న్యూఢిల్లీ: పై-లీన్ తుపాను బాధిత ప్రాంతాలకు అన్ని రకాలుగా సాయం కొనసాగించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే శనివారం ఆయన ఏపీ, ఒడిశాల్లో పై-లీన్ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధానికి కేబినెట్ కార్యదర్శి వివరించారని ప్రధాని కార్యాలయం ‘ట్విట్టర్’లో పేర్కొంది.
హెలికాప్టర్లు, విమానాలు, నౌకలు సిద్ధం: షిండే
తుపాను బాధితులను రక్షించేందుకు, తక్షణ సహాయ చర్యల కోసం 18 హెలికాప్టర్లు, 12 విమానాలు, రెండు యుద్ధనౌకలు తూర్పు తీరంలో సిద్ధంగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు. సహాయక చర్యల కోసం 2 వేల మంది సైనికులు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారని తెలిపారు. ఒడిశాలో 5.5 లక్షల మందిని, ఏపీలో లక్ష మందిని 500 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు.