philine
-
పలు రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: పై-లీన్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను శని, ఆదివారాల్లో రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ డివిజన్లలోని 19 రైల్వే స్టేషన్లలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో.. ప్రయాణాలను రద్దు చేసుకొనేందుకు, టిక్కెట్ డబ్బులు తిరిగి చెల్లించేందుకు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం మీదుగా ఒడిశా మార్గంలో కొద్దిరోజులపాటు రైళ్లు నడపడం కుదరదని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఆదివారం రద్దయిన రైళ్లు: బెంగళూరు-భువనేశ్వర్ (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), భునేశ్వర్-బెంగళూరు (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), భువనేశ్వర్-యశ్వంత్‌పూర్, పూరి-ఓకా, పూరి-చెన్నై, భువనేశ్వర్-బెంగళూర్, భువనేశ్వర్-తిరుపతి, భువనేశ్వర్-సికింద్రాబాద్, భువనేశ్వర్-విశాఖ (ఇంటర్సిటీ), విశాఖ-భువనేశ్వర్(ఇంటర్సిటీ), భువనేశ్వర్-జగదల్పూర్(హీరాఖండ్), అహ్మదాబాద్-పూరీ, ముంబై-భువనేశ్వర్, పూరి-తిరుపతి. ప్యాసింజర్ల రద్దు: ఆదివారం విశాఖ-మచిలీపట్నం(57230) ప్యాసింజర్‌ను విశాఖ, రాజమండ్రి మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. పలాస-విశాఖపట్నం-పలాస, పూరి-గుణుపూర్-పూరి, పలాస-గుణుపూర్-పలాస, విజయనగరం-విశాఖపట్నం-విజయనగరం మధ్య అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. విమానాలకూ దెబ్బ: ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు పలు విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. ఎయిర్ ఇండియా, ఇండి గో, జెట్ ఎయిర్వేస్కు చెందిన దాదాపు 10 విమాన సర్వీసులను రద్దు చేశారు. విశాఖ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేశారు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు సికింద్రాబాద్ : 040-27700868 నాంపల్లి : 040-23200865 విజయవాడ :0866-2575038 రాజమండ్రి :0883-2420541, 2420543 కాజీపేట్ : 0870-2548660 వరంగల్ : 0870-2426232 ఖమ్మం : 08742-256025 మంచిర్యాల :08736-250081 తుని : 08854-252172 అనకాపల్లి :08924 -221698 గుంటూరు :0863-2222014,09701379072 నంద్యాల :07702772080 నల్లగొండ :08682-224392,09701379077 నరసరావుపేట: 08647-223131, 09701379075 మార్కాపురం :08596-222028, 09701379079 గిద్దలూరు :08405-242003 సత్తెనపల్లి :08641-232255 పిడుగురాళ్ల :08649-252255 నడికుడి : 08649-257625, 09701379078 -
సురక్షిత ప్రాంతాలకు 5 లక్షల మంది
న్యూఢిల్లీ: తుపాను ప్రభావం ఎక్కువగా పడే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల నుంచి 5.25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర హోం సెక్రటరీ అనిల్ గోస్వామి తెలిపారు. ఒడిశాలో 4.25 లక్షల మందిని, ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మందిని 500 రక్షిత కేంద్రాలకు తరలించినట్లు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలు, ఒడిశా తీరప్రాంతంలో విద్యుత్ నిలిపివేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఒడిశాలో 1500 మెగావాట్లు, ఏపీలో 500 మెగావాట్లు విద్యుత్ వినియోగం తగ్గిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. హైవేలను మరమ్మతు చేయండి పై-లీన్ తుపాను కారణంగా హైవేలు ఎక్కడైనా ధ్వంసమైతే ఆ ప్రాంతంలో వెంటనే మరమ్మతులు చేయడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు కేంద్ర రోడ్లు, హైవేల మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. తుపాను ప్రభావం పడే ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్‌కు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ఒక ప్రకటనలో ఆదేశించింది. దీనికోసం ఒక కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశామని తెలిపింది. -
ఏపీ, ఒడిశాలకు సాయం: ప్రధాని
న్యూఢిల్లీ: పై-లీన్ తుపాను బాధిత ప్రాంతాలకు అన్ని రకాలుగా సాయం కొనసాగించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే శనివారం ఆయన ఏపీ, ఒడిశాల్లో పై-లీన్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధానికి కేబినెట్ కార్యదర్శి వివరించారని ప్రధాని కార్యాలయం ‘ట్విట్టర్’లో పేర్కొంది. హెలికాప్టర్లు, విమానాలు, నౌకలు సిద్ధం: షిండే తుపాను బాధితులను రక్షించేందుకు, తక్షణ సహాయ చర్యల కోసం 18 హెలికాప్టర్లు, 12 విమానాలు, రెండు యుద్ధనౌకలు తూర్పు తీరంలో సిద్ధంగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు. సహాయక చర్యల కోసం 2 వేల మంది సైనికులు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారని తెలిపారు. ఒడిశాలో 5.5 లక్షల మందిని, ఏపీలో లక్ష మందిని 500 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. -
సిక్కోలు కకావికలం..
సాక్షి, నెట్వర్క్: తీరం దాటిన పై-లీన్ తుపాను శ్రీకాకుళం జిల్లాలో పెను విలయం సృష్టించింది. పెను గాలులు, భారీ వర్షాలు ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి, జీడిమామడి తోటలకు అపార నష్టం వాటిల్లింది. వేలాది చెట్లు కూకటి వేళ్లతో సహా నేలకూలాయి. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, సంతబొమ్మాళి, గార మండలాల తోపాటు శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ల పరిధిలో ప్రజా జీవనం అతలాకుతలమైంది. జిల్లాలో 11 తీర మండలాల్లోని 237 గ్రామాల నుంచి 61,100 మందిని సహాయ శిబిరాలకు తరలించారు. అక్కడ సరఫరా చేస్తున్న అరకొర ఆహారంతోనే, చలిలో గజగజలాడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. మత్స్యకారులకు చెందిన పడవలు, వలలు, ఇతర సామగ్రి కొట్టుకుపోయాయి. పలుచోట్ల కచ్చా ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. తీరప్రాంతాలు కోతకు గురయ్యాయి. రవాణా, విద్యుత్, సమాచార వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లా అంతటా అంధకారం అలముకుంది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి కనీసం రెండు రోజులు పడుతుందని ఆ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒడిశాలో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా నదులకు వరద ముప్పు పొంచి ఉంది. మరోవైపు పదుల సంఖ్యలో గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావడంతో ఇళ్ల నుంచి కాలు బయటకు పెట్టలేని స్థితిలో ప్రజలు ఉండిపోయారు. రాత్రి కావడం, కరెంటు లేకపోవడంతో ప్రతికూల వాతావరణంలో సహాయ చర్యలు చేపట్టేందుకు సహాయ బృందాలు ఆయా గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే.. పై-లీన్ తుపాను విజయనగరం, విశాఖ జిల్లాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ తుపాను తీరం దాటటానికి ముందు విశాఖనగరం, కోస్టల్బెల్ట్ప్రాంతం, పెందుర్తి, రాంబిల్లి, పాయకరావుపేట, భీమిలి ప్రాంతాల్లో సముద్రం 20 మీటర్లు ముందుకు రావటంతో ప్రజలు భీతావహులయ్యారు. విశాఖ జిల్లాలో 21,305 మందిని వేర్వేరు ప్రాంతాల్లోని 20 పునరావాస కేంద్రాలకు తరలించారు. గజగజలాడిన గంజాం... పై-లీన్ తుపాను ఒడిశాను తీవ్రంగా వణికించింది. ప్రధానంగా గంజాం జిల్లాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. జిల్లాలోని ప్రధాన నగరాలైన బరంపురం, గోపాల్పూర్, పురుషోత్తంపూర్ తదితర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. ప్రజలు రోజంతా ఇళ్ల నుంచి బయటకు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్య్సకారులు తమ ఇళ్లు వదిలి రావటానికి నిరాకరించటంతో వారిని తరలించటం కొంత ఇబ్బందిగా మారిందని ఒడిషా సదరన్ రేంజ్ డీఐజీ అమితావ్ఠాకూర్ తెలిపారు. తీర ప్రాంతంలోని ప్రతి ఇంటినీ పోలీసులు సోదాచేసి, ప్రతి ఒక్కరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తుపాను కారణంగా శనివారం ఒడిషాలోని గంజాం జిల్లా గోపాల్‌పూర్‌లో ఐదుగురు చనిపోయారు. భువనేశ్వర్, ఖాళీకోటె, పోల్సారాల్లో పెను గాలులు, భారీ వర్షాలకు చెట్లు కూలి మీద పడటంతో ఒక మహిళ సహా ముగ్గురు చనిపోయారని పోలీసు వర్గాలు తెలిపాయి. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. మహానదికి వరద ముప్పు పొంచి ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షం, గాలుల కారణంగా తీర ప్రాంతంలో రైళ్లు, విమాన సర్వీసులను రద్దు చేశారు. పారాదీప్ పోర్టును మూసివేశారు. ఆ ప్రాంతంలో సముద్రం దాదాపు 25 మీటర్ల ముందుకు వచ్చింది. తీర ప్రాంతంలో 3 నుంచి 5 మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయి. జిల్లాలకు తప్పిన ముప్పు పై-లీన్ తుపాను ఒడిశాలో తీరంవైపు తరలి పోవడంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాయుగుండం తుపానుగా మారినప్పటి నుంచి ఉత్కంఠగా గడిపిన తీర ప్రాంత ప్రజలు కాస్త కుదుట పడ్డారు. అయినా ఇప్పటికీ అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు. ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజుల పాటు ప్రజలను గజగజలాడించిన పై-లీన్ తుపాను ప్రభావం విజయనగరం జిల్లాపై అంతంగా లేకపోవడంతో ప్రజలు, అధికారులు కుదుట పడ్డారు. అయినా వచ్చే 24 గంటల పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగానే ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి రిజిత్ కుమార్ సూచించారు. గుంటూరు జిల్లా బాపట్ల, సూర్యలంక ప్రాంతాల్లో శనివారం సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చిందని రెవెన్యూ అధికారులు చెప్పారు. తుపాన్ ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై పెద్దగా చూపించలేదు. -
‘పై-లీన్’ ముప్పు తప్పినట్లే
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు ‘పై-లీన్’ ముప్పు తప్పినట్లే. రెండు రోజుల క్రితం తుఫాన్ హెచ్చరికలు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్ర తీర ప్రాంతాల్లోని గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టింది. జిల్లాలోని తీరం వెంబడి ఉన్న 11 మండలాలకు జిల్లా స్థాయి అధికారులను నియమించి ప్రమాద తీవ్రత తగ్గేవరకు అక్కడే ఉంచి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. అంతేగాకుండా ఆయా మండలాల్లో నెలరోజులకు సరిపడే విధంగా బియ్యం, కిరోసిన్‌ను నిల్వ చేసింది. ఒకవేళ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండి రాకపోకలు స్తంభించిన నేపథ్యంలో నిత్యావసర సరుకులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు వీలుగా ముందస్తు చర్యలు తీసుకొంది. అంతేగాకుండా వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. పై-లీన్ తుఫాన్ జిల్లాను తాకితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో వాగులు, వంకలు తెగితే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులను, ఎన్జీఓలను సిద్ధం చేసింది. తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకార పెద్దలను కలిసి సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని కోరింది. తొమ్మిది బోట్ల ఆచూకీకి యత్నాలు తుఫాన్ హెచ్చరికలు రాకముందు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం నుంచి 50 బోట్లు వేటకు వెళ్లాయి. తుఫాన్ హెచ్చరికలు రావడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సకాలంలో సమాచారం అందించడంతో 41 బోట్లు తిరిగి ఒడ్డుకు చేరుకున్నాయి. మరో తొమ్మిది బోట్లకు సంబంధించిన సమాచారం రాలేదు. వాటిలో 61 మంది మత్స్యకారులున్నారు. వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే పనిలో మత్స్యశాఖ నిమగ్నమైంది. ఇప్పటికే కోస్ట్‌గార్డ్ సిబ్బందికి సమాచారం అందించి వారి వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తోంది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. తమవారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవాలంటూ గంగమ్మతల్లిని వేడుకుంటున్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ అధికారులు కోరడంతో బోట్లన్నీ ఒడ్డుపైనే ఉన్నాయి. గురువారం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవగా, శుక్రవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతం 6.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. భయానకం నుంచి సాధారణం: పై-లీన్ తుఫాన్ అత్యంత భయానకంగా ఉంటుందని ముందుగానే సంకేతాలు రావడంతో జిల్లాలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గతంలో వచ్చిన తుఫాన్ల కంటే బీభత్సంగా ఉంటుందన్న హెచ్చరికలతో ప్రజలు హడలిపోయారు. జిల్లా అధికార యంత్రాంగంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే శుక్రవారం ఉదయం నాటికి తుఫాన్లో మార్పులు కనిపించాయి. సాయంత్రానికి తుఫాన్ తీవ్రత ఉండదని తేలిపోయింది. కళింగపట్నానికి 410 కిలోమీటర్ల దూరంలో పై-లీన్ కేంద్రీకృతమై ఉందని, వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం సాయంత్రానికి ఒరిస్సాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం తెలియజేయడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తుఫాన్ ముప్పు తప్పినా అలర్ట్ జిల్లాకు ‘పై-లీన్’ తుఫాన్ ముప్పు తప్పిందని, అయినా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని స్పెషల్ ఆఫీసర్ కరికాల వళవన్ వెల్లడించారు. జిల్లాలో తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఆయన్ను నియమించింది. శుక్రవారం ఒంగోలు వచ్చిన సందర్భంగా ప్రకాశం భవనంలోని కలెక్టర్ చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల గురించి కలెక్టర్‌తో చర్చించినట్లు వివరించారు. గతంలో కూడా జిల్లాలో తుఫాన్లు వచ్చాయని, ఆ సమయంలో యంత్రాంగం వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుత ‘పై-లీన్’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల వెంబడి ఉన్న గ్రామాలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ప్రతి తీర ప్రాంత మండలానికి ఒక్కో స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. ఉదయం అందిన నివేదికలను బట్టి జిల్లాకు తుఫాన్ ముప్పు తప్పిందని, సాధారణ వర్షాలు కురుస్తాయని కరికాల వళవన్ వెల్లడించారు. అంతకు ముందుగా జిల్లాలో తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యల గురించి కలెక్టర్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్‌లతో ఆయన చర్చించారు. పకడ్బందీగా చర్యలు తీసుకోవడంపై స్పెషల్ ఆఫీసర్ వారిని అభినందించారు. వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ ‘పై-లీన్’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ విలేకరులకు వెల్లడించారు. యువకులు, ఎన్జీఓలు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. వాగులు పొంగితే వాటిని నియంత్రించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లోని 11 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. తీర ప్రాంతాల్లోని పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని కోరినట్లు వెల్లడించారు. తుఫాన్ ముప్పు తప్పినప్పటికీ ఒకవేళ దాని దిశ మార్చుకొని వస్తే ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విజయకుమార్ వివరించారు. వాడరేవులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక చీరాల, న్యూస్‌లైన్: పై-లీన్ తుఫాన్ నేపథ్యంలో చీరాల వాడరేవులో శుక్రవారం మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. ఈదురు గాలులు తీరాన్ని తాకుతున్నందున ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు పోర్టు అధికారి మోపిదేవి వెంకటేశ్వరరావు తెలిపారు. తీరంలో అలలు ఉధృతంగా ఉన్నాయి. సాధారణ రోజుల కంటే రెండు మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తీర ప్రాంత ప్రజలు ఆందోళనలో ఉన్నారు. నియోజకవర్గంలోని వాడరేవు, పచ్చమొగిలి, విజయలక్ష్మీపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, కఠారిపాలెం, రామాపురం ప్రాంతాల్లో మత్స్య కారులు ఒడ్డున ఉన్న బోట్లు, వలలు సురక్షిత ప్రాంతాలకు చేరవేసే పనిలో నిమగ్నమయ్యారు. సముద్రం ఐదు మీటర్ల ముందుకు రావడంతో ఒడ్డుకు ఎవరినీ వెళ్లనీయకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికారుల ముందస్తు చర్యలు: తీర ప్రాంత గ్రామాలపై తుఫాన్ ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రవాణా సదుపాయాలు, పునరావాస కేంద్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. రెస్క్యూ బోటును, ఐదుగురు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. సర్పంచ్‌లు, రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.