సాక్షి, నెట్‌వర్క్: తీరం దాటిన పై-లీన్ తుపాను శ్రీకాకుళం జిల్లాలో పెను విలయం సృష్టించింది. పెను గాలులు, భారీ వర్షాలు ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి, జీడిమామడి తోటలకు అపార నష్టం వాటిల్లింది. వేలాది చెట్లు కూకటి వేళ్లతో సహా నేలకూలాయి. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, సంతబొమ్మాళి, గార మండలాల తోపాటు శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ల పరిధిలో ప్రజా జీవనం అతలాకుతలమైంది. జిల్లాలో 11 తీర మండలాల్లోని 237 గ్రామాల నుంచి 61,100 మందిని సహాయ శిబిరాలకు తరలించారు. అక్కడ సరఫరా చేస్తున్న అరకొర ఆహారంతోనే, చలిలో గజగజలాడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. మత్స్యకారులకు చెందిన పడవలు, వలలు, ఇతర సామగ్రి కొట్టుకుపోయాయి.
పలుచోట్ల కచ్చా ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. తీరప్రాంతాలు కోతకు గురయ్యాయి. రవాణా, విద్యుత్, సమాచార వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లా అంతటా అంధకారం అలముకుంది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి కనీసం రెండు రోజులు పడుతుందని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒడిశాలో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా నదులకు వరద ముప్పు పొంచి ఉంది. మరోవైపు పదుల సంఖ్యలో గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావడంతో ఇళ్ల నుంచి కాలు బయటకు పెట్టలేని స్థితిలో ప్రజలు ఉండిపోయారు. రాత్రి కావడం, కరెంటు లేకపోవడంతో ప్రతికూల వాతావరణంలో సహాయ చర్యలు చేపట్టేందుకు సహాయ బృందాలు ఆయా గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే.. పై-లీన్ తుపాను విజయనగరం, విశాఖ జిల్లాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ తుపాను తీరం దాటటానికి ముందు విశాఖనగరం, కోస్టల్‌బెల్ట్‌ప్రాంతం, పెందుర్తి, రాంబిల్లి, పాయకరావుపేట, భీమిలి ప్రాంతాల్లో సముద్రం 20 మీటర్లు ముందుకు రావటంతో ప్రజలు భీతావహులయ్యారు. విశాఖ జిల్లాలో 21,305 మందిని వేర్వేరు ప్రాంతాల్లోని 20 పునరావాస కేంద్రాలకు తరలించారు.
గజగజలాడిన గంజాం...
పై-లీన్ తుపాను ఒడిశాను తీవ్రంగా వణికించింది. ప్రధానంగా గంజాం జిల్లాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. జిల్లాలోని ప్రధాన నగరాలైన బరంపురం, గోపాల్‌పూర్, పురుషోత్తంపూర్ తదితర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. ప్రజలు రోజంతా ఇళ్ల నుంచి బయటకు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్య్సకారులు తమ ఇళ్లు వదిలి రావటానికి నిరాకరించటంతో వారిని తరలించటం కొంత ఇబ్బందిగా మారిందని ఒడిషా సదరన్ రేంజ్ డీఐజీ అమితావ్‌ఠాకూర్ తెలిపారు. తీర ప్రాంతంలోని ప్రతి ఇంటినీ పోలీసులు సోదాచేసి, ప్రతి ఒక్కరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
తుపాను కారణంగా శనివారం ఒడిషాలోని గంజాం జిల్లా గోపాల్‌పూర్‌లో ఐదుగురు చనిపోయారు. భువనేశ్వర్, ఖాళీకోటె, పోల్సారాల్లో పెను గాలులు, భారీ వర్షాలకు చెట్లు కూలి మీద పడటంతో ఒక మహిళ సహా ముగ్గురు చనిపోయారని పోలీసు వర్గాలు తెలిపాయి. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. మహానదికి వరద ముప్పు పొంచి ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షం, గాలుల కారణంగా తీర ప్రాంతంలో రైళ్లు, విమాన సర్వీసులను రద్దు చేశారు. పారాదీప్ పోర్టును మూసివేశారు. ఆ ప్రాంతంలో సముద్రం దాదాపు 25 మీటర్ల ముందుకు వచ్చింది. తీర ప్రాంతంలో 3 నుంచి 5 మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయి.
జిల్లాలకు తప్పిన ముప్పు
పై-లీన్ తుపాను ఒడిశాలో తీరంవైపు తరలి పోవడంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాయుగుండం తుపానుగా మారినప్పటి నుంచి ఉత్కంఠగా గడిపిన తీర ప్రాంత ప్రజలు కాస్త కుదుట పడ్డారు. అయినా ఇప్పటికీ అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు. ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజుల పాటు ప్రజలను గజగజలాడించిన పై-లీన్ తుపాను ప్రభావం విజయనగరం జిల్లాపై అంతంగా లేకపోవడంతో ప్రజలు, అధికారులు కుదుట పడ్డారు. అయినా వచ్చే 24 గంటల పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగానే ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి రిజిత్ కుమార్ సూచించారు. గుంటూరు జిల్లా బాపట్ల, సూర్యలంక ప్రాంతాల్లో శనివారం సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చిందని రెవెన్యూ అధికారులు చెప్పారు. తుపాన్ ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై పెద్దగా చూపించలేదు.