![only one caste living in kollivalasa village - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/2/caste.jpg.webp?itok=MYnpczQG)
కొల్లివలస గ్రామం,41మంది సభ్యులతో సంక్రాంతి వేడుకలు జరుపుకొన్న వెంకయ్య కుటుంబం (పాతచిత్రం)
బొబ్బిలి రూరల్: ఏ గ్రామంలోనైనా వ్యాపారులు, వడ్రంగులు, రజకులు, క్షురకులు, బ్రాహ్మణులు తదితర కులాల ప్రజలు నివసిస్తుంటారు. కానీ ఒకే కులస్తులున్న గ్రామంగా బొబ్బిలి మండలం పిరిడి పంచాయతీ కొల్లివలస పేరొందింది. ఈ గ్రామంలో అందరూ శ్రీ శయన (సెగిడీలు) కులస్తులే. బొబ్బిలికి 8 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామానికి పిరిడి వరకు బస్సులో వెళ్లి 2కిలోమీటర్ల దూరం నడిస్తే చేరుకోవచ్చు. గ్రామంలో 47 కుటుంబాలు, 161మంది జనాభా నివసిస్తోంది.
వీరితో పాటు ఇతర ప్రాంతాల్లో వీరి బంధువులు దాదాపు 37మంది వరకు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా పండగల సమయంలో కుటుంబాలతో సహా వస్తుంటారు. గ్రామంలో అనేక మంది వ్యవసాయం, ఉపాధి, ఇతర పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. వీరికి ఏ వస్తువులు కావలసి వచ్చినా పిరిడి గ్రామానికి వెళ్లి తెచ్చుకుంటారు. రజకులు, నాయీ బ్రాహ్మణులు పిరిడి నుంచి వస్తుంటారు.
భోగి జరుపుకోని గ్రామం
వీరు భోగి పండగ నిర్వహించరు. పూర్వం గ్రామంలో భోగి రోజు ఒకాయన మరణించడంతో ఆ పండగను జరుపుకోవడం మానేశారు. సంక్రాంతి పండగను మాత్రం కుటుంబాలతో కలిసి నిర్వహిస్తారు. మొత్తం 40, 50మంది కలిసి పండగలను జరుపుతారు. ఇలా కోలా వెంకయ్య కుటుంబానికి చెందిన 41 మంది సభ్యులు గత ఏడాది సంక్రాంతి జరిపారు.
ఎవరికీ అడ్డు పెట్టలేదు
గ్రామంలో అందరం ఒకే కులస్తులం ఉంటున్నాం. మేం ఎవరినీ రావొద్దని అడ్డుపెట్టలేదు. అయినా ఎవరూ రాలేదు. ఈ గ్రామంలో నివాసం ఉండటం లేదు. – భోగాది సత్యవతి, కొల్లివలస
అభివృద్ధి లేని గ్రామం
మాకు తెలిసినప్పటి నుంచి గ్రామంలో అందరూ శ్రీశయన కులస్తులే ఉంటున్నారు. అందరూ వెనుకబడిన వారే. గ్రామ రహదారి బాగాలేదు. రవాణా సదుపాయం లేదు. ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి – కోల బలరాం, అధ్యక్షుడు, జిల్లా శ్రీ శయన సంఘం
Comments
Please login to add a commentAdd a comment