మండపేట : ఉల్లి ధర ఘాటెక్కింది. ఏడాది కాలంలో ఎన్నడూ లేనివిధంగా కిలో రూ.35కు చేరి సామాన్యులకు కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతుండడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఉత్పత్తి లేకపోవడం, వర్షాభావ పరిస్థితులు.. ఉల్లి ధరను పెంచేశాయని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జిల్లాలో రోజుకు వంద టన్నులకు పైగా ఉల్లిపాయల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి లేకపోవడంతో మహారాష్ట్రలోని నాసిక్, షోలాపూర్, శ్రీరాంపురం, పుణె తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటుంటారు. వర్షాభావ పరిస్థితులతో మహారాష్ట్రలో 20 నుంచి 25 శాతం మేర దిగుబడులు పడిపోయినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని అక్కడి దళారులు కృత్రిమ కొరత సృష్టించడంతో ధరలపై ప్రభావం చూపుతోందని వారంటున్నారు. గోదాముల్లో ముందుగానే నిల్వలు చేసుకున్న దళారులు.. సరుకు లేదంటూ అరకొరగా అందజేస్తుండటం ధరలపై ప్రభావం చూపుతోందంటున్నారు.
స్థానిక అవసరాలతో పాటు, ఒడిశాకు ఎగుమతి చేసేందుకు జిల్లాలోని హోల్‌సేల్ వ్యాపారులు రోజుకు సుమారు 200 టన్నుల వరకు ఉల్లిపాయలు దిగుమతి చేసుకుంటే, ప్రస్తుతం ఆ మేరకు అక్కడి నుంచి సరుకు అందడం లేదంటున్నారు. జూన్ నెలాఖరుకు రూ.16 నుంచి రూ.20 వరకున్న ధర, జూలై ప్రారంభంలో రూ.25కు చేరింది. క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రూ.35 పలుకుతోంది. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగనుండటంతో ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అక్కడ అధిక ధరకు కొనుగోలు చేయడంతో పాటు రవాణా చార్జీలు కూడా ఎక్కువై మార్కెట్‌కు చేరేసరికి ధర రెట్టింపవుతోంది.
మరో రెండు నెలలు!
ఇలాఉండగా మరో రెండు నెలల్లో కర్నూలు ఉల్లిపాయలు మార్కెట్‌లోకి వస్తే ధరలు అదుపులోకి వస్తాయంటున్నారు. జిల్లాలోని గొల్లప్రోలు ప్రాంతంలో పండించే ఉల్లిపాయలు డిసెంబర్, జనవరి నెలల్లో మార్కెట్‌లోకి వస్తే పూర్తిస్థాయిలో ధరలు అదుపులోకి వచ్చి, సాధారణ స్థాయికి చేరుకుంటాయని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోగా, ఉల్లిపాయల ధర ఘాటెక్కడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉల్లిపాయలు తప్పనిసరి కావడంతో అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. గతేడాది ఇదే కాలంలో కిలో రూ.10 మాత్రమే ఉండగా, ఈ ఏడాది మూడింతలు పెరగడంపై వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో హోటళ్లు, ఇళ్లలోను కొంత మేర వినియోగం తగ్గిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఘాటెక్కిన ఉల్లి
Published Wed, Jul 29 2015 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM
Advertisement
Advertisement