
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నీటి సమస్య అధిగమించామని.. మిగులు విద్యుత్ సాధించామని.. ఇక కాలుష్య సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులు, జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఫిన్లాండ్ తరహాలో రాష్ట్రంలో గాలి స్వచ్ఛత (ఎయిర్ క్వాలిటి)పై శ్రద్ధ వహించాలన్నారు. వాయు, జల కాలుష్య సమస్యల పరిష్కారంపై కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలని ఆదేశించారు.
ఉండవల్లిలోని తన నివాసం నుంచి వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో నీరు ప్రగతి, వ్యవసాయంపై మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కృష్ణా, గుంటూరు, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో కాలుష్య సమస్య పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. రాజధాని ప్రాంతంలో వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టే పద్ధతులకు స్వస్తి చెప్పాలని చెప్పారు. సీమ జిల్లాలకు నీళ్లిచ్చామని, పండ్ల తోటలు అభివృద్ధి చేశామని అందుకే అక్కడ జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని సీఎం తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా రబీలో పంటలకు నీళ్లివ్వగలగడంపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు.
ఫిబ్రవరిలో సీఐఐ భాగస్వామ్య సదస్సు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు విశాఖ వేదికగా జరగనున్న మూడో సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఐటీ, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ రంగాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఫిబ్రవరి మొదటి వారంలో తిరుపతిలో ఎంఎస్‌ఎంఈ సదస్సు కూడా నిర్వహించనున్నారు.
జనవరి 21న దావోస్‌కు సీఎం
కాగా, వచ్చే జనవరి 21 నుంచి ఐదు రోజులపాటు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరుకానున్నట్లు మంత్రి ఆదినారాయణరెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment