
మహిళా సర్పంచ్‌పై సీఐ జులుం
- విచారణకని పిలిచి చంపేస్తానన్నారు..కాలిబూటుతో తన్నారు
- శ్రీరాంపురం సర్పంచ్ ఆరోపణ
- సస్పెండ్ చేయాలని డిమాండ్
- పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన
పాయకరావుపేట,న్యూస్‌లైన్: విచారణ పేరుతో పిలిచి తనను కాలితో తన్ని, ఇష్టానుసారం కొట్టిన ఎలమంచిలి సీఐ హెచ్.మల్లీశ్వరరావును సస్పెండ్ చేయాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ మహిళా సర్పంచ్ పాయకరావుపేట పోలీసులకు ఫిర్యా దు చేశారు. స్థలం తగాదా నేపథ్యంలో మండలంలోని శ్రీరాంపురానికి చెందిన బసనబోయిన సత్యనారాయణ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఆ గ్రామ సర్పంచ్ తదితరులపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఎస్‌ఐ హారికృష్ణ సమాచారం మేరకు శనివారం సీఐ మల్లీశ్వరరావు వద్దకు వెళ్లామని శ్రీరాంపురం సర్పంచ్ చెంచలపు సన్యాసమ్మ తెలిపారు. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కార్యాలయానికి వచ్చిన సీఐ ‘నీ మీద కేసు పెట్టినా సిగ్గులేదా..?’ అంటూ దుర్భాషలాడుతూ కాలితో తన్ని చేత్తో కొట్టారని... దీంతో తాను భయపడి కేకలు వేయగా స్టేషన్‌లో ఉన్న తన బంధువులు వచ్చి అడ్డుకున్నారని చెబుతూ విలపించారు. ‘నిన్ను చంపేసినా ఎవరూ అడ్డుకోలేరు, నువ్వు మీ ఊళ్లో లేకుండా చేస్తాను’ అంటూ దుర్భాషలాడారన్నారు. మహిళా సర్పంచ్‌నని చూడకుండా దాడికి దిగిన సీఐపై పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.
ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆత్యహత్యే శరణ్యమని హెచ్చరిస్తూ బంధువులతో కలిసి ఠాణా ముందు ఆందోళనకు దిగారు. సీఐపై తాము ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించినట్టుగా రశీదు ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. దీంతో పాయకరావుపేట పోలీసులు ఫోన్లో సీఐతో చర్చిస్తూ అరగంట సేపు హైడ్రామా సాగించారు. ఎన్నికల కోడ్ ఉందని పోలీసు స్టేషన్ ముందు ఆందోళన చేస్తే కేసు పెడతామని బెదిరించారు.
తమపై కేసులు పెట్టినా ఫర్వాలేదని సీఐపైనా కేసు నమోదు చేయాల్సిందేనని సర్పంచ్‌తోపాటు బంధువులు డిమాండ్ చేయడంతో చివరికి రశీదు ఇచ్చారు. ఈ విషయమై ఎస్‌ఐ హరికృష్ణ మాట్లాడుతూ సీఐపై ఫిర్యాదు వచ్చిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు.