ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్:
జిల్లాకు ‘పై-లీన్’ ముప్పు తప్పినట్లే. రెండు రోజుల క్రితం తుఫాన్ హెచ్చరికలు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్ర తీర ప్రాంతాల్లోని గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టింది. జిల్లాలోని తీరం వెంబడి ఉన్న 11 మండలాలకు జిల్లా స్థాయి అధికారులను నియమించి ప్రమాద తీవ్రత తగ్గేవరకు అక్కడే ఉంచి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. అంతేగాకుండా ఆయా మండలాల్లో నెలరోజులకు సరిపడే విధంగా బియ్యం, కిరోసిన్‌ను నిల్వ చేసింది. ఒకవేళ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండి రాకపోకలు స్తంభించిన నేపథ్యంలో నిత్యావసర సరుకులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు వీలుగా ముందస్తు చర్యలు తీసుకొంది. అంతేగాకుండా వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
పై-లీన్ తుఫాన్ జిల్లాను తాకితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో వాగులు, వంకలు తెగితే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులను, ఎన్‌జీఓలను సిద్ధం చేసింది. తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకార పెద్దలను కలిసి సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని కోరింది.
తొమ్మిది బోట్ల ఆచూకీకి యత్నాలు
తుఫాన్ హెచ్చరికలు రాకముందు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం నుంచి 50 బోట్లు వేటకు వెళ్లాయి. తుఫాన్ హెచ్చరికలు రావడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సకాలంలో సమాచారం అందించడంతో 41 బోట్లు తిరిగి ఒడ్డుకు చేరుకున్నాయి. మరో తొమ్మిది బోట్లకు సంబంధించిన సమాచారం రాలేదు. వాటిలో 61 మంది మత్స్యకారులున్నారు. వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే పనిలో మత్స్యశాఖ నిమగ్నమైంది. ఇప్పటికే కోస్ట్‌గార్డ్ సిబ్బందికి సమాచారం అందించి వారి వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తోంది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. తమవారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవాలంటూ గంగమ్మతల్లిని వేడుకుంటున్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ అధికారులు కోరడంతో బోట్లన్నీ ఒడ్డుపైనే ఉన్నాయి. గురువారం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవగా, శుక్రవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతం 6.8 మిల్లీమీటర్లుగా నమోదైంది.
భయానకం నుంచి సాధారణం:
పై-లీన్ తుఫాన్ అత్యంత భయానకంగా ఉంటుందని ముందుగానే సంకేతాలు రావడంతో జిల్లాలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గతంలో వచ్చిన తుఫాన్ల కంటే బీభత్సంగా ఉంటుందన్న హెచ్చరికలతో ప్రజలు హడలిపోయారు. జిల్లా అధికార యంత్రాంగంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే శుక్రవారం ఉదయం నాటికి తుఫాన్‌లో మార్పులు కనిపించాయి. సాయంత్రానికి తుఫాన్ తీవ్రత ఉండదని తేలిపోయింది. కళింగపట్నానికి 410 కిలోమీటర్ల దూరంలో పై-లీన్ కేంద్రీకృతమై ఉందని, వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం సాయంత్రానికి ఒరిస్సాలోని గోపాల్‌పూర్ వద్ద తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం తెలియజేయడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
తుఫాన్ ముప్పు తప్పినా అలర్ట్
జిల్లాకు ‘పై-లీన్’ తుఫాన్ ముప్పు తప్పిందని, అయినా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని స్పెషల్ ఆఫీసర్ కరికాల వళవన్ వెల్లడించారు. జిల్లాలో తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఆయన్ను నియమించింది. శుక్రవారం ఒంగోలు వచ్చిన సందర్భంగా ప్రకాశం భవనంలోని కలెక్టర్ చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల గురించి కలెక్టర్‌తో చర్చించినట్లు వివరించారు. గతంలో కూడా జిల్లాలో తుఫాన్‌లు వచ్చాయని, ఆ సమయంలో యంత్రాంగం వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టిందన్నారు.
ప్రస్తుత ‘పై-లీన్’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల వెంబడి ఉన్న గ్రామాలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ప్రతి తీర ప్రాంత మండలానికి ఒక్కో స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. ఉదయం అందిన నివేదికలను బట్టి జిల్లాకు తుఫాన్ ముప్పు తప్పిందని, సాధారణ వర్షాలు కురుస్తాయని కరికాల వళవన్ వెల్లడించారు. అంతకు ముందుగా జిల్లాలో తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యల గురించి కలెక్టర్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్‌లతో ఆయన చర్చించారు. పకడ్బందీగా చర్యలు తీసుకోవడంపై స్పెషల్ ఆఫీసర్ వారిని అభినందించారు.
వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్
‘పై-లీన్’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ విలేకరులకు వెల్లడించారు. యువకులు, ఎన్‌జీఓలు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. వాగులు పొంగితే వాటిని నియంత్రించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లోని 11 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. తీర ప్రాంతాల్లోని పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని కోరినట్లు వెల్లడించారు. తుఫాన్ ముప్పు తప్పినప్పటికీ ఒకవేళ దాని దిశ మార్చుకొని వస్తే ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విజయకుమార్ వివరించారు.
వాడరేవులో మూడో నంబర్
ప్రమాద హెచ్చరిక
చీరాల, న్యూస్‌లైన్: పై-లీన్ తుఫాన్ నేపథ్యంలో చీరాల వాడరేవులో శుక్రవారం మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. ఈదురు గాలులు తీరాన్ని తాకుతున్నందున ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు పోర్టు అధికారి మోపిదేవి వెంకటేశ్వరరావు తెలిపారు. తీరంలో అలలు ఉధృతంగా ఉన్నాయి. సాధారణ రోజుల కంటే రెండు మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తీర ప్రాంత ప్రజలు ఆందోళనలో ఉన్నారు. నియోజకవర్గంలోని వాడరేవు, పచ్చమొగిలి, విజయలక్ష్మీపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, కఠారిపాలెం, రామాపురం ప్రాంతాల్లో మత్స్య కారులు ఒడ్డున ఉన్న బోట్లు, వలలు సురక్షిత ప్రాంతాలకు చేరవేసే పనిలో నిమగ్నమయ్యారు. సముద్రం ఐదు మీటర్ల ముందుకు రావడంతో ఒడ్డుకు ఎవరినీ వెళ్లనీయకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అధికారుల ముందస్తు చర్యలు:
తీర ప్రాంత గ్రామాలపై తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రవాణా సదుపాయాలు, పునరావాస కేంద్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. రెస్క్యూ బోటును, ఐదుగురు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. సర్పంచ్‌లు, రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
‘పై-లీన్’ ముప్పు తప్పినట్లే
Published Sat, Oct 12 2013 3:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement
Advertisement