– యూటీఆర్ నెంబర్ ఇచ్చిన వారం రోజుల్లోగా డ్రిప్ మంజూరు
– ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకరరెడ్డి వెల్లడి
అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్లు రద్దుచేసిన తర్వాత ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డ్రిప్ కోసం కట్టాల్సిన డీడీ మొత్తాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకరరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఎంఐడీసీ సత్యనారాయణమూర్తితో కలిసి ఎంఐ ఇంజనీర్లు, ఎంఐఏవోలు, ఇరిగేషన్ కంపెనీ డీసీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకు కేటాయించిన 35 వేల హెక్టార్ల లక్ష్యంలో ఇప్పటివరకు 11 వేల హెక్టార్లకు మంజూరు చేశామన్నారు.
ఇంకా లక్ష్యసాధన ఎక్కువగా ఉన్నందున పరిశీలన, కంప్యూటరీకరణ, మంజూరు, ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలన్నారు. మీ–సేవాలో వచ్చిన దరఖాస్తులను వందశాతం ప్రాథమిక పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. చాలా వరకు డబుల్ రిజిష్ట్రేషన్లు ఉన్నందున వడపోత కార్యక్రమం చేయాలన్నారు. ఇప్పటికే 18 వేల దరఖాస్తులు డబుల్ రిజిస్ట్రేషన్ల కింద తేలాయన్నారు. పీఐఆర్ తర్వాత అర్హత జాబితా సిద్ధంచేసి రైతులతో డీడీలు కట్టించాలని తెలిపారు.
డీడీలు కట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని రైతు అకౌంట్లలో జమ చేయించి అక్కడి నుంచి ఆర్‌టీజీఎస్ ద్వారా ఏపీఎంఐపీ పీడీ ఖాతాల్లోకి జమ చేయించాలని సూచించారు. ఈ క్రమంలో బ్యాంకర్లు ఇచ్చే యుటీఆర్ నెంబర్‌ను దరఖాస్తుకు జత చేస్తే సరిపోతుందన్నారు. యూటీఆర్ నెంబర్ వచ్చిన వారం రోజుల్లోగా డ్రిప్ మంజూరు చేస్తామన్నారు. మంజూరు చేసిన వెంటనే రైతులు తమ పొలాల్లో గుంతలు (ట్రెంచ్) తవ్వుకోవాలన్నారు. లేదంటే డ్రిప్ యూనిట్లు రద్దు చేస్తామన్నారు.
గుంతలు తవ్వుకున్న వారం రోజుల్లోగా పొలాల్లో పరికరాలు అమర్చి ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. బోరుబావులున్న ప్రతి రైతుకూ డ్రిప్ యూనిట్లు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఏవోలు, కంపెనీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా సమస్యలుటే 18004252960 టోల్‌ఫ్రీ నెంబర్‌కు గాని, లేదంటే పీడీ–79950 87057, ఏపీడీ–79950 87058, ఎంఐడీసీ–79950 10045 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
డీడీ మొత్తం పీడీ అకౌంట్లకు జమ
Published Sat, Nov 19 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
Advertisement
Advertisement