PD accounts
-
నిధులున్నా.. జీరో!
ఈ తాగునీటి బోర్వెల్ వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ నక్కల కాలనీ చెరువు ప్రాంతంలో ఉంది. 260 కుటుంబాలకు తాగునీటిని సరఫరా చేసేది. తీవ్రవర్షాభావం, మండు వేసవి కావడంతో ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ బోర్ వెల్‌నుంచి సక్రమంగా నీరు రావడం లేదు. పూడిక తీయించి మరమ్మతులు చేస్తే పూర్తిస్థాయిలో నీరు వస్తుంది. పంచాయతీకి చెందిన పీడీ ఖాతాలో(పర్సనల్ డిపాజిట్ అకౌంట్) తాగునీటి నిర్వహణకు సరిపడా నిధులున్నాయి. బోర్వెల్కు మరమ్మతులు చేసేందుకు డబ్బు డ్రా చేద్దామనుకుంటే డబ్బులున్న తమ పీడీ ఖాతాలో జీరో బ్యాలెన్స్ చూపిస్తుండటంతో అధికారులకు ఏమి చేయాలో అర్థం కాలేదు. దీంతో ఆ బోర్వెల్ మరమ్మతుల పని గురించి ఆలోచించడం పక్కన పెట్టేశారు. ఇదే పరిస్థితి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో నెలకొంది. నెల్లూరు(అర్బన్): జిల్లాలోని 940 పంచాయతీల్లో సర్పంచ్ల పాలన గత ఆగస్టు ఒకటో తేదీతో ముగిసింది. ప్రత్యేకాధికారుల పాలనలోనికి గ్రామాలు వెళ్లాయి. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్ రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులకు బ్రేక్ పడింది. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి ఉన్నటువంటి 14వ ఆర్థిక సంఘం నిధులను అభివృద్ధి పనులకు వినియోగిద్దామంటే పీడీ ఖాతాల్లో బ్యాలెన్స్ (నగదు) జీరో చూపిస్తోంది. దీంతో పంచాయతీల్లో పాలన నిర్వహిస్తున్న ప్రత్యేకాధికారి, సెక్రటరీ తమ జేబుల్లో నుంచి డబ్బు ఎందుకు తీసి ఖర్చుపెట్టాలంటూ పాలన గురించి పట్టించుకోవడం మానేశారు. సీఎఫ్ఎంఎస్ పేరుతో ప్రభుత్వం దగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమంటూ అన్ని శాఖాల లావాదేవీలను ట్రెజరీ ద్వారా నిర్వహించేందుకు సీఎఫ్ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) అనే నూతన విధానాన్ని దాదాపు ఏడాదిన్నర క్రితమే ప్రవేశ పెట్టింది. అందులో భాగంగా జిల్లాలోని 940 పంచాయతీలు, 46 మండల పరిషత్‌లు, జెడ్పీ, ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాలకు చెందిన అన్ని రకాల నిధులు, డిపాజిట్లు, గ్రాంట్లు ట్రెజరీలో జమ చేయాలి. ఈ నిధులు సీఎఫ్ఎంఎస్ విధానం ద్వారా పీడీ ఖాతాల్లోనికి జమ కావాల్సి ఉంది. ఏ క్యాడర్‌లోనైనా, ఏ స్థాయి అధికారికి అయినా నగదు చెల్లింపులు ఈ సీఎఫ్ఎంఎస్ విధానంలో జరగాల్సిందే. అయితే మార్చి తరువాత అన్ని శాఖల నుంచి ట్రజరీకి బిల్లులు పంపినప్పుడు ఆన్లైన్లో సీఎఫ్ఎంఎస్ విధానంలో తీసుకుంటున్నాయి. ఇలా బిల్లులను యాక్సెప్ట్ చేసిన వెంటనే నిధులు విడుదల కావాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా పీడీ ఖాతాలన్నీ జీరో చూపిస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏమి చేయాలో అధికారులకు అర్థం కాక ఉన్నతాధికారులకు తమ బాధలు మొరపెట్టుకుంటున్నారు. ప్రధానంగా పంచాయతీశాఖ, జెడ్పీ అధికారులు గ్రామాల్లోని సమస్యలు తీర్చలేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఎన్నికల కోడ్ పేరుతో డ్రామాలాడుతోంది. ఈ నిధులను కూడా పసుపు–కుంకుమ పథకానికి టీడీపీ పాలకులు ఓట్ల రాజకీయంలో భాగంగా డైవర్ట్ చేశారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. చుక్క నీటికి ఇక్కట్లు వరుసగా మూడేళ్ల నుంచి తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటి పోయాయి. ప్రధానంగా మెట్టప్రాంతాలైన ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, దుత్తలూరు, కొండాపురం, వింజమూరు, కలిగిరి, ఏఎస్‌పేట, మర్రిపాడు రాపూరు, సైదాపురం తదితర అనేక మండలాల్లో ప్రజలు చుక్క నీటికి అల్లాడిపోతున్నారు. ప్రధానంగా ట్యాంకర్లపై ఆధారపడి జీవిస్తున్నారు. జనం నానా పాట్లు పడుతున్నారు. సర్పంచ్‌లు అధికారంలో ఉంటే ముందుగా తమ జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చు చేసి సమస్యలు పరిష్కరించేవారు. తరువాత నిధానంగా బిల్లులు పెట్టుకుని డబ్బులు తీసుకునే వారు. ప్రత్యేకాధికారుల పాలన కావడంతో ఈ పరిస్థితి లేదు. చిరుద్యోగులైన కార్యదర్శులు తమ జేబులో నుంచి రూపాయి తీసి ఖర్చు చేసినా అవి తిరిగి వస్తాయనే నమ్మకం లేక మిన్నకుండిపోతున్నారు. దీంతో గ్రామాల్లో తాగునీటి పథకాలు మూలన పడుతున్నాయి. తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. మరో వైపు కలెక్టర్ స్పందించి ఈ పరిస్థితిని చక్కదిద్ది తమ సమస్యలు తీర్చాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. -
పీడీ ఖాతాల స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి
-
‘‘పీడీ అకౌంట్స్ స్కాం’’ బీహార్ దాణా స్కాం కన్నా పెద్దది
సాక్షి,న్యూఢిల్లీ : టీడీపీ ప్రభుత్వం చేసిన ‘‘పీడీ అకౌంట్స్ స్కాం’’ బీహార్ దాణా స్కాం కన్నా పెద్దదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. శనివారం గవర్నర్ నరసింహన్‌కు ఆయన లేఖ రాశారు. పీడీ అకౌంట్స్‌లో భారీగా నగదు జమచేయటంపై కాగ్ స్పెషల్ ఆడిట్, సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ ఆయన లేఖ ద్వారా కోరారు. మరికొన్ని ముఖ్యమైన అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వం 53,038 కోట్ల ప్రజాధనాన్ని పీడీ అకౌంట్స్‌లో వేసిందని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం 58,539 పీడీ అకౌంట్లను తెరిచిందని అన్నారు. 2016-17 కాగ్ రిపోర్ట్‌ను చూస్తే ఇదో భారీ కుంభకోణంలా అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు, టీడీపీ నేతలు, ప్రభుత్వ సీనియర్ అధికారులు పొంతనలేని సమాధానాలిస్తున్నారని పేర్కొన్నారు. ఒక పద్దతి ప్రకారం దోపిడీ చేసినట్లు అర్థమవుతోందని అన్నారు. ఇన్వెస్టిగేషన్, పబ్లిక్ స్క్రూటినీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బీహార్‌లో గవర్నర్ సరైన సమయంలో జోక్యం చేసుకోవటంతో లాలూ ప్రసాద్ యాదవ్, మిగితా నేతలు, అధికారులకు దాణా స్కాంలో శిక్షలు పడ్డాయని అన్నారు. గతంలో బీహార్ ప్రభుత్వం కూడా ఇప్పటి ఏపీ సర్కార్‌లాగే ప్రకటనలు చేయించిందని తెలిపారు. అందుకే గవర్నర్ జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించాలని కోరారు. -
పీడీ ఖాతాలపై గవర్నర్‌కు జీవీఎల్ నరసింహారావు లేఖ
-
పీడీ ఖాతాలపై నోరు విప్పని యనమల
-
పీడీ అకౌంట్ల వివరాలను ఏపీ ప్రభుత్వం బయటపెట్టాలి
-
పీడీ అకౌంట్ల వివాదం
ఈమధ్య పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నర సింహారావు పీడీ అకౌం ట్లలో 50 వేల కోట్ల రూపాయల దాకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చ యిందని ఇది 2జీ స్కామ్ అంత పెద్ద కుంభకోణం అని పేర్కొంటూ ఒక తేనె తుట్టెను కదిపారు. రాష్ట్ర మంతా గత మూడు నాలుగు రోజులుగా ఈ అంశంపై చర్చతోనే మారుమోగుతున్నది. పీడీ అకౌంట్లు పేరుకు వ్యక్తిగత ఖాతాలుగా పేర్కొన్నా వాస్తవానికి ఇవి అధికారిక ఖాతాలే. వివిధ ప్రభుత్వ సంస్థల కార్యనిర్వహణాధికారులు వివిధ ప్రభుత్వ శాఖాధిపతులు ఈ అకౌంట్లను నిర్వహిస్తుంటారు. మార్చి నెల చివర కొత్త ఆర్థిక సంవత్సరానికి శాసన సభ బడ్జెట్‌ను ఆమోదిస్తుంది. దీంతో ద్రవ్య విని యోగ బిల్లును కూడా శాసనసభ ఆమోదించడం జరుగుతుంది. ఈ రెండూ జరిగిన తరువాతనే ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ ఖాతాలలో పరిపాలనా యంత్రాంగం ఖర్చు చేయడానికి వీలవుతుంది. ప్రభుత్వ వ్యయం ప్రధానంగా ఆర్థిక శాఖలోని రెండు శాఖాధిపతుల ద్వారా జరుగుతుంది. నీటి పారుదల, భవనాలు, రోడ్లు వంటి మూలధన ప్రాజె క్టుల ఖర్చు పనులు ఖాతాల శాఖాధిపతి ద్వారా జరు గుతుంది. ఇక సాధారణ పరిపాలన ఖర్చు జీతాలు వగైరా ఖజానా ఖాతాల శాఖాధిపతి ద్వారా జరుగు తుంది. ఈ సాధారణ పద్ధతిలో ప్రభుత్వ పద్దులలో ఖర్చు జరిగే విధానంలో నిధులు విడుదల చేసే ముందు బిల్లులను తనిఖీ చేసే విధానం ఉంటుంది. అన్నివిధాలా సరిగా ఉంటే చెల్లింపులు చేయడం లేనిచో లోపాలను ఎత్తిచూపుతూ బిల్లును తిరిగి పంపుతారు. ఈ విధానాన్ని ఆచరించకుండా బిల్లు లకు చెల్లింపు చేయటానికి ఏర్పరచిన వెసులుబాటు పీడీ అకౌంట్ విధానం. దీనిలో ఆమోదించిన మొత్తాన్ని ఏకీకృత నిధిలో ఖర్చు చూపి పీడీ అకౌంట్లో జమ చేస్తారు. ఆపైన అవసరాన్ని బట్టి శాఖాధిపతి ఈ ధనాన్ని వ్యయం చేస్తూ ఉంటారు. ఇక 2016–17 సంవత్సరం కాగ్ రిపోర్ట్ పరి శీలిస్తే పీడీ అకౌంట్ల విషయంలో రెండు మూడు ప్రధాన అంశాలను లేవనెత్తారు. దాదాపు సంవత్సర కాలంలో పీడీ అకౌంట్లకు 51 వేల కోట్లు తరలించడం జరిగిందని ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ పద్దుల కింద 22 వేల కోట్ల నిధులు ఉండగా సంవత్స రాంతానికి 26 కోట్ల మిగులు ఉందని పేర్కొన్నారు. ఇది తీవ్రమైన విషయం. రాష్ట్ర బడ్జెట్ రూ. 1,32,000 కోట్లయితే అందులో ఎటు వంటి వెసులుబాటు లేని ఖర్చు 65వేల కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని జీతా లమీద, పెన్షన్లమీద వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేస్తారు. ఇక మిగిలిన ఖర్చు 67 వేల కోట్లు. అందులో పీడీ అకౌంట్ల ద్వారా ఖర్చయిన మొత్తం 47 వేల కోట్లు. అంటే వెసులుబాటు ఉన్న ఖర్చులో 70 శాతం ఖర్చు పీడీ అకౌంట్ల ద్వారానే జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్‌ను బిల్లుల తనిఖీకి అవకాశమున్న సాధన విధానం ద్వారా కాకుండా పీడీ అకౌంట్ విధానం ద్వారా ఖర్చు పెట్టడం తప్పకుండా అను మానాలకు దారి తీసే అవకాశం ఉంది. కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాడాల్సిన పీడీ అకౌంట్ విధా నాన్ని సింహభాగం చెల్లింపుల కోసం వాడటం సరైన విధానం కాదు. ఇక కాగ్ రిపోర్ట్‌లో పేర్కొన్న రెండో ప్రధాన అంశం ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే మన రాష్ట్రంలో పీడీ అకౌంట్లు వేల సంఖ్యలో ఉన్నాయని. మన రాష్ట్రంలో పీడీ అకౌంట్లు 58 వేల దాకా ఉండగా మిగి లిన రాష్ట్రాల్లో కేవలం వందల సంఖ్యలో ఉన్నాయి. దీనికి చాలా వరకు కారణం మన రాష్ట్రంలో స్థానిక సంస్థలను వ్యవసాయ మార్కెటింగ్ సంస్థలను పీడీ అకౌంట్ల పరిధిలోకి తీసుకురావడమే. ఇది సరైన విధానం కాదు. ఆ సంస్థల నిధులను వారి సాధారణ ఖాతాలకు జమచేసి పీడీ అకౌంట్లను మూసివేయా ల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ విధంగా చేసినా ఇంకా మన రాష్ట్రంలో పీడీ అకౌంట్ల సంఖ్య పదివేల దాకా ఉండే అవకాశముంది. కాగ్ రిపోర్టులో పేర్కొన్న మరొక ప్రధాన అంశం పీడీ అకౌంట్లలోనే కాకుండా సాధారణ బ్యాంకు ఖాతాలలో కూడా 19 వేల కోట్ల రూపా యల ప్రభుత్వ ధనం ఉన్నదని, దానిని రాబట్టుకుంటే ఆర్బీఐ నుంచి ఆ సంవత్సరం తీసుకున్న రుణానికి సమానం అవుతుందని పేర్కొన్నారు. బయట బ్యాంక్ అకౌంట్లలో ఎక్కువకాలం నిధులు ఉంటే అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువ. వాటిని ప్రభుత్వ ఖాతాలో జమ చేసుకోవా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ఆర్థిక శాఖ ఒక పెద్ద చొరవ తీసుకోవడం జరిగింది. కానీ అది ఏ కారణాల వల్లనో ఆగిపోయింది.స్థూలంగా పీడీ అకౌంట్లు శాఖాధిపతులకు కొంత వెసులుబాటు కల్పిస్తాయి. కానీ ఎప్పుడో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పరిమితంగా వాడవలసిన ఈ పీడీ అకౌంట్ విధానాన్ని పరిపాటిగా అన్ని రకాల నిధుల వినియోగానికి ఉపయోగిస్తే ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతినే ప్రమాదం ఉంది. వ్యాసకర్త: ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
డీడీ మొత్తం పీడీ అకౌంట్లకు జమ
– యూటీఆర్ నెంబర్ ఇచ్చిన వారం రోజుల్లోగా డ్రిప్ మంజూరు – ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకరరెడ్డి వెల్లడి అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్లు రద్దుచేసిన తర్వాత ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డ్రిప్ కోసం కట్టాల్సిన డీడీ మొత్తాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకరరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఎంఐడీసీ సత్యనారాయణమూర్తితో కలిసి ఎంఐ ఇంజనీర్లు, ఎంఐఏవోలు, ఇరిగేషన్ కంపెనీ డీసీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకు కేటాయించిన 35 వేల హెక్టార్ల లక్ష్యంలో ఇప్పటివరకు 11 వేల హెక్టార్లకు మంజూరు చేశామన్నారు. ఇంకా లక్ష్యసాధన ఎక్కువగా ఉన్నందున పరిశీలన, కంప్యూటరీకరణ, మంజూరు, ఇన్స్టాలేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలన్నారు. మీ–సేవాలో వచ్చిన దరఖాస్తులను వందశాతం ప్రాథమిక పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. చాలా వరకు డబుల్ రిజిష్ట్రేషన్లు ఉన్నందున వడపోత కార్యక్రమం చేయాలన్నారు. ఇప్పటికే 18 వేల దరఖాస్తులు డబుల్ రిజిస్ట్రేషన్ల కింద తేలాయన్నారు. పీఐఆర్ తర్వాత అర్హత జాబితా సిద్ధంచేసి రైతులతో డీడీలు కట్టించాలని తెలిపారు. డీడీలు కట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని రైతు అకౌంట్లలో జమ చేయించి అక్కడి నుంచి ఆర్టీజీఎస్ ద్వారా ఏపీఎంఐపీ పీడీ ఖాతాల్లోకి జమ చేయించాలని సూచించారు. ఈ క్రమంలో బ్యాంకర్లు ఇచ్చే యుటీఆర్ నెంబర్‌ను దరఖాస్తుకు జత చేస్తే సరిపోతుందన్నారు. యూటీఆర్ నెంబర్ వచ్చిన వారం రోజుల్లోగా డ్రిప్ మంజూరు చేస్తామన్నారు. మంజూరు చేసిన వెంటనే రైతులు తమ పొలాల్లో గుంతలు (ట్రెంచ్) తవ్వుకోవాలన్నారు. లేదంటే డ్రిప్ యూనిట్లు రద్దు చేస్తామన్నారు. గుంతలు తవ్వుకున్న వారం రోజుల్లోగా పొలాల్లో పరికరాలు అమర్చి ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. బోరుబావులున్న ప్రతి రైతుకూ డ్రిప్ యూనిట్లు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఏవోలు, కంపెనీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా సమస్యలుటే 18004252960 టోల్‌ఫ్రీ నెంబర్‌కు గాని, లేదంటే పీడీ–79950 87057, ఏపీడీ–79950 87058, ఎంఐడీసీ–79950 10045 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ఆన్లైన్లో పీడీ ఖాతాల నిర్వహణ
- మే ఒకటి నుంచి అమలు - ఆగస్టు నుంచి నూరుశాతం చెల్లింపులు - ఆన్లైన్లోనే - ఖజానా శాఖ అదనపు సంచాలకుడు హనుమంతరావు వెల్లడి విజయవాడ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే పర్సనల్ డిపాజిట్ (పీడీ) ఖాతాలను మే ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఖజానా శాఖ అదనపు సంచాలకుడు బీఎల్ హనుమంతరావు తెలిపారు. గురువారం విజయవాడ లయోలా క ళాశాలలో కృష్ణా, గుంటూరు జిల్లాల ఖజానా సిబ్బంది, పీడీ ఖాతాలు నిర్వహించే కార్యాలయ అధికారులు, సంస్థల సిబ్బందికి ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం విడుదల చేసే నిధుల ఖాతాలను పూర్తి పారదర్శకతతో నిర్వహించాల్సి ఉందన్నారు. దీని కోసం సంబంధిత శాఖాధిపతులు జవాబుదారీతనంతో కూడిన పీడీ ఖాతాల నిర్వహణ చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, డ్వామా, డీఆర్డీఏ తదితర సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు నిర్వహించే అన్ని పీడీ ఖాతాలూ ఆన్లైన్ విధానానికి అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిధుల ఖర్చులను సరళీకృత విధానంలో నిర్వహించేందుకు గాను పర్సనల్ డిపాజిట్ పోర్టల్‌ను అభివృద్ధి పరచినట్లు తెలిపారు. దీనిని ట్రెజరీ పోర్టల్‌కు అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. ఖాతా నిర్వహణ, జమా ఖర్చుల చెల్లింపులకు సంబంధించి అన్ని అంశాలు ఆన్లైన్లోనే లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ విధానంలో చెక్కుల ద్వారా జరిపే చెల్లింపులను నిలిపివేస్తూ ఆన్లైన్ విధానంలోనే లావాదేవీలు నిర్వహిస్తామన్నారు. సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించడంలో భాగంగా ఆన్లైన్, ప్రస్తుతం నిర్వహిస్తున్న విధానాన్ని సమాంతరంగా మూడు నెలలపాటు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి నూటికి నూరు శాతం పీడీ ఖాతాలకు ఆన్లైన్ ద్వారానే నగదు చెల్లింపులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. విజయవాడ ట్రెజరీకి నూతన కార్యాలయం ఏర్పాటు విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలోని ప్రస్తుత తూర్పు ఖజానా కార్యాలయం నిర్వహిస్తున్న ప్రాంగణంలోనే పబ్లిక్, ప్రైవేటు సమన్వయంతో పశ్చిమ, తూర్పు ఖజానా కార్యాలయాల నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే కార్యాలయాలను సొంత భవనాల్లో ఏర్పాటు చేసుకునే విధానంలో భాగంగా ఖజానా కార్యాలయాల నిర్మాణం త్వరలో చేపట్టి పూర్తిచేస్తామన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఖజానా శాఖ డెప్యూటీ డెరైక్టర్లు కె.సురేంద్రబాబు, ఎన్.నాగేశ్వరరావు, సీఆర్డీఏ డెప్యూటీ డెరైక్టర్ కె.పాలేశ్వరరావు, హైదరాబాద్ ఖజానా కార్యాలయం సహాయ సంచాలకుడు కె.అచ్యుతరామయ్య, విజయవాడ జిల్లా ఖజానా అధికారి కేడీవీఎం ప్రసాద్ పాల్గొన్నారు.