ఖమ్మం, న్యూస్‌లైన్: వీరుల త్యాగఫలంతో వచ్చిన స్వాతంత్య్ర ఫలాలను అన్నివర్గాల ప్రజలకు అందచేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రానున్న రోజుల్లో సమగ్రాభివృద్ధి సాధించేందుకు జిల్లా ప్రజలందరు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఉద్యానవనశాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి పిలుపు నిచ్చారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిధిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. ఈ ప్రాంతప్రజల మనోభావాలకు విలువనిచ్చిన యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూల ప్రకటన చేయడం శుభసూచకం అన్నారు. జిల్లా ఆవిర్భవించి 60 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ ఏడాదంతా నిర్వహిస్తున్న వజ్రోత్సవాలలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలు ఏజెన్సీ గ్రామాలను అతలాకుతలం చేశాయని, 140 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని, 16వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, బాధిత కుటుంబాలను అదుకునేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. గిరిజనులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
వ్యవసాయరంగానికి పెద్దపీట
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసి కోట్లాది రూపాయల నిధులు కేటాయించి దని మంత్రి అన్నారు. ఖరీఫ్‌లో 7.7లక్షల పత్తివిత్తనాల ప్యాకెట్లు సబ్సిడీ ధరకు అందచేశామన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా 73వేల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం చేశామని తెలిపారు. ఈ సంవత్సరం 1,598కోట్ల రూపాయల రుణాలు అందచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిలో ఇప్పటివరకు 744కోట్లను 50వేల మంది రైతులకు అందచేశామని అన్నారు. అదేవిధంగా 6.2కోట్ల రూపాయల విలువైన పరికరాలను 50శాతం సబ్సిడీపై అందచేశామని అన్నారు. ఉద్యానపంటల ప్రోత్సాహం కోసం 6.46కోట్ల రూపాయల విలువైన యూనిట్లను 13,808మంది రైతులకు మంజూరు చేశామన్నారు. బిందు సేద్యం ప్రోత్సహించేందుకు 10.74కోట్ల రాయితీలతో 1,430 మంది రైతులకు పరికరాలు అందచేశామని అన్నారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి 86 మేలుజాతి పశువులు, 63 మినీ డైరీ యూనిట్లు, జీవక్రాంతి పథకం కింద 37పొట్టేలు పిల్లలు అందచేశామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు మేకల పెంపకంకోసం 15లక్షల రూపాయలు మంజూరు చేశామని అన్నారు. మత్స్యపరిశ్రమాభివృద్ధికి 1.68 కోట్ల రూపాయలు విడుదల చేశామని మంత్రి వివరించారు.
అదేవిధంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధరకల్పిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం మార్కెటింగ్ శాఖకు క్రయ, విక్రయాల ద్వారా 33 కోట్లరూపాయల ఆదాయం చేకూరిందని చెప్పారు. సాగునీటి పథకాల ఆధునికీకరణ పనులు చేపట్టామని అన్నారు. జిల్లాలో 114 చెరువులకు 66కోట్లరూపాయల పనులు చేపట్టి 45వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించామని అన్నారు. 15 ఎత్తిపోతల పథకాల నిర్మాణం కోసం 105కోట్లు కేటాయించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రైతుల సంక్షేమం కోసం సాగునీటి వనరుల కల్పనకు నిధులు కేటాయించామని, అధునాతన విజ్ఞానం రైతులకు అందించేందుకు సదస్సులు, సమావేశాలు నిర్వహించి రైతులను చైతన్యం చేశామని వివరించారు. ఖమ్మం నగరాన్ని వరదనుంచి రక్షించేందుకు మున్నేరు వాగుకు 180కోట్లరూపాయలతో కరకట్ట నిర్మించేందుకు అంచానలు పంపామని తెలిపారు.
సంక్షేమ పథకాల అమలు వేగవంతం
విద్య, వైద్యం, ఉపాధి రంగాలతోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల అమలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని మంత్రి అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం ద్వారా 105కోట్లరూపాయల విలువైన 96లక్షల పనిదినాలు కల్పించామని చెప్పారు. నిర్మల్ భారత్ అభియాన్ పథకం ద్వారా 20వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని అన్నారు. మరో94 వేల మంది లబ్ధిదారులను గుర్తించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులో భాగంగా వివిధ ప్రాంతాల్లో సీసీరోడ్ల నిర్మాణం కోసం 39కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. నిరుపేదలకు 3.58వేల నూతన గృహాలను మంజూరుచేశామని, వీటిలో 2లక్షలకు పైగా గృహాలు నిర్మాణం పూర్తి అయిందన్నారు. డీఆర్‌డీఏ, ఇందిరాక్రాంతి ద్వారా28వేల మహిళా గ్రూపులకు 600కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీలు ఇవ్వాలని నిర్ణయించి ఇప్పటివరకు 72కోట్లు అందచేశామని అన్నారు. ఈ సంవత్సరం 37,500 సంఘాలకు 13.22లక్షల రూపాయలు రాయితీలు అందచేశామని చెప్పారు.
సామాజిక భద్రాతా పథకం కింద పెన్షన్లకోసం 28కోట్లు విడుదల చేశామన్నారు. అదేవిధంగా రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన వినతుల ఆధారంగా 22,846 పెన్షన్లు మంజూరు చేశామని చెప్పారు. అభయహస్తం, అమ్‌ఆద్మీ బీమా పథకాలు నిరుపేదలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మెప్మా ద్వారా అర్బన్ ఏరియాలోని 702 సంఘాలకు 4.58కోట్లు జీరో వడ్డీపై అందచేశామని, 886 గ్రూపులకు రూ. 25కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందచేశామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువక్తిద్వారా 3.28 కోట్ల రూపాయలతో 373యూనిట్లు 1.1కోటి సబ్సిడీపై అందచేశామన్నారు. 208కోట్లతో జిల్లా పరిశ్రమలశాఖ ద్వారా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించేందుకు ప్రోత్సహించామని అన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు 1,152 మంది బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించామని చెప్పారు. స్కూల్ గ్రాంట్స్ 2.18 కోట్లు, పాఠశాలల నిర్మాణ గ్రాంట్‌లు 2.15కోట్లు, కేజీబీవీల నిర్మాణానికి 17కోట్లు విడుదల చేశామని తెలిపారు. 8.38కోట్ల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం అందచేశామని చెప్పారు.
11.62 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టామని చెప్పారు. మెరుగైన వైద్యసేవలు అందించడం, శిశుమరణాలను నివారించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. జననీ సురక్షా పథకం ద్వారా 71వేల మందికి రూ.1.9కోట్ల పారితోషికం అందచేశామని చెప్పారు. రక్షిత మంచినీటి సరఫరాకోసం 365 కోట్లతో 35 ప్రాజెక్టులు, 1.5 కోట్లతో 25 ఆవాస ప్రాంతాలకు సోలార్ ఎనర్జీ స్కీంలు, కొండరెడ్ల నివాస ప్రాంతాల్లో 3.31కోట్ల వ్యయంతో మంచినీటి పనులు మంజూరు చేశామని అన్నారు. రోడ్ల మరమ్మతులకోసం 904కోట్లతో పనులు చేపట్టామని చెప్పారు.
వనసంరక్షణ పథకం ద్వారా అడవులు పెంపకం కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఖమ్మం నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా అభివృద్ధికి సహకరించిన కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఇన్‌చార్జి మంత్రి బాలరాజు, ఉపసభాపతి మల్లు భట్టివిక్రమార్క,ఉద్యోగులు, అధికారులు ప్రజాప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్య్ర వేడుకలలో జిల్లా కలెక్టర్ శ్రీనివాసన్ శ్రీనరేష్, ఎస్పీ రంగనాథ్, జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
అభివృద్ధిలోభాగస్వాములు కావాలి
Published Fri, Aug 16 2013 4:19 AM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM
Advertisement
Advertisement