సొమ్ము ఇచ్చుకో..పోస్టు పుచ్చుకో...
ఈపీడీసీఎల్‌లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు కావాలనుకుంటున్నారా! అయితే రూ.ఐదు లక్షలు ఇచ్చుకునే స్తోమత ఉందా? అంత ఇచ్చుకోలేకపోతే.. కనీసం అధికార పార్టీ నేతకు దగ్గరవారైఉంటే రూ.మూడు లక్షలకు పనైపోతుంది.మరెవరో కాదు.. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు నిర్ణయించిన రేటు ఇది. జిల్లాలో కొనసాగుతున్నఈ దందాను చూసీచూడనట్టు పోవాలంటూ అధికారులకు సైతం వారు హుకుం
జారీ చేస్తున్నారు.
సాక్షి, రాజమండ్రి :తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో జిల్లాలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకు ధరలు నిర్ణయించారు అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు. పోస్టు కాంట్రాక్టు పద్ధతిలో ఉన్నా, తమతో బేరసారాలు కుదుర్చుకోకపోతే ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదని అధికారులకు హుకుం జారీ చేశారు. గతనెలలో జేఎల్‌ఎంల నియామకాల్లో 92 మంది ఆన్‌డ్యూటీ ఆపరేటర్లు జేఎల్‌ఎంలుగా నియమితులయ్యారు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాల్సి ఉండగా, కొందరు ఎమ్మెల్యేలు ఆ పోస్టులకు ‘ప్రైస్ ట్యాగ్’లు బిగించారు. ఒకొక్క పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తాము సిఫారసు చేసిన అభ్యర్థులకు మాత్రమే పోస్టులు కట్టబెట్టాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరుద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు అంతసొమ్ము ఎలా తీసుకొస్తామని డీలా పడతున్నారు.
పోస్టుల ఖాళీలు ఇలా..
ఈపీడీసీఎల్‌కు జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం, జగ్గంపేట డివిజన్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో కాంట్రాక్టు పద్ధతిలో షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న 1559 మందిలో 92 మంది ఆగస్టులో జరిగిన జేఎల్‌ఎం నియామకాల్లో ఎంపికయ్యారు. ఖాళీ అయిన ఆ స్థానాలను ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కాంట్రాక్టు షిఫ్ట్ ఆపరేటర్‌కు రూ.9829 వేతనంగా ఇస్తున్నారు. ఈ చిన్న పోస్టుకు కూడా రూ.లక్షల్లో బేరాలు సాగిస్తున్నారు.
అధికారులను గుప్పెట్లో పెట్టుకుని..
ఆగస్టులో జిల్లాలో 197 జేఎల్‌ఎంల నియామకాలను ఈపీడీసీఎల్ అధికారులు చేపట్టారు. అప్పట్లో అధికార పార్టీ వారికి కూడా అవకాశం లేకుండా, పారదర్శకంగా నియామక ప్రక్రియను పూర్తిచేశారు. కొన్నిచోట్ల నేతల సిఫారసు లేఖలను కూడా తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారిపై గుర్రుగా ఉన్న నేతలు ఆయనను బదిలీ చేయించేందుకు సైతం విశ్వప్రయత్నం చేసినట్టు తెలిసింది. అది సాధ్యపడక పోవడంతో ఈసారైనా షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో తమ దందా సాగించేలా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. లేకపోతే ఈసారి బది లీ వేటు తప్పదని బెదిరించడంతో.. ఆ ఉన్నతాధికారి తలవంచక తప్పలేదని తెలుస్తోంది. ఈ రేట్లలో కూడా ఆ ప్రజాప్రతినిధులు కాస్త కనికరం చూపుతున్నట్టు తెలిసింది. అభ్యర్థి తమకు కావాల్సిన వాడు, పార్టీ కార్యకర్త, నమ్మిన బంటు వంటి వాళ్లయితే రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షలు ఇస్తే చాలని అంటున్నట్టు ఓఅభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశాడు. లేదంటే రూ.ఐదు లక్షల నుంచి ఏడు లక్షల మధ్యలో చెల్లించుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారని గ్రామీణ ప్రాంతానికి చెందిన కొందరు అభ్యర్థులు చెబుతున్నారు.