Srirampuram
-
ఘాటెక్కిన ఉల్లిధరలు
-
ఘాటెక్కిన ఉల్లి
మండపేట : ఉల్లి ధర ఘాటెక్కింది. ఏడాది కాలంలో ఎన్నడూ లేనివిధంగా కిలో రూ.35కు చేరి సామాన్యులకు కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతుండడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఉత్పత్తి లేకపోవడం, వర్షాభావ పరిస్థితులు.. ఉల్లి ధరను పెంచేశాయని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జిల్లాలో రోజుకు వంద టన్నులకు పైగా ఉల్లిపాయల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి లేకపోవడంతో మహారాష్ట్రలోని నాసిక్, షోలాపూర్, శ్రీరాంపురం, పుణె తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటుంటారు. వర్షాభావ పరిస్థితులతో మహారాష్ట్రలో 20 నుంచి 25 శాతం మేర దిగుబడులు పడిపోయినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని అక్కడి దళారులు కృత్రిమ కొరత సృష్టించడంతో ధరలపై ప్రభావం చూపుతోందని వారంటున్నారు. గోదాముల్లో ముందుగానే నిల్వలు చేసుకున్న దళారులు.. సరుకు లేదంటూ అరకొరగా అందజేస్తుండటం ధరలపై ప్రభావం చూపుతోందంటున్నారు. స్థానిక అవసరాలతో పాటు, ఒడిశాకు ఎగుమతి చేసేందుకు జిల్లాలోని హోల్‌సేల్ వ్యాపారులు రోజుకు సుమారు 200 టన్నుల వరకు ఉల్లిపాయలు దిగుమతి చేసుకుంటే, ప్రస్తుతం ఆ మేరకు అక్కడి నుంచి సరుకు అందడం లేదంటున్నారు. జూన్ నెలాఖరుకు రూ.16 నుంచి రూ.20 వరకున్న ధర, జూలై ప్రారంభంలో రూ.25కు చేరింది. క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రూ.35 పలుకుతోంది. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగనుండటంతో ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అక్కడ అధిక ధరకు కొనుగోలు చేయడంతో పాటు రవాణా చార్జీలు కూడా ఎక్కువై మార్కెట్‌కు చేరేసరికి ధర రెట్టింపవుతోంది. మరో రెండు నెలలు! ఇలాఉండగా మరో రెండు నెలల్లో కర్నూలు ఉల్లిపాయలు మార్కెట్లోకి వస్తే ధరలు అదుపులోకి వస్తాయంటున్నారు. జిల్లాలోని గొల్లప్రోలు ప్రాంతంలో పండించే ఉల్లిపాయలు డిసెంబర్, జనవరి నెలల్లో మార్కెట్లోకి వస్తే పూర్తిస్థాయిలో ధరలు అదుపులోకి వచ్చి, సాధారణ స్థాయికి చేరుకుంటాయని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోగా, ఉల్లిపాయల ధర ఘాటెక్కడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉల్లిపాయలు తప్పనిసరి కావడంతో అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. గతేడాది ఇదే కాలంలో కిలో రూ.10 మాత్రమే ఉండగా, ఈ ఏడాది మూడింతలు పెరగడంపై వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో హోటళ్లు, ఇళ్లలోను కొంత మేర వినియోగం తగ్గిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మహిళా సర్పంచ్‌పై సీఐ జులుం
విచారణకని పిలిచి చంపేస్తానన్నారు..కాలిబూటుతో తన్నారు శ్రీరాంపురం సర్పంచ్ ఆరోపణ సస్పెండ్ చేయాలని డిమాండ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన పాయకరావుపేట,న్యూస్‌లైన్: విచారణ పేరుతో పిలిచి తనను కాలితో తన్ని, ఇష్టానుసారం కొట్టిన ఎలమంచిలి సీఐ హెచ్.మల్లీశ్వరరావును సస్పెండ్ చేయాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ మహిళా సర్పంచ్ పాయకరావుపేట పోలీసులకు ఫిర్యా దు చేశారు. స్థలం తగాదా నేపథ్యంలో మండలంలోని శ్రీరాంపురానికి చెందిన బసనబోయిన సత్యనారాయణ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామ సర్పంచ్ తదితరులపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఎస్ఐ హారికృష్ణ సమాచారం మేరకు శనివారం సీఐ మల్లీశ్వరరావు వద్దకు వెళ్లామని శ్రీరాంపురం సర్పంచ్ చెంచలపు సన్యాసమ్మ తెలిపారు. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కార్యాలయానికి వచ్చిన సీఐ ‘నీ మీద కేసు పెట్టినా సిగ్గులేదా..?’ అంటూ దుర్భాషలాడుతూ కాలితో తన్ని చేత్తో కొట్టారని... దీంతో తాను భయపడి కేకలు వేయగా స్టేషన్లో ఉన్న తన బంధువులు వచ్చి అడ్డుకున్నారని చెబుతూ విలపించారు. ‘నిన్ను చంపేసినా ఎవరూ అడ్డుకోలేరు, నువ్వు మీ ఊళ్లో లేకుండా చేస్తాను’ అంటూ దుర్భాషలాడారన్నారు. మహిళా సర్పంచ్‌నని చూడకుండా దాడికి దిగిన సీఐపై పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆత్యహత్యే శరణ్యమని హెచ్చరిస్తూ బంధువులతో కలిసి ఠాణా ముందు ఆందోళనకు దిగారు. సీఐపై తాము ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించినట్టుగా రశీదు ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. దీంతో పాయకరావుపేట పోలీసులు ఫోన్లో సీఐతో చర్చిస్తూ అరగంట సేపు హైడ్రామా సాగించారు. ఎన్నికల కోడ్ ఉందని పోలీసు స్టేషన్ ముందు ఆందోళన చేస్తే కేసు పెడతామని బెదిరించారు. తమపై కేసులు పెట్టినా ఫర్వాలేదని సీఐపైనా కేసు నమోదు చేయాల్సిందేనని సర్పంచ్‌తోపాటు బంధువులు డిమాండ్ చేయడంతో చివరికి రశీదు ఇచ్చారు. ఈ విషయమై ఎస్ఐ హరికృష్ణ మాట్లాడుతూ సీఐపై ఫిర్యాదు వచ్చిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. -
కొల్లూరులో దోపిడీ దొంగలు స్వైర విహారం
గుంటూరు జిల్లాలోని వేమూరు మండలం కొల్లూరులో గత అర్థరాత్రి దోపిడి దొంగలు స్వైర విహారం చేశారు. పట్టణంలోని 10 షాపుల్లో చోరీ చేసి, భారీగా సొత్తును అపహరించారు. శనివారం ఉదయం షాపు యజమానులు తమ దుకాణాల్లో దోపిడి జరిగిందని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసుల చోరీకి గురైన షాపులను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో రేపల్లి పట్టణంలో గురువారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దాదాపు 10 షాపులను లూటీ చేశారు. దాంతో షాపు యజమానాలు రేపల్లె పోలీసులను ఆశ్రయించారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం శ్రీరాంపురంలో గత రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. 10 తులాల బంగారంతోపాటు రూ.3 లక్షల నగదును దోపిడి దొంగలు దోచుకుపోయారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
పాడుబడిన బావిలో పడి యువకుని ఆత్మహత్య
పెద్దశ్రీరాంపురం(కంచిలి), న్యూస్‌లైన్: మండలంలోని పెద్ద శ్రీరాంపురం గ్రామానికి చెందిన యువకుడు పర్రి రామారావు(26) గ్రామానికి వెళ్లే మెయిన్‌రోడ్డు పక్కన పాడుబడిన నేలబావిలో పడి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్టు కంచిలి ఎస్ఐ కె. గోవిందరావు తెలిపారు. ఆయన, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మృతుడు పర్రి రామారావు మూడేళ్లే కిందట తాటిచెట్టుమీద నుంచి జారిపడిపోయూడు. దీంతో 3 నెలలు పాటు కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రమాదంలో రామారావు ఎడమకాలు విరిగిపోయింది. ఆపరేషన్ చేసి రాడ్లు వేశారు. తర్వాత కూడా రామారావు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తుండేవాడు. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు శనివారం ఉదయం 10 గంటలకు తోటకెళ్తానని ఇంటి నుంచి బయలుదేరి తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు రోజంతా వెతికారు. ఆదివారం ఉదయాన గ్రామ పొలిమేరల్లో ఉన్న బావిలో శవమై తేలిఉండటాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని తండ్రి చిరంజీవుల ఫిర్యాదు మేరకు కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.