- మే ఒకటి నుంచి అమలు
- ఆగస్టు నుంచి నూరుశాతం చెల్లింపులు
- ఆన్‌లైన్‌లోనే
- ఖజానా శాఖ అదనపు సంచాలకుడు హనుమంతరావు వెల్లడి
విజయవాడ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే పర్సనల్ డిపాజిట్ (పీడీ) ఖాతాలను మే ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఖజానా శాఖ అదనపు సంచాలకుడు బీఎల్ హనుమంతరావు తెలిపారు. గురువారం విజయవాడ లయోలా క ళాశాలలో కృష్ణా, గుంటూరు జిల్లాల ఖజానా సిబ్బంది, పీడీ ఖాతాలు నిర్వహించే కార్యాలయ అధికారులు, సంస్థల సిబ్బందికి ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం విడుదల చేసే నిధుల ఖాతాలను పూర్తి పారదర్శకతతో నిర్వహించాల్సి ఉందన్నారు. దీని కోసం సంబంధిత శాఖాధిపతులు జవాబుదారీతనంతో కూడిన పీడీ ఖాతాల నిర్వహణ చేపట్టాలని సూచించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, డ్వామా, డీఆర్‌డీఏ తదితర సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు నిర్వహించే అన్ని పీడీ ఖాతాలూ ఆన్‌లైన్ విధానానికి అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిధుల ఖర్చులను సరళీకృత విధానంలో నిర్వహించేందుకు గాను పర్సనల్ డిపాజిట్ పోర్టల్‌ను అభివృద్ధి పరచినట్లు తెలిపారు. దీనిని ట్రెజరీ పోర్టల్‌కు అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. ఖాతా నిర్వహణ, జమా ఖర్చుల చెల్లింపులకు సంబంధించి అన్ని అంశాలు ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ విధానంలో చెక్కుల ద్వారా జరిపే చెల్లింపులను నిలిపివేస్తూ ఆన్‌లైన్ విధానంలోనే లావాదేవీలు నిర్వహిస్తామన్నారు. సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించడంలో భాగంగా ఆన్‌లైన్, ప్రస్తుతం నిర్వహిస్తున్న విధానాన్ని సమాంతరంగా మూడు నెలలపాటు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి నూటికి నూరు శాతం పీడీ ఖాతాలకు ఆన్‌లైన్ ద్వారానే నగదు చెల్లింపులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
విజయవాడ ట్రెజరీకి నూతన కార్యాలయం ఏర్పాటు
విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలోని ప్రస్తుత తూర్పు ఖజానా కార్యాలయం నిర్వహిస్తున్న ప్రాంగణంలోనే పబ్లిక్, ప్రైవేటు సమన్వయంతో పశ్చిమ, తూర్పు ఖజానా కార్యాలయాల నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే కార్యాలయాలను సొంత భవనాల్లో ఏర్పాటు చేసుకునే విధానంలో భాగంగా ఖజానా కార్యాలయాల నిర్మాణం త్వరలో చేపట్టి పూర్తిచేస్తామన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఖజానా శాఖ డెప్యూటీ డెరైక్టర్లు కె.సురేంద్రబాబు, ఎన్.నాగేశ్వరరావు, సీఆర్‌డీఏ డెప్యూటీ డెరైక్టర్ కె.పాలేశ్వరరావు, హైదరాబాద్ ఖజానా కార్యాలయం సహాయ సంచాలకుడు కె.అచ్యుతరామయ్య, విజయవాడ జిల్లా ఖజానా అధికారి కేడీవీఎం ప్రసాద్ పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో పీడీ ఖాతాల నిర్వహణ
Published Fri, Apr 17 2015 6:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM
Advertisement
Advertisement