలాల్లో పైరు నిలదొక్కుకునే దశలో ఉంది. ఇటువంటి సమయంలో ఒకటి రెండు రోజులు వర్షం పడితే వరిపైరుకు ఫర్వాలేదని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ బాలునాయక్ తెలిపారు. ఈదురు గాలులతో భారీ వర్షాలు పడితే వరిపైరు నేలవాలిపోయి నీటిలో మునిగిపోతే మొవ్వులోకి నీరు వెళ్లి పైరు కుళ్లిపోయే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. పత్తి పంటకు తుపాన్‌తో భారీ వర్షాలు వస్తే ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. జిల్లాలో లక్షా 35 వేల ఎకరాల్లో సాగు జరుగుతున్న పత్తి ప్రస్తుతం పూత, కాయ దశలో ఉంది. భారీ వర్షాలు కొనసాగితే పత్తికాయలకు బూజు తెగులు వచ్చి దూదిపింజలు పగలకుండా కుళ్లిపోతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పూత, పిందె దశలో ఉన్న వేరుశెనగతో పాటు మొక్కజొన్న, మిర్చికి పెద్ద నష్టం ఉండదని పేర్కొంటున్నారు. ఆక్వాకు ఇబ్బందులే... జిల్లాలో సుమారు లక్షా 10 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. తుపాను ప్రభావంతో వచ్చే ఈదురుగాలులు, వర్షాలతో రొయ్యలు, చేపల చెరువుల్లో ఆక్సిజన్ లోపం తలెత్తే ప్రమాదముందని ఆక్వా రైతులు చెబుతున్నారు. ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమంతో రవాణా నిలిచిపోవడంతో పట్టుబడికి వచ్చిన రొయ్యలు, చేపలను సైతం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయలేక చెరువుల్లోనే ఉంచడంతో మేత పెట్టుబడులు తడిసిమోపెడవుతున్నాయంటూ ఆక్వా రైతులు వాపోతున్నారు. తుపాన్ తీవ్రత పెరిగితే జరిగే నష్టంతో కోలుకోలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2011లో థానే, 2012లో నీలం తుపానులతో నష్టపోయిన జిల్లా రైతులకు నేటికీ పరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత తుపానుతో నష్టం జరిగితే ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం లేదని రైతులు పేర్కొంటున్నారు.