పంచాయతీ పన్ను పెంపుపై కన్ను
Published Mon, Jan 20 2014 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
ఏలూరు, న్యూస్‌లైన్: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రజల నుంచే పన్నులు వసూలు చేసి ఆ పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీల ఆదా యం అంతంతమాత్రంగా ఉండ డం, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం వద్ద నిధుల్లేకపోవడంతో ప్రజల నుంచే ప న్నులు వసూలు చేసి ఆ పనులను పూర్తి చేయాలని సర్కారు యోచి స్తోంది. ఇక నుంచి గ్రామాల్లో కొత్త పద్ధతిలో పన్నులను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో అధికారులు పన్నుల వా తకు కసరత్తు మొదలుపెట్టారు. ఇంతకు ముందులా ఏడాదికి ఐదు శాతం చొప్పున కాకుండా ఐదేళ్లకు కలిపి ఒకేసారి పన్ను భా రం మోపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పెనుగొండ మండలంలో ఈ పక్రియను సోమవారం నుంచి శాస్త్రీయ పద్ధతిలో పన్ను మదింపును చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
తొలుత అక్కడి గ్రామాల్లో ఈ పద్ధతిపై ప్రయోగం చేసి ఎదురయ్యే అనుకూల, ప్రతికూల పరిస్థితులపై అవగాహనకు వచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సమస్యలను తీర్చేందుకేనట..!జిల్లావ్యాప్తంగా 884 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో చాలా గ్రామాలకు సరైన ఆదాయ వనరులు లేవు. కొన్నిచోట్లయితే విద్యుత్ బిల్లులు చెల్లించే పరిస్థితులు కూడా లేదు. అభివృద్ధి పనులకు తగినన్ని నిధులు ప్రభుత్వం విడుదల చేయడం లేదు. అరకొర నిధులతో పనులు పూర్తికావడం లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పంచాయతీల్లో కూడా పన్నుల పెంపు, వసూలుపై దృష్టి సారించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇంటి విలువను మదించి పన్ను
ఇప్పటి వరకు గ్రామాల్లో 1990 కంటే ముందు నిర్ణయించిన పన్నులే ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో చాలా చోట్ల పెంకుటిల్లులు, తాటాకిళ్లు ఉన్నచోట కొత్తగా డాబాలు (స్లాబ్) ఇళ్లు వెలిశాయి. ప్రస్తుతం ఇవే అత్యధికంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చాలా చోట్ల వాణిజ్యం పరిధిలోకి వచ్చే దుకాణాలు కూడా భారీగా వెలిశాయి. కానీ వారు మాత్రం నేటికీ పాత పద్ధతిలోనే పన్నులు కడుతున్నారు. దీంతో సామాన్యుడితో సమానంగానే ధనికులు కూడా అవే పన్నులు చెల్లించేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పన్నులు పెంచే పద్ధతిని తీసుకొస్తున్నారు. ఇక నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం నివాస గృహం అయితే చదరపు అడుగుకు రూ. 25 పైసలు, వాణిజ్య భవనాలైతే చదరపు అడుగుకు రూ. 50 పైసలు విధిస్తారు. ఖాళీ స్థలాలకు కూడా పన్ను విధించనున్నారు.
రూ.15 కోట్లు ఆదాయం
వచ్చే అవకాశం
జిల్లాలో పన్ను మదింపు ప్రక్రియ ద్వారా గ్రామ పంచాయతీల ఆదా యం రూ.15 కోట్లకు చేరనుందని డీపీవో అల్లూరి నాగరాజు వర్మ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఇప్పటి వరకు రూ.10 కోట్ల మేర ఆస్తి, మంచినీటి పన్ను కింద ఏటా వసూలు అవుతుందన్నారు. ఇక నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్ను మదింపు చేపడతామన్నారు. పెనుగొండ మండలాన్ని పెలైట్ ప్రాజెక్టుగా వారం రోజుల కసరత్తు చేసి అనంతరం అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
కొత్త విధానం ఇదీ..
కొత్త పన్నుల పద్ధతిలో గ్రామాల్లో ఏ సౌకర్యాలు కావాలనే దానిపై ప్రజలను అడిగి అధికారులు ఒక నివేదిక తయారు చేస్తారు. దీనికోసం ఐదేళ్లలో వివిధ పథకాల కింద వచ్చే నిధులను అంచనా వేస్తారు. ఆ సమస్యల పరిష్కారానికి ఎన్ని నిధులు అవసరమవుతాయి? ప్రభుత్వపరంగా ఎన్ని వస్తాయో లెక్కిస్తారు. ఈ నిధులకు తోడు అదనంగా అవసరమయ్యే వాటిని పన్నుల రూపేణా వసూలు చేస్తారు. గ్రామానికి సౌకర్యాలు కావాలంటే ఈ అదనపు పన్నులు చెల్లించడం తప్పదని కొందరు అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకూ ఏటా ఆస్తి పన్నులో ఐదు శాతం పెంచుతూ వస్తున్నారు. కానీ కొత్తగా వచ్చిన ఆదేశాల మేరకు ఐదేళ్లకు కలిపి ఒకేసారి పన్ను వేయనున్నారు.
Advertisement